Sunday Motivation: ఎక్కువగా విమర్శలే ఎదురవుతున్నాయా? ఎలా వ్యవహరిస్తే జీవితంలో ఎదగొచ్చంటే..
Sunday Motivation: కొందరికి విమర్శలు ఎక్కువగా ఎదురవుతుంటాయి. అయితే, అవి వచ్చిన సమయంలో వ్యవహరించే తీరు వారి భవిష్యత్తుకు కీలకంగా ఉంటుంది. విమర్శలను ఎలా తీసుకుంటే పురోగతి సాధించవచ్చో ఇక్కడ తెలుసుకోండి.
విమర్శలను ఎదుర్కోవడం ఎవరికీ ఇష్టం ఉండదు. వీటివల్ల బాధ, నిరాశ కలుగుతాయయి. అయితే, కొందరికి చేసే పనుల్లో నిరంతరం విమర్శలు ఎదురవుతుంటాయి. తరచూ మాటలు పడుతుంటారు. దీనివల్ల చింతిస్తూ ఉంటారు. దీంతో కెరీర్లో ఎదుగుతామా, పరిస్థితి ఏంటనే ఆందోళనతో ముందుకు సాగుతుంటారు. దీంతో పనితీరుపై మరింత ప్రభావం పడుతుంది. అయితే, విమర్శలను ఎలా తీసుకుంటే జీవితంలో ఎదిగే అవకాశం ఉంటుందంటే..
ఇది గుర్తించాలి
విమర్శ.. అనగానే పూర్తిగా నెగెటివ్ అని చాలా మంది అనుకుంటారు. ఎవరైనా ఏదైనా అంటే వెంటనే కోప్పడడమో, బాధపడడమో చేస్తుంటారు. అయితే, విమర్శ అనేది ప్రతీసారి నెగెటివ్ కాదు. కొన్నిసార్లు ఇది తప్పులను సరిదిద్దుకునే దిశగా నడిపిస్తుంది. జీవితంలో ముందుకు వెళ్లేందుకు స్పష్టతనిస్తుంది. అయితే, ఏది అర్థవంతమైన విమర్శో, ఏది నిరర్థకమైన విమర్శో గుర్తించాలి.
చెప్పేది అర్థం చేసుకోవాలి
ఏదైనా విమర్శ వచ్చినప్పుడు.. దాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. దాని వెనుక ఉన్న సందేశం ఏంటా అనేది ఆలోచించాలి. భావోద్వేగాలను పక్కనపెట్టి ఈ విషయం గురించి థింక్ చేయాలి. అప్పుడు అది నిర్మాణాత్మకమైన విమర్శనా.. లేకపోతే ఎలాంటి ఉపయోగం లేనిదా అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఒక్కోసారి మనసుకు కష్టంగా అనిపించిన విమర్శ వల్లే.. పొరపాటు తెలిసి వచ్చి సరిదిద్దుకునేందుకు అవకాశం ఉంటుంది.
మరింత మెరుగవ్చొచ్చు
ఒకవేళ అర్థవంతమైన విమర్శలను పరిగణనలోకి తీసుకొని.. ఆ విషయాలను సరిచేసుకుంటే మీరు జీవితంలో మరింత మెరుగవ్చొచ్చు. ఉద్యోగంలో అయినా, వ్యాపారంలో అయినా, చదువు విషయంలో అయినా మీకు నిర్మాణాత్మక విమర్శలు ఎప్పటికప్పుడు ఎదురవడం కూడా ముఖ్యమే. ఇలాంటివి వచ్చినప్పుడు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. వాటిని ఎలా అధిగమించవచ్చో ఓ ప్లాన్ సిద్ధం చేసుకోవాలి. ఆ పొరపాట్లు మళ్లీ జరగకుండా జాగ్రత్త పడొచ్చు. ఇది ఏ రంగంలో అయినా ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది.
సాకులు చెప్పొద్దు
మీపై ఎవరైనా విలువైన, అర్థవంతమైన విమర్శ చేస్తుంటే సాకులు చెప్పకండి. వాదన పెట్టుకోకండి. మీ పొరపాట్లను విశ్లేషిస్తుంటే కారణాలు చెబుతూ తప్పించుకునేందుకు ప్రయత్నించకండి. ముఖ్యంగా వారు మంచి చేసే వారని తెలిసినప్పుడు.. వారి నుంచి వచ్చే విమర్శలను కొట్టేపారేయవద్దు. వాటి గురించి ఆలోచించాలి. అలాగే, విలువైన మాటలు చెప్పే వారికి అభినందలను కూడా తెలిపాలి.
అర్థరహితమైన విమర్శలు ఎదురైతే..
అర్థం లేని విమర్శలు అని భావించినప్పుడు.. అవి చేసే వారి ఉద్దేశమేంటో ఆలోచించండి. అందుకు తగ్గట్టుగా ప్రవర్తించండి. వారివి నిరర్థకమైన విమర్శలని నిజాలను నిరూపించవచ్చు. అయితే, అలాంటి మాటలపై ఎక్కువగా చింతించి సమయం వృథా చేసుకోకూడదు. మీరు చేసే పనిని కొనసాగించాలి. సమర్థవంతంగా పని చేయడం ఎప్పటికీ ఆపకూడదు.
ఆత్మవిశ్వాసం ముఖ్యం
విమర్శలు ఎన్ని వచ్చినా ఆత్మవిశ్వాసాన్ని మాత్రం ఎప్పటికీ తగ్గించుకోకూడదు. ఎలాంటి పరిస్థితి ఎదురైనా కాన్ఫిడెంట్‍గా ముందుకు సాగాలి. పొరపాట్లను సరిద్దుకుంటా.. సమస్యలను దాటేస్తాననే భావనతో నిరంతరం ఉండాలి. ఆ దిశగా పని చేయాలి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. అర్థవంతమైన విమర్శలను పరిగణనలోకి తీసుకొని.. పొరపాట్లను సరిదిద్దుకుంటే అవే జీవితంలో ఎదుగుదలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.
సంబంధిత కథనం