Sunday Motivation: బుద్ధుడి నుంచి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన ఆరు జీవిత పాఠాలు ఇవి
Sunday Motivation: గౌతమ బుద్ధుడు పేరు వింటేనే ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆయన ముఖం ఎప్పుడు చూసినా కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉన్నట్టే ఉంటుంది. ఆ వ్యక్తి నుంచి మనం నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఎన్నో ఉన్నాయి.
Sunday Motivation: ప్రపంచంలో ప్రజలు అనుసరిస్తున్న ప్రధాన మతాలలో బౌద్ధ మతం ఒకటి. సిద్ధార్థుడిగా పుట్టిన ఓ రాజు జ్ఞానోదయం పొందాక గౌతమ్ బుద్ధుడిగా మారాడు. ఈ బౌద్ధమతం 2500 సంవత్సరాల క్రితం నుంచి మనుగడలో ఉందని చరిత్ర చెబుతోంది. గౌతమ్ బుద్ధుడు గుర్తొస్తే చాలు ప్రశాంతమైన ముఖం కళ్లముందు కదులుతూ ఉంటుంది. జీవితంలో ఎవరైతే హింసకు దూరంగా, ప్రశాంతంగా జీవించాలనుకుంటారో వారు గౌతమ్ బుద్ధుడిని అనుసరించాలనుకుంటారు.
జ్ఞానోదయం అయ్యాక గౌతమ బుద్ధుడు చెప్పిన ప్రతి మాట జీవితానికి ఒక పాఠంగా మారింది. ద్వేషాన్ని ద్వేషంతో ఎవరూ జయించలేరు... ద్వేషాన్ని జయించాలంటే ప్రేమే కావాలి అని ఆయన చెప్పిన మాటలు అక్షరాలా నిజం. ఆరోగ్యమే గొప్ప బహుమతి.. సంతృప్తి గొప్ప సంపద అన్న గౌతమ్ బుద్ధుని మాటలు ఎప్పటికీ ఆచరణీయమైనవే.
జ్ఞానోదయం అయ్యాక బుద్ధ భగవానుడు నేటి ప్రజలకు ఎన్నో బోధనలు చేశాడు. ఇప్పటికే మిలియన్ల మంది అతను చూపించిన ఆధ్యాత్మిక ప్రయాణంలో సాగుతున్నారు. బౌద్ధమతాన్ని అనుసరించినా, అనుసరించకపోయినా బుద్ధ భగవానుడు చెప్పిన బోధనలు మాత్రం ప్రతి ఒక్కరూ ఆచరించదగినది.
బుద్ధుడు చెప్పిన ప్రకారం ప్రజలు ఏం చేసినా అది బుద్ధిపూర్వకంగా మనస్సాక్షిగా చేయాలి. అప్పుడే వారు తమ ఆలోచనలు, భావోద్వేగాలు, పనులు గురించి స్పష్టంగా తెలుసుకోగలుగుతారు. విషయాలను కూడా మర్చిపోతూ ఉంటారు.
జీవితంలో ఏదీ శాశ్వతం కాదని అందరూ తెలుసుకోవాలి. బుద్ధ భగవానుడు జీవితంలో మార్పు సహజమని బోధించారు. అంగీకరించడం, వదిలిపెట్టడం అనేది ప్రతి జీవితంలో జరిగేది. వాటికి ముందుగానే సిద్ధపడి ఉండాలి. ఏ పని చేసినా భవిష్యత్తు ఫలితాల కోసం ఆలోచించకూడదు. ప్రతి క్షణాన్ని వినియోగించుకోవాలి.
అందరి పట్ల సానుభూతి, దయతో ఉండడం బుద్ధ భగవానుడి బోధనల్లో ముఖ్యమైనది. దయా, కరుణా ఉన్నవారు ఎదుటివారితో లోతుగా కనెక్ట్ అవుతారు. చుట్టూ ఉన్న ప్రపంచంలోని బాధలను కూడా అధిగమించగలరు. ఎవరైతే తమ జీవితంలో సానుభూతిని, దయను కలిగి ఉంటారో వారు ఉన్నతమైన జీవితాన్ని గడుపుతారు.
అహంకారంతో ఉండే మనిషి తన కోపానికే కాలిపోతాడు. అహం అనుబంధాలను దూరం చేస్తుంది. స్నేహితుల మధ్య దూరం పెంచుతుంది. ఇది సంఘర్షణకు, అసంతృప్తికి దారితీస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అహాన్ని వదిలివేయాలి. ఎవరైతే అహంకారాన్ని వదిలిపెడతారో వారు త్వరగా ఎదగగలుగుతారు.
భౌతిక సుఖాలపై అధిక వ్యామోహాలను విడిచి పెట్టాలి. కోరికలు ఎక్కువైతే కష్టాలు పెరుగుతాయి. సమస్యలు కొని తెచ్చుకున్నవారు అవుతారు. ఎలాంటి సుఖాలకు లోను కాకుండా ఉండే వ్యక్తి తక్కువ సమస్యలను ఎదుర్కొంటాడు.
పైన చెప్పినవన్నీ బౌద్ధమతం స్వీకరించిన వ్యక్తులే కాదు సాధారణ ప్రజలు కూడా అనుసరించదగ్గవి. వీటిని పాటిస్తే ప్రతి ఒక్కరి జీవితం తేలికగా మారుతుంది. కష్టాలు, సమస్యలు కూడా దూది పింజల్లా తేలికగా అనిపిస్తాయి.
గౌతమబుద్ధుడు బోధనల్లో నిత్యం పఠించాల్సిన త్రిరత్నాలు ఉన్నాయి. అవి బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. వీటిని తలచుకుంటూ మనిషి సరైన దిశలో అహింసాయుతంగా జీవించాలన్నది బుద్ధుడి ముఖ్య ఆశయం.