Sunday Motivation : అవమానాలే ఆభరణాలు.. ఛీత్కారాలే సత్కారాలు.. ఈ స్టోరీ చదవండి-sunday motivation never feel with insults answer to them with your win read this inspiration story ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sunday Motivation : అవమానాలే ఆభరణాలు.. ఛీత్కారాలే సత్కారాలు.. ఈ స్టోరీ చదవండి

Sunday Motivation : అవమానాలే ఆభరణాలు.. ఛీత్కారాలే సత్కారాలు.. ఈ స్టోరీ చదవండి

Anand Sai HT Telugu
Apr 21, 2024 05:00 AM IST

Sunday Motivation : అదృష్టం లేని జీవితం ఉంటుందేమో.. కానీ అవమానాలు లేని జీవితం ఉండదు. కానీ అవమానాలను పట్టించుకోకుండా ముందుకు సాగితేనే విజయం మీ సొంతం.

ఆదివారం మోటివేషన్
ఆదివారం మోటివేషన్ (Unsplash)

జీవితం అంటేనే ఎన్నో మలుపులు ఉంటుంది. ఎంతో మంది అవమానించేవారు ఉంటారు. అయితే వందలో తొంభై మంది అవమానాలకు కుంగిపోతారు. ఇక అక్కడే ఆగిపోతారు. అందుకే జీవితంలో ముందుకు సాగలేరు. అవమానాలను అలా తీసుకుంటే మీకే నష్టం. మిమ్మల్ని అవమానించినవారికి సరైన సమాధానం చెబితేనే కదా.. మీరంటే ఏంటో వారికి తెలిసేది. అందుకే అవమానాలు ఎదుర్కోవాలి. జీవితాన్ని ఈజీగా తీసుకోవద్దు.

ఇటీవల సివిల్స్ ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మందికి వచ్చాయి. అయితే ఇందులో ఒక్కొక్కరి బ్యాక్ గ్రౌండ్ ఒక్కోలా ఉంది. అందరూ కసితో సివిల్స్ సాధించారు. ఇందులో ఉదయ్ కృష్ణారెడ్డిది ప్రత్యేకం. ఎందుకంటే ఆయనను అవమానించారనే కోపంతో సివిల్స్ ప్రిపేర్ అయి సాధించారు.

ఏపీలోని ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం ఊళ్లపాలెం గ్రామానికి చెందిన ఉదయ్ కృష్ణారెడ్డి 2012లో కానిస్టేబుల్ ఉద్యోగం సాధించారు. 2019 వరకూ ఇదే జాబ్ చేశారు. దాదాపు 60 మంది ముందు.. తనను సీఐ అవమానించారు. దీనితో ఉదయ్ కృష్ణారెడ్డి ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నారు. కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేసి సివిల్స్ ప్రిపేర్ అయ్యారు. మూడు ప్రయాత్నాలు చేసినా రాలేదు. నాలుగో ప్రయత్నంలో సివిల్స్ ర్యాంక్ సాధించారు.

ఇలా చేయడం ఎంతమందికి సాధ్యం అవుతుంది? ఉదయ్ కృష్ణారెడ్డిని సీఐ తిట్టడంతో కుంగిపోలేదు. లేదా సీఐకి సలాం చేస్తూ కూర్చోలేదు. తనలోని లక్ష్యాన్ని నిద్రలేపారు. అవమానాలే ఆభరణాలుగా చేసుకున్నారు. ఇప్పుడు అదే సీఐ.. ఉదయ్ కృష్ణారెడ్డికి సెల్యూట్ చేసే స్థాయికి వెళ్లారు. అది జీవితంలో గెలుపు అంటే. అదే అవమానించారని.. అక్కడే ఆగిపోతే.. గెలుపు వచ్చేది కాదు. మీరు సరిగా జీవితాన్ని ప్లాన్ చేసుకుంటే అవమానాలే ఆభరణాలవుతాయ్.. ఛీత్కారాలే సత్కారాలు అవుతాయ్.. అనుకుని అడుగు వేయాలి. గెలుపును ముద్దాడాలి. అదే కదా జీవితం అంటే.

జీవితంలో మనల్ని తక్కువ చేసేందుకు.. అవమానించేందుకు చాలా మంది ఎదురుచూస్తూ ఉంటారు. ఎందుకంటే వారి పని అదే. కానీ మీరు ఆ ట్రాప్‌లో పడిపోకూడదు. మీ గమ్యంవైపు పరుగెత్తాలి. చాలా మంది చేసే చెడ్డపని ఏంటంటే.. అవమానిస్తే.. పై వారికి నచ్చినట్టుగా నడుచుకోవాలనే ఆలోచనలోకి వెళ్లిపోతారు. మీ వైపు తప్పు లేనప్పుడు అలా చేయాల్సిన అవసరం లేదు. కచ్చితంగా ప్రశ్నించాలి... కుదరకుంటే అక్కడ నుంచి దూరంగా వెళ్లిపోవాలి. కానీ జీవితం అనే పరుగులో మాత్రం అలసిపోకూడదు.

ఎవరూ అవమానించినా.. ఎవరు ఛీత్కరించుకున్నా.. అవి మీకు సూదిలా గుచ్చుతూ.. గమ్యం వైపు నడిపించేలా ఉండాలి. అంతేకానీ కుంగిపోయేలా చేయకూడదు. అప్పుడే మీరు జీవితంలో విజయం సాధించగలరు. అందరి ముందు మిమ్మల్ని తగ్గించారని బాధపడకండి. అందరూ మీ వైపు తల ఎత్తి చూసేలా పైకి వెళ్లండి. అదే వారికి సమాధానం. వారితో గొడవలు పెట్టుకుని.. అక్కడే ఆగిపోవడం కంటే.. ముందుకు సాగి.. మీకు సెల్యూట్ చేసే స్థాయికి వెళ్లాలి. జీవితంలో ఒక్క విషయం మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోండి..

ఆలస్యం అయినా పర్లేదు కానీ.. కొన్ని అవమానాలకు సమాధానం చెప్పి తీరాల్సిందే..