Sunday Motivation: జీవితమంటే ఏంటో తెలియాలంటే ఒక్కసారి ఓడిపోయి చూడండి
Sunday Motivation: జీవితంలో ఒక్కసారి ఓడిపోతేనే విజయం విలువ తెలుస్తుంది. అలాగే మనవాళ్లు ఎవరో, బయట వాళ్లెవరో కూడా తెలిపేది ఓటమే. కాబట్టి ఓటమిని తక్కువ చేసి చూడకండి.
Sunday Motivation: ఓడిపోతే ఎంతోమంది కృంగిపోతారు. నిజానికి ఆ ఓటమినే తొలిమెట్టుగా భావించాలి. విజయం విలువను తెలిపేది ఓటమే. జీవితంలో అనుకున్నవన్నీ సాధిస్తూ పోతే, అన్ని విజయాలే ఉంటే... మీకు ఓటమి విలువ తెలియదు. ఒకసారి ఓడినప్పుడే విజయం ఎంత అవసరమో తెలుస్తుంది. అలాగే విజయంలోని ఆనందాన్ని కూడా మీరు అనుభవించగలరు. కారు చీకట్లు కమ్ముకున్నప్పుడే కదా వెలుగు విలువ తెలిసేది. ఓటమి లేని గెలుపుకి విలువ ఉండదు. నాకు ఇక తిరుగులేదనే అహం మనిషిలో కమ్మేస్తుంది. నేల నెర్రిలిచ్చినప్పుడే ఆకాశం వైపు చూస్తుంది, అప్పుడే దానికి చినుకు విలువ తెలుస్తుంది. అలాగే ఓటమి ఎదురైనప్పుడే మీకు విజయం విలువ తెలుస్తుంది.
ఒక మనిషి జీవితంలో ఓటమి ఎదురైనప్పుడే మళ్ళీ విజయం సాధించాలన్న కసి పుడుతుంది. ఆ కసి కావాలంటే మీరు ముందుగా ఓడిపోయి చూడాలి. సమస్యలు లేని జీవితం ఎవరికి ఉండదు. అలాగే పరిష్కారం లేని సమస్య కూడా ఉండదు. కాబట్టి మీ ఓటమికి కుంగిపోకుండా... ఆ ఓటమి ఎందుకు కలిగిందో ఆలోచించి చూడండి. జీవితంలో ఓటమి లేకపోతే ఉప్పులేని కూరలా చప్పగా అయిపోతుంది లైఫ్.
జీవితం అందరికీ వడ్డించిన విస్తరిలా ఉండదు. ఎంతో మంది ఎన్నో ఒడిదుడుకలలో ఓటములను తట్టుకొని నిలిచిన వారే. చివరికి విజయం విలువను తెలుసుకుంటారు. జీవితం అంటేనే ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడం, ముందుకు సాగిపోవడం. సమస్యలే లేకపోతే మీకు జీవితమంటే ఏంటో ఎలా తెలుస్తుంది? తల ఉన్నంతవరకు తలనొప్పి వుంటూనే ఉంటుంది. తలనొప్పి వస్తుందని తల తీసేయలేము కదా. అలాగే ఓటమి కలుగుతుందన్న భయంతో ప్రయత్నమే ఆపేయొద్దు.
విజయం కోసం వేచి ఉండడంలో తప్పులేదు, కానీ ఓటమిని చూసి పారిపోవడం మాత్రం అతి పెద్ద తప్పు. జీవితం ఒక ప్రయాణం లాంటిది. ఆ ప్రయాణంలో సౌకర్యాలే కాదు... అసౌకర్యాలు కూడా కలుగుతూ ఉంటాయి. ప్రతి దాన్ని దాటుకుంటూ పోవాలి, తప్ప అక్కడే ఆగిపోకూడదు. నడిస్తే కాలు నొప్పి వస్తాయని, నడక ఆపేస్తే మీ జీవిత ప్రయాణమే ఆగిపోతుంది. గమ్యం చేరాలన్న ఆశతో ముందుకు నడుస్తూనే ఉండాలి.
ప్రశాంతంగా ఉన్న సముద్రం మంచి నావికుడిని తయారుచేయలేదు. అలాగే సమస్యలు, ఓటమి లేని జీవితం ఉత్తమ మనిషిని తీర్చిదిద్దలేదు. జీవితమంటేనే ఒక గణిత పుస్తకం. దాన్లో ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటూ పోవాలి తప్ప భయపడి అక్కడే ఆగిపోకూడదు.