Sunday Motivation: ఒక దారి మూసుకుపోతే.. మరోదారి కచ్చితంగా తెరుచుకుంటుంది, దాన్ని గుర్తిస్తే మీరు సగం సక్సెస్ అయినట్టే
Sunday Motivation: విజయం దక్కే ఒక దారి మూసుకుపోయిందా? అయితే దేవుడు మరో దారి మీకు సిద్ధం చేసే ఉంటాడు. దాన్ని వెతికే పనిలో పడండి. అంతే తప్ప నిరాశలో కూరుకుపోకండి.
Sunday Motivation: కొంతమందికి విజయం దక్కదని తెలిసినా, విజయాన్ని అందుకునే ప్రయాణం చాలా పొడవైనదని అర్థమైనా, తృటిలో విజయం చేజారినా... చాలా నిరాశ పడిపోతారు. అలాంటి సమయంలోనే ఉత్తేజంగా ఉండాలి. ఉత్సాహంగా ముందుకు వెళ్లాలి. విజయం దక్కే దారులు మూసుకుపోయినట్టు అనిపిస్తే నిరాశ, నిస్పృహల్లో కూరుకుపోవడం కాదు. ఒక దారి మూసిన దేవుడు కచ్చితంగా మీకోసం రెండోదారిని తెరిచే ఉంచుతాడు. దాని వెతుక్కుంటూ వెళ్ళండి. మీ విజయం కలలు సాకారమవుతుంది.
విజయం అంటే విస్తరిలో వడ్డించిన ఆహారం కాదు... నేరుగా ఆరగించడానికి. మీరే దాని కోసం కష్టపడాలి. మీ ఆనందాలను, సౌకర్యాలను వదులుకోవాలి. విజయం దక్కితే జీవితంలో అన్నీ మీ వెంటే వస్తాయి. మీరు సుఖాల వెంట పరిగెడితే విజేత అవ్వడం కష్టం.
క్రమశిక్షణ, నిరంతర కృషి, దృఢ సంకల్పం, సాధించాలన్న పట్టుదల, ఫోకస్... ఇవి మాత్రమే మీలో ఉండాలి. నిరాశ, నిస్పృహలను బయటకి తోసేయండి. అందమైన, అద్భుతమైన మనస్తత్వాన్ని తెచ్చుకోండి. స్పూర్తిదాయకమైన వ్యక్తిత్వాన్ని అలవర్చుకోండి.
విజయాన్ని అందుకోండి
అపజయం... అదే జీవితానికి అంతం కాదు. ఆ అపజయాలను దాటుకుంటూ విజయ శిఖరాలను చేరుకోవాలని అర్థం. చేతికి నేరుగా అందే జామకాయ కన్నా... అందని ద్రాక్ష పండే టేస్టీగా ఉంటుంది. అలాగే విజయం సులువుగా అందితే దాని విలువ మీకు ఎలా తెలుస్తుంది? అందుకే విజేత అవ్వాలంటే జీవితంలో ఎంతో కష్టపడాలి.
నక్షత్రాలని చూడాలనుకుంటే తల ఎత్తి ఆకాశాన్ని చూడాలి, కానీ మెడ నొప్పి పెడుతుంది కదా అని నేలవైపుగా చూస్తే నక్షత్రాలు కనిపించవు. నొప్పిని భరిస్తూ ఉంటేనే నక్షత్రం మెరుపులను మీరు చూడగలరు.
ఓటమి ఎదురవగానే దొర్లి దొర్లి ఏడ్చేయడం, పక్క వాళ్ళ దగ్గరకు వెళ్లి ముక్కు చీదడం వంటి పనులు మానేయండి. అదే మీ విజయానికి మొదటి మెట్టు అనుకోండి. విఫలమైనప్పుడల్లా రెట్టింపు వేగంతో ముందుకు సాగండి. అంతేకానీ వెనక్కి తగ్గకండి. దారి మూసుకుపోయిందనే కన్నా కొత్తదారి ఉందేమో అని వెతుక్కోవడమే విజయంలో మొదటి పాఠం. వైఫల్యం నుంచి ఒక జీవిత పాఠాన్ని నేర్చుకోండి. ఎందుకంటే ఇలాంటి అనుభవాలే మీకు విజయ సోపానాలుగా మారుతాయి.
సమయాన్ని సద్వినియోగం
ముఖ్యంగా సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మీలో స్ఫూర్తి రగలాలంటే ఎంతో కష్టపడి విజయాలు అందుకున్న వ్యక్తుల విజయ గాధలను చదవండి. వాటిని ఎప్పుడూ తలుచుకుంటూ ఉండండి. ఏ వ్యక్తి కూడా ఒక్కసారిగా గొప్పవాడు కాలేడు... దాని వెనుక ఆయన పడ్డ ఏళ్ల నాటి కృషి ఉంటుంది. ఎన్నో త్యాగాలు ఉంటాయి.
దూరపు కొండలు నునుపు అన్నట్టుగా కోటీశ్వరుల జీవితాలను చూసి కొంతమంది కుళ్లుకుంటారు. వాళ్ల జీవితంలో కూడా అడుగడుగున ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. దాన్ని వారు అధిగమించే అవకాశాల కోసం చూస్తారు. అలా అధిగమించని వాళ్ళు అడుగుకు పడిపోతారు. కొందరు మాత్రమే బిలియనీర్లుగా మిగులుతారు. సమస్యలు లేని జీవితం ఉండదు. అది కోటీశ్వరులైనా, పేదవారైనా. విజయానికి కూడా ధనికా, పేద అనే తేడా ఉండదు. కాబట్టి ఎదుటివారి జీవితాన్ని చూసి అసూయ పడేకన్నా మీ జీవితాన్ని విజయవంతం ఎలా చేసుకోవాలో ఆలోచించండి.