మచ్చ లేని చర్మం కోసం మామిడి ఆకులు బాగాా ఉపయోగపడతాయట! ఎలాగో ఇక్కడ తెలుసుకోండి?-summer skincare the benefits of mango leaves for a flawless complexion ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  మచ్చ లేని చర్మం కోసం మామిడి ఆకులు బాగాా ఉపయోగపడతాయట! ఎలాగో ఇక్కడ తెలుసుకోండి?

మచ్చ లేని చర్మం కోసం మామిడి ఆకులు బాగాా ఉపయోగపడతాయట! ఎలాగో ఇక్కడ తెలుసుకోండి?

Ramya Sri Marka HT Telugu

మామిడి పండు రుచి గురించి మనందరికీ తెలుసు. కానీ, దాని ఆకులు చర్మానికి చేసే మేలు గురించి తెలుసా? మచ్చ లేని చర్మం కావాలనుకునే వారికి మామిడి ఆకులు చేసే మేలు అంతా ఇంతా కాదట. ముఖ్యంగా వేసవిలో వచ్చే చర్మ సమస్యలను నయం చేయడానికి మామిడి ఆకులు చాలా బాగా సహాపడతాయట. వీటిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం రండి!

మామిడి ఆకులో మచ్చలేని, మెరిసే చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు.

మహిళలు ఎల్లప్పుడూ మచ్చలేని, కాంతివంతమైన చర్మాన్ని కోరుకుంటారు. కానీ, వేసవి కాలం వచ్చిందంటే చాలు, చర్మ సంబంధిత సమస్యలు పెరుగుతాయి. ఎండ వేడి, దుమ్ము, కాలుష్యం వల్ల చర్మంపై టాన్, మొటిమలు, జిడ్డు వంటి సమస్యలు తీవ్రమవుతాయి. ఈ సీజన్‌లో చర్మాన్ని నిర్లక్ష్యం చేస్తే, చర్మం నిర్జీవంగా మారే ప్రమాదం ఉంది. ప్రకృతి మనకు అందించిన కొన్ని సహజసిద్ధమైన పదార్థాలతో ఈ సమస్యలను అధిగమించవచ్చు. అలాంటి ఒక అద్భుతమైన సహజసిద్ధమైన పదార్థమే మామిడి ఆకులు.

వేసవిలో ఎంతో ఇష్టంగా తినే మామిడి పండుతో పాటు, దాని ఆకులు కూడా చర్మానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. మామిడి ఆకుల్లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని శుభ్రంగా ఉంచడానికి, మచ్చలను తగ్గించడానికి, చర్మ ఛాయను మెరుగుపరచడానికి సహాయపడతాయి. మరి లేటు ఎందుకు పెరట్లో ఎప్పుడూ ఉండే మామిడి ఆకులతో చర్మారోగ్యానికి పెంచుకోవడం ఎలాగో చూసేద్దాం రండి.

మచ్చలేని చర్మం కోసం మామిడి ఆకులను ఎలా ఉపయోగించాలి?

1. ఫేస్ మాస్క్‌లా అప్లై చేయండి:

  • మామిడి ఆకులను ఫేస్ మాస్క్‌లా ఉపయోగించడం వల్ల చర్మానికి తక్షణ ఉపశమనం లభిస్తుంది.
  • ఇందుకోసం ముందుగా 4-5 లేత మామిడి ఆకులను తీసుకోండి. వాటిని శుభ్రంగా కడిగి, కొద్దిగా నీరు కలిపి మెత్తని పేస్ట్‌లా రుబ్బుకోండి.
  • ఈ పేస్ట్‌కు ఒక టేబుల్ స్పూన్ పెరుగు కలపండి. పెరుగు చర్మాన్ని తేమగా ఉంచడానికి, మచ్చలను తగ్గించడానికి సహాయపడుతుంది.
  • తయారు చేసుకున్న మిశ్రమాన్ని మీ ముఖానికి, మెడకు సమానంగా అప్లై చేసి 15-20 నిమిషాల పాటు ఆరనివ్వండి.
  • తర్వాత గోరువెచ్చని నీటితో నెమ్మదిగా మసాజ్ చేస్తూ కడగాలి.

ఈ ఫేస్ మాస్క్‌ను వారానికి రెండుసార్లు వేసుకోవడం వల్ల మీ చర్మం తాజాగా, కాంతివంతంగా ఉంటుంది.

2. టోనర్ లాగా ఉపయోగించండి:

మామిడి ఆకులను సహజసిద్ధమైన టోనర్‌గా ఉపయోగించడం వల్ల చర్మ రంధ్రాలు శుభ్రపడతాయి. చర్మం బిగుతుగా మారుతుంది.

  • ఇందుకోసం 4-5 తాజా మామిడి ఆకులను తీసుకుని 2-3 కప్పుల నీటిలో వేసి బాగా మరిగించండి. నీరు ఆకుపచ్చ రంగులోకి మారే వరకు మరిగించండి.
  • తర్వాత నీటిని వడగట్టి చల్లారనివ్వండి.
  • ఈ చల్లారిన మామిడి ఆకుల నీటిని ఒక స్ప్రే బాటిల్‌లో పోసుకోండి.
  • ప్రతిరోజూ ఉదయం, రాత్రి ముఖం కడుక్కున్న తర్వాత ఈ టోనర్‌ను మీ ముఖంపై స్ప్రే చేయండి.

ఇది మీ చర్మం pH స్థాయిని సమతుల్యం చేస్తుంది. మొటిమలు, మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది. క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల మీ చర్మం రంగు కూడా మెరుగుపడుతుంది.

3. మామిడి ఆకుల పొడితో ఫేస్ ప్యాక్:

మామిడి ఆకుల పొడిని ఉపయోగించి ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవడం వల్ల చర్మానికి మరింత లోతైన పోషణ లభిస్తుంది.

  • ఇందుకోసం కొన్ని మామిడి ఆకులను తీసుకుని శుభ్రంగా కడగాలి.
  • వాటిని ఎండలో బాగా ఆరబెట్టండి. ఆకులు పూర్తిగా ఎండిపోయిన తర్వాత వాటిని మెత్తని పొడిగా గ్రైండ్ చేసుకోండి.
  • ఈ పొడిని ఒక గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకోవచ్చు.
  • మీకు కావాలసినప్పుడు ఒక టేబుల్ స్పూన్ మామిడి ఆకుల పొడిని తీసుకోండి.
  • దీనికి కొద్దిగా పెరుగు లేదా రోజ్ వాటర్ కలిపి మెత్తని పేస్ట్‌లా తయారు చేయండి. మీ చర్మ రకాన్ని బట్టి తేనె లేదా పాలు కూడా కలుపుకోవచ్చు.
  • ఈ పేస్ట్‌ను మీ ముఖం, మెడ, చేతులకు సమానంగా అప్లై చేయండి.
  • 15-20 నిమిషాలు ఆరనివ్వండి.
  • ఆరిపోయిన తర్వాత గోరువెచ్చని నీటితో సున్నితంగా రుద్దుతూ కడగాలి.

ఈ ఫేస్ ప్యాక్‌ను వారానికి ఒకసారి లేదా రెండుసార్లు వేసుకోవడం వల్ల మీ చర్మం మృదువుగా, తాజాగా మరియు ప్రకాశవంతంగా మారుతుంది.

మామిడి ఆకులను చర్మానికి ఉపయోగించడం వల్ల కలిగే లాభాలు:

  1. మామిడి ఆకులలోని యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తాయి, వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తాయి.
  2. మొటిమల గాయాలను త్వరగా నయం చేస్తాయి, మచ్చలను రాకుండా కాపాడతాయి.
  3. చర్మం నల్లబడటాన్ని తగ్గిస్తుంది, కాంతివంతమైన ఛాయను ఇస్తుంది.
  4. మొటిమలు రాకుండా నివారిస్తుంది, జిడ్డును తగ్గిస్తుంది.
  5. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మం స్థితిస్థాపకతను పెంచుతుంది, ముడతలను తగ్గిస్తుంది.
  6. సహజ టోనర్‌గా పని చేసి చర్మాన్ని శుభ్రపరుస్తుంది, మచ్చలను తగ్గిస్తుంది, చర్మ ఛాయను మెరుగుపరుస్తుంది.
  7. దురద, ఎరుపు వంటి చర్మ సమస్యలను తగ్గిస్తుంది.
  8. క్రిమినాశక లక్షణాలు కలిగి ఉండటం వల్ల గాయాలు త్వరగా మానతాయి.

రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.