Sunday Motivation: ఈ 5 అలవాట్లు ఉన్నవాళ్లు జీవితంలో ఎప్పుడూ సంతోషంగా ఉండలేరు, మీకు ఈ అలవాట్లు ఉంటే వెంటనే మానుకోండి!
Sunday Motivation: ప్రతిసారి ఎవరో వచ్చి మిమ్మల్ని బాధపెట్టాల్సిన అవసరం లేదు. మీకున్న కొన్ని అలవాట్లే మిమ్మల్ని ఎక్కువ బాధపడేలా చేస్తాయి. వీటిని మానుకున్నారంటే సంతోషంగా, సానుకూలంగా జీవించవచ్చు. మిమ్మల్ని ఎల్లప్పుడూ బాధపెట్టే కొన్ని అలవాట్ల గురించి తెలుసుకోండి.
మీరు నిజంగా సంతోషంగా ఉన్నారా.. లేక సంతోషంగా ఉన్నట్లు నటిస్తున్నారా? ఒక క్షణం ఆగి ప్రశాంతంగా ఆలోచించుకోండి. ఎందుకంటే చాలా మంది బయటికి సంతోషంగా కనిపిస్తారు కానీ లోపల బాధపడతూ ఉంటారు. కష్టం వచ్చినప్పుడు ఎవరికైనా బాధ కలుగుతుంది. కానీ దాన్ని మర్చిపోవాలి, బాధ నుంచి బయటపడి సంతోషాన్ని వెతుక్కోవాలి.
సంతోషం వెతుక్కుంటూ రాదు..
కొంతమందికి ఎప్పుడూ బాధపడుతూ ఉండటం, నిరాశతో జీవించడం అలవాటైపోయింది. నిజానికి ఇది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే స్వీయ సంతోషం ఉంటేనే ఏదైనా సాధించగలరు. అంటే మీపై మీకు నమ్మకం ఉండాలి, మీరంటే మీరు ఒక సంతృప్తి ఉండాలి, మిమ్మల్ని తలచుకుని మీరు సంతోషించాలి, గర్వించాలి. ఇలాంటప్పుడు దేన్నైనా సాధించగలుగుతారు. ఎన్ని యుద్దాలైనా గెలుస్తారు. సంతోషంగా జీవిస్తారు. సంతోషం అనేది ప్రత్యేకంగా మిమ్మల్ని వెతుక్కుంటూ రాదు.. దానికి మీరే స్వయంగా సొంతం చేసుకోవాలి.
జీవితంలో కష్టం, సుఖం, సంతోషం, బాధ ఇవన్నీ సహజమే. వీటికి తగ్గట్లుగా మనసును ఎప్పుడూ సిద్థం చేసుకోవాలి. కష్టాలను మాత్రమే తలచుకుంటూ ఎప్పుడూ బాధపడుతూ కూర్చోవద్దు. నిజానికి మీకున్న కొన్ని అలవాట్లు కారణం లేకుండానే సమస్య రాకుండానే మిమ్మల్ని ఎప్పుడూ బాధిస్తాయి. మీలో ప్రతికూలతను నింపుతాయి. కాబట్టి మీరు ప్రశాంతంగా ఉండాలంటే మీరు వదిలించుకోవాల్సిన కొన్ని ప్రతికూల అలవాట్లు ఉన్నాయి. అవేంటో తెలుసుకుని మీ జీవితాన్ని సంతోషంగా, మెరుగ్గా మార్చుకోండి.
మిమ్మల్ని మీరే బాధపెట్టుకునే అలవాట్లు..
1. ఎప్పుడూ ఇతరులతో పోల్చుకోవడం:
జీవితంలో ప్రతి ఒక్కరూ ఇతరుల మంచి స్థాయిలో ఉండాలనుకుంటారు. ఇందులో తప్పు లేదు. కానీ ఇతరుల కన్నా ముందు ఉండాలి, వారి కన్నా నేను ఎక్కువ స్థాయిలో ఉండాలి అనుకోవడం పొరపాటు. మీ సంతోషాన్ని పాడు చేసే అలవాట్లలో ఇతరులతో పోల్చుకోవడం అనేది అన్నింటి కన్నా ముఖ్యమైనది. ఇలా ఇతరుల పోల్చుకోవడం వల్ల మానసిక అశాంతి, ఒత్తిడి, బాధ తప్ప మరే ఉపయోగం ఉండదు. ఎందుకంటే వారి జీవితం వేరు మీ జీవితం వేరు. ఇతరుల పరిస్థితి వేరు మీ పరిస్థితి వేరు. దీన్నీ మీరు అర్థం చేసుకోవడం చాలా అవసరం.
ఇతరులతో పోల్చుకోకుండా, మిమ్మల్ని మీరే పోల్చుకోవడం ప్రారంభించండి. గతంలో మీరు ఎలా ఉండేవారు, ఇప్పుడు మీరు ఎంత మెరుగయ్యారు అనే విషయాలను తలుచుకుని గర్వంగా ఫీలవండి. సంతోషంగా జీవించడానికి ఇది చక్కటి మార్గం.
2. ప్రతి విషయాన్ని అతిగా ఆలోచించడం:
చింత చితిలాంటిది అనే సామెత మీరు వినే ఉంటారు. ఇది నిజంగా నిజమే. కష్టం వచ్చినప్పడు కాస్త బాధపడటం, ఆందోళన చెందడం సహజమే. మిమ్మల్ని మీరు మరింత మెరుగు చేసుకోవడానికి ఇది అవసరం కూడా. కానీ చిన్న చిన్న సమస్యలను పెద్దవిగా చూసే అలవాటు మంచిది కాదు. ఈ అలవాటు ఉంటే జీవితంలో సంతోషంగా ఉండటం చాలా కష్టం అవుతుంది.
ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి జీవితంలో మీరు చేయాల్సిన దాని గురించి ఎప్పుడూ బాధపడకండి. మీ శక్తి మేరకు, మీ ఆలోచన మేరకు మీరు కష్టపడండి. మిగతాది కాలానికి దేవుడికి వదిలేయండి.
3. బాధలు మీకే ఉన్నాయని అనుకోకండి:
నేను దురదృష్టవంతుడిని నాకే అన్నీ బాధలు ఉన్నాయి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. నిజానికి సంతోషం, బాధలు, ఆటుపోట్లు అనేవి అందరి జీవితంలోనూ ఉంటాయి. ఎవరి బాధలు వాళ్లే భరించాల్సి ఉంటుంది. ఎవరి కష్టం వారే పడాల్సి ఉంటుంది.
మీకు మాత్రమే బాధలు, కష్టాలు ఉన్నాయనీ, మీకు అంతా చెడే జరుగుతుంది అని అనుకోవడం మానేయండి. ప్రపంచమంతా మీకు వ్యతిరేకంగా ఉందనే భావన నుంచి బయటికి రండి. ఇలాంటి మనస్తత్వం మిమ్మల్ని ఎల్లప్పుడూ బాధపెడుతూనే ఉంటుంది. మీ సంతోషానికి మీరే మీ సంతోషానికి బాధ్యత వహించండి. బాధితుడిగా ఫీలవకుండా ఎల్లప్పుడూ సానుకూలంగా, ఆత్మవిశ్వాసంతో ఉండండి. అప్పుడే సంతోషంగా జీవించగలుగుతారు.
4. అసూయపడటం, ఫిర్యాదులు చేయడం:
స్నేహితుడికి ఉద్యోగంలో పదోన్నతి వచ్చింది, స్నేహితురాలు గోవా పర్యటన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది, ఎదురింటి వాళ్లు రెండో అంతస్తు కడుతున్నారు, పొరుగింటి వాళ్లు బాగా సంపాదిస్తున్నారు.. అందరూ బాగానే ఉన్నారు నేను ఎందుకు ఇలాగే మిగిలిపోయాను? ఇలా ఆలోచించడం వల్ల మీరు ఇతరులను అసూయపడతారు.
ఈ అలవాటు గనక మీకు ఉంటే మీరు సంతోషంగా ఉండటం అసాధ్యం అవుతుంది. సంతోషంగా, సానుకూలంగా ఉండాలంటే, ఇతరుల సంతోషాన్ని మీరు సంతోషించండి. మీ జీవితంలోని సమస్యల గురించి ఫిర్యాదు చేయడం కంటే పరిష్కారాలను వెతకండి, విషయాలను మరింత మెరుగుపరచడానికి ప్రయత్నించండి.
5. గతంలో చిక్కుకుపోవడం ప్రస్తుతాన్ని పక్కన పెట్టేయడం
ప్రతి ఒక్కరికీ గతం ఉంటుంది. కొందరికి గతం వర్తమానం కంటే మెరుగైనదిగా అనిపిస్తుంది. మరి కొందరికి గతం కంటే ప్రస్తుతం బాగుంటుంది. ఏదేమైనా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే.. రేపటి రోజున అంటే మీ భవిష్యత్తు మీ గతం వర్తమానం కంటే మెరుగైనదిగా మారచ్చు.
కాబట్టి జరిగినదాన్ని మంచి జ్ఞాపకాలుగా మలుచుకుంటూ ముందుకు సాగండి. మీకు మీరే మెరుగవ్వండి. గతంలో చిక్కుకుపోయి ప్రస్తుతాన్ని పక్కన పెట్టేయకండి. భవిష్యత్తును నాశనం చేసుకోకండి.
సంబంధిత కథనం