Sunday Motivation: జీవితంలో ఈ భావన పూర్తిగా వదిలేయండి.. ఉన్నతస్థాయికి చేరే అవకాశాలు పెరుగుతాయి
Sunday Motivation: ఆత్మన్యూనత జీవితానికి చాలా అడ్డంకిగా ఉంటుంది. అవకాశాలను దూరం చేస్తుంది. అందుకే ఈ భావనను త్యజించేయాలి. అందుకు ఏం చేయాలో ఇక్కడ తెలుసుకోండి.
ఆత్మన్యూనత భావనతో చాలా మందిలో ఆత్మవిశ్వాసాన్ని అణచివేస్తూ ఉంటుంది. ఎప్పుడూ ఇతరుల కంటే తాము తక్కువ అని భావిస్తుంటారు. దీంతో జీవితంలో వచ్చిన చాలా అవకాశాలను వాడుకోలేకపోతుంటారు. శారీరక, సామాజిక, ఆర్థిక సహా చాలా విషయాల్లో ఆత్మన్యూనత ఉంటుంది. వ్యక్తిగతంగా వేర్వేరు అంశాలపై చాలా మంది ఈ భావనతో కుంగిపోతుంటారు. దీనివల్ల చాలా నష్టాలు కలుగుతాయి. అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సందేహిస్తుంటారు. అభిప్రాయాలను బయటికి చెప్పకుండా మదనపడుతుంటారు. అన్నింటికీ వెనక్కి వెళుతుంటారు. దాదాపు అందరూ ఏదో దశలో ఏదో విషయంపై దీన్ని ఎదుర్కొని అంటారు. అయితే కొందరిలో మరీ ఎక్కువగా ఉంటుంది. జీవితంలో ఆత్మన్యూనతను కచ్చితంగా అధిగమించాల్సిందే.
ఎవరికి కంటే తక్కువ కాదనుకోవాలి
ఎదుటి వారి కంటే తాము తక్కువ అని అనుకోవడమే ఆత్మనూన్యతకు ప్రధానంగా ఉంటుంది. ఏ విషయంలో అయినా తమను తాము అల్పులమని అనుకోవడం మానేయాలి. ఆత్మవిశ్వాసాన్ని నింపుకోవాలి. తాము అనుకుంటున్నది వాస్తవమేనా, అందుకు అర్థముందా అనేది ఆలోచించుకోవాలి. ఏ విషయంలో ఆత్మన్యూనతకు గురవుతున్నామనేది విశ్లేషించుకొని.. దాన్ని అధిగమించేలా అడుగులు వేయాలి. ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగాలి.
ఏమనుకుంటున్నారో అనే చింత వద్దు
‘నా గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో’ అని ఆలోచిస్తూ చాలా మంది ఆత్మన్యూనతకు గురవుతుంటారు. కొన్నిసార్లు అవతలి మన వాళ్లు గురించి ఆలోచించకపోయినా అలా ఊహించుకుంటూ ఉంటారు. ఇలాంటి ఆలోచనలు పూర్తిగా మానేయాలి. ఎదుటి వ్యక్తులు ఏమనుకున్నా మీ అభిప్రాయమే ముఖ్యమని అనుకోవాలి. మీ మనసులో ఉన్నది చెప్పేయాలి. చేయాలనున్నది ఆత్మవిశ్వాసంతో చేసేయాలి. ఏదైనా అవకాశం వస్తే తటపటాయించుకుండా.. ఎవరు ఏమనుకుంటారోననే సంశయం లేకుండా ముందడుగు వేసి కృషి చేయాలి.
ఏ విషయమో గుర్తించాలి
అసలు మీరు ఏ విషయంలో ఎక్కువగా ఆత్మన్యూనతకు గురవుతున్నారో ఆలోచించాలి. ఏ అంశం వచ్చినప్పుడు చిన్నబుచ్చుకొని వెనక్కి వెళుతున్నారో గుర్తించాలి. అందుకు ఏ పరిస్థితులు కారణంగా ఉన్నాయో, గతంలో జరిగిన ఘటనలు ఏమైనా ప్రభావం చూపుతున్నాయా అనేది విశ్లేషించుకోవాలి. దీనిద్వారా మీ విషయంలో న్యూనత చెందకుండా ఉండేందుకు చర్యలు ప్రభావంతంగా తీసుకోవచ్చు. సమస్య నుంచి బయటపడొచ్చు.
మీతో మీరు మాట్లాడుకోండి
మీతో మీరు పాజిటివ్‍గా మాట్లాడుకోవడం అలవాటు చేసుకోవాలి. మీ చర్యలను మీరు విశ్లేషించుకోవాలి. ఏ విషయంలో అయినా భయపడుతుంటే, వెనక్కి తగ్గుతుంటే.. నిజంగా దానికి అలా ఆలోచించడం కరెక్టేనా అనేది ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఏ అంశంలో అయినా మిమ్మల్ని మీరు తక్కువ చేసుకొని ఆలోచించడం మానేయాలి. ఎప్పుడూ మీతో మీరు పాజిటివ్ టాక్ చేయాలి. ఏదైనా సాధించగలమే నమ్మకాన్ని మీ మెదడులో నింపేయాలి. దీంతో ఆత్మన్యూనత భావం చాలా తగ్గుతుంది. వచ్చిన అవకాశాలను ముందుకు వచ్చి అందిపుచ్చుకొని జీవితంలో ఎదిగే ఛాన్స్ పెరుగుతుంది.
పోల్చుకోవద్దు.. ఎదుటివారిలా ఉండాలనుకోవద్దు
జీవితంలో ఎప్పుడూ ఎదుటివారితో మనల్ని పోల్చుకోకూడదు. ఎందుకంటే ప్రతీ వ్యక్తి పరిస్థితులు విభిన్నంగా ఉంటాయి. అవసరమైతే స్ఫూర్తిగా తీసుకోవాలే తప్ప.. పోల్చుకుంటూ తక్కువగా ఫీల్ అవకూడదు. మీరు చేయాల్సిన పనిపైనే పూర్తిగా ఫోకస్ పెట్టాలి. అలాగే, ఎప్పుడు ఎదుటి వారిలో ఉండాలని ప్రయత్నించకూడదు. దీనివల్ల కూడా ఆత్మన్యూనత భావం ఏర్పడుతుంది. మీ శైలిలో మీరు ముందుకు సాగుతూ మెరుగవుతూ ఉండాలి. ఏదైనా ఛాన్స్ వస్తే గతంలో జరిగిన విషయాలను గుర్తు తెచ్చుకొని భయపడకుండా ఒడిసిపట్టుకోవాలి.