Sunday Motivation : కొన్నిసార్లు యుద్ధం.. మీతో మీకే..
Sunday Motivation : ఒక్కోసారి జీవితంలో ఊహించని పరిస్థితులు వస్తాయి. వాటి నుంచి బయటపడాలి. ఈ సమయంలో యుద్ధం.. మీతో మీకే జరుగుతుంది. ఆ సమయం నుంచి బయటపడితేనే అనుకున్నది సాధిస్తారు.
మన జీవితంలో చాలా దారుణమైన పరిస్థితులు రావొచ్చు. అదే లైఫ్ అంటే. కానీ ఆ సమయంలో కూడా సానుకూలంగా ఉండేవారు.. ఎప్పటికైనా విజయం సాధిస్తారు. అది ఏ రకంగానైనా కావొచ్చు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా సానుకూలంగా ఉండడం అనేది చాలా పెద్ద, మంచి విషయం. అలాంటి వారు చాలా రేర్.
మన జీవితంలో మనం ఎక్కువసార్లు పోరాడేది ఎవరితో తెలుసా? మన శత్రువులు అనుకుంటున్నారేమో.. అది చాలా తప్పు. మనం ఎక్కువసార్లు పోరాడేది మనతోనే. అవును మనతో మనకే యుద్ధం జరుగుతుంది. మన మనసును, మన అవసరాన్ని అధిగమించడానికి పెద్ద యుద్ధమే చేయాలి. ఎదుటివారినైనా సులభంగా జయిస్తామేమో కానీ.. మనల్ని మనం జయించడమనేది చాలా కష్టం. అలా మనం పూర్తిగా మన చేతిలో ఓడిపోయినప్పుడు మాత్రమే సానుకూలంగా ఉండగలుగుతాం.
ఎవరి జీవితం సజావుగా సాగదు. ఇది అందరూ అర్థం చేసుకోవాలి. వాళ్లకేంటి బాగుంటారు అనుకోవడం చాలా సులభం. కానీ వాళ్ల జీవితంలోకి వెళ్లి చూస్తేనే ఎన్నో సమస్యలు ఉంటాయి. మనకి మాత్రమే కష్టాలు ఉన్నాయనుకుని కుంగిపోవద్దు. మనం చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ సమయంలో మనం ఎంత ధైర్యంగా, సానుకూలంగా ఉంటున్నామన్నదే అసలు విషయం.
ఒక్కోసారి మన పరిస్థితి మరింత దిగజారిపోవచ్చు. అంతా చీకటి తప్పా వెలుగు లేదు అనుకోవచ్చు. కానీ కాస్త ప్రశాంతంగా, సానుకూలంగా ఉంటే.. మీ జీవితంలో వెలుగు కచ్చితంగా వస్తుంది. చీకటి తర్వాత వెలుగు వస్తేనే రోజు అనేది కంప్లీట్ అవుతుంది. మన సృష్టే అలా డిజైన్ చేయబడింది. అలాంటి మన కష్టం తర్వాత మనకి మంచి జరుగుతుందనుకోవాలి. దానిని నమ్మాలి. ఈ చెడు ఎక్కువసేపు మనతో ఉండదు అనుకోవావి. ఇలా మీరు సానుకూలంగా ఉంటే.. కష్టం మీ దరిదాపుల్లోకి రాదు. ఒకవేళ ఉన్నా.. దానికి ఎక్కువసేపు మీతో ఉండాలని అనిపించదు. మానసికంగా మనం ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే.. మనం, మన పరిస్థితులు అంత త్వరగా చక్కబడతాయి. ఒక్కోసారి శారీరక బలం కన్నా.. మానసికంగా బలంగా ఉండడమే చాలా అవసరం.
కష్టం వచ్చినప్పుడు మీరు ఏడుస్తూ.. మిమ్మల్ని లేదా ఎదుటివారిని తిట్టుకుంటూ తిండి తిప్పలు మానేసి బాధపడుతూ ఉంటే.. మీ కష్టానికి బలం ఎక్కువ అవుతుంది. మీరు చేసే ఈ పనులు మీ కష్టానికి బూస్టప్ ఇస్తాయి. అయితే మీరు పీకల్లోతూ కష్టాల్లో ఉన్నా.. సానుకూలంగా ఉంటూ.. జరిగేదానిని ఎవరూ ఆపలేం అనుకుంటూ.. మీ పని మీరు మంచిగా చేసుకుంటూ పోతే.. ఆ కష్టానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. మీ కష్టాలు మిమ్మల్ని కృంగదీస్తున్న సమయంలో మీరు మీ పనుల్లో మునిగిపోండి. ఏ ఇబ్బంది మిమ్మల్ని ఏది చేయదు అనుకోండి. ఒకవేళ ఏమైనా జరిగినా.. మీరు దానిని కచ్చితంగా భర్తీ చేసుకోగలరని భావించండి. మీకు కచ్చితంగా మంచే జరుగుతుంది. అదే మీకు సక్సెస్‌ను తెచ్చిపెడుతుంది.