Sunday Motivation: ఏదో ఒకటి కాదు... మీరు అనుకున్నదే సాధించండి, అప్పుడే మీరు నిజమైన విజేత
Sunday Motivation: ఏదో ఒకటి సాధించేసి విజేత అనుకోవద్దు. మీరు చిన్నప్పటినుంచి ఏం కావాలనుకుంటున్నారో, దాన్ని సాధించి నిజమైన విజేతగా మారండి.
Sunday Motivation: ఎంతోమందికి చిన్నప్పటినుంచి ఏదో ఒక కల ఉంటుంది. లక్ష్యం ఉంటుంది. ఒకరు తాము హీరో అవ్వాలని కోరుకుంటే, మరొకరు గొప్ప ఫుట్‌బాల్ ప్లేయర్ కావాలని కోరుకుంటారు. కానీ ఆ కలలను సాకారం చేసుకునే వారి సంఖ్య తక్కువే. ప్రపంచంలో విజయం సాధించిన కళాకారులు, సంగీతకారుల విజయం వెనుక ఉన్నది 80 శాతం కృషి అయితే మరో 20 శాతం వారి నైపుణ్యం. కాబట్టి మీ నైపుణ్యానికి పదును పెట్టాలంటే మీరు ఎంతో కృషి చేయాలి. జీవితంలో ఏదో ఒకటి సాధించి తాము విజేత అయ్యామని అనుకునే వారి సంఖ్య ఎక్కువే. నిజమైన విజేత అంటే చిన్నప్పటినుంచి ఏం కావాలని కోరుకుంటారో... దేనికోసం అయితే కలలగంటారో... అది సాధించిన వారే అసలైన విజేత.

విజయం అంటే ఏదో ఒకటి సాధించడం కాదు. మీకు ఏదైతే జీవితంలో విలువైనదిగా కనిపిస్తుందో, దాన్ని మీరు పొంది చూడండి. అప్పుడు తెలుస్తుంది విజయంలోని అసలైన రుచి. అవకాశం కోసం ఎదురుచూసే కన్నా, మీరే అవకాశాలను వెతుక్కుంటూ వెళ్లడం అలవాటు చేసుకోండి. అప్పుడు విజయం వైపుగా మీరు ప్రయాణం చేస్తున్నట్టే. దానికి కావాల్సింది ఉత్సాహం, చురుకుదనం, విజయం సాధించాలన్న కసి. వీటన్నింటికీ మించి కష్టపడే లక్షణం ఉండాలి.
జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అనుకునేవారు ఎప్పుడూ ఖాళీగా ఉండరు. మీరు ఖాళీగా ఉన్నారంటే మీరు విజేత అయ్యే అవకాశాన్ని తగ్గించుకుంటున్నారని అర్థం. విజయం ఎప్పుడూ భారంగా అనిపించదు. అది చాలా తేలికగా ఉంటుంది. కానీ దాని కోసం చేసే ప్రయాణం మాత్రం కాస్త భారంగానే ఉంటుంది. తేలికైన విజయాన్ని జీవితాంతం మోయవచ్చు. కాని దాన్ని సాధించడానికి ముళ్ళదారులను దాటుకుంటూ వెళ్ళాలి.
కొంతమంది పని చేయడానికి ఏమీ లేదంటూ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. అలా చేస్తున్నారంటే వారి జీవితంలో ఎదుగు బొదుగు ఉండదని అర్థం. అలాంటి స్థితి మీరు తెచ్చుకోకండి. పారే నది ఎప్పుడూ విశ్రాంతి తీసుకోదు. కొత్త నీటిని కలుపుకుంటూ ప్రవహిస్తూనే ఉంటుంది. అలాగే మీరు కూడా పరిస్థితులలో అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకు సాగుతూనే ఉండాలి. అప్పుడే మీ ప్రయాణం మరింత చైతన్యవంతంగా ఉంటుంది.
కష్టపడే సమయంలో విశ్రాంతి తీసుకుంటే, విశ్రాంతి తీసుకున్న సమయంలో కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి యవ్వనం మీ చేతుల్లో ఉన్నప్పుడే విజేతగా నిలిచేందుకు ప్రయత్నించండి. మీ కలలను సాకారం చేసుకునేందుకు అడుగులు వేయండి.
అబద్ధపు మాటలు, చేష్టలు, అపనమ్మకాలు ఎక్కడో దగ్గర కూలిపోతాయి. కానీ మీ కష్టం, వాస్తవం మాత్రం చివరి వరకు నిలబడి ఉంటాయి. మీ మానసిక ఆరోగ్యాన్ని కలుషితం చేసుకోకుండా జీవితంలో విజయాన్ని అందుకోవడానికి పరుగులు పెట్టండి. మీరు విజయం సాధించాలంటే వెతకాల్సింది విజయాన్ని, కానీ విశ్రాంతిని కాదు. విజయం సాధించినప్పుడు ఆ క్షణాలు చాలా అందమైనవిగా ఉంటాయి, మర్చిపోలేనివిగా ఉంటాయి. మీ జీవితం ఇతరులకు స్ఫూర్తివంతంగా మారుతుంది. అంత ఎత్తుకు మీరు ఎదగాలంటే ఇప్పటినుంచే పని చేయడం ప్రారంభించండి.
మీ మనసును మొదట మీ అదుపులోకి తెచ్చుకోండి. మనసు ఎప్పుడు అదుపులో ఉంటుందో మీ జీవితం మీ చేతుల్లో ఉంటుంది. అన్ని నష్టాలకు, కష్టాలకు మనసే కారణం. అదే మనసు మీ నియంత్రణలో ఉంటే విజయాన్ని అందుకునేందుకు సహాయపడుతుంది. కాబట్టి మొదట మనసుపై పట్టు సాధించండి.