వేసవిలో ఎండ వేడి తట్టుకోలేక చాలా మంది బయటకు వెళ్లడానికి ఇష్టపడరు. ఒకవేళ వెళ్లాల్సి వస్తే కాటన్ డ్రెస్సులు తప్ప వేరేవి ఉపయోగించరు. సమ్మర్లో మారుతున్న వాతావరణాన్ని బట్టి శరీరానికి వేడి ఫీలింగ్ కలగకుండా ఉండాలంటే ఏం చేయాలి? తేలికైన, స్టైలిష్ బట్టలు వేసుకోవాలంటే కేవలం కాటన్ దుస్తులే ధరించాలా? అంటే, కాటన్ డ్రెస్సులు మాత్రమే ధరించాల్సిన అవసరం లేదు. కంఫర్ట్ తో పాటు స్టైలిష్ గానూ అనిపించే మరో 4 రకాలైన దుస్తులు ఉన్నాయి. ఇవి మీ శరీరాన్ని చల్లగా ఉంచడంతో పాటు సౌకర్యవంతంగా, హుందాగా కనిపించేలా చేస్తాయి. మరి అవేంటో తెలుసుకుందామా..?
వేసవి కాలం ధరించే బట్టల్లో ముందుగా చెప్పుకోవాల్సింది కాటన్ క్లాత్. ఇది వేసవికి అత్యంత ప్రసిద్ధమైన వస్త్ర రకాల్లో ఒకటి. పత్తి మొక్క నుండి వచ్చే ఈ వస్త్రం, చెమటను సులభంగా గ్రహించి బయటకు పంపడంలో సహాయపడుతుంది. కాటన్ వస్త్రానికి విశాలంగా ఉండే రంధ్రాలు గాలిని సులభంగా ప్రసరింపజేస్తాయి. అంతేకాకుండా, చర్మం చెమటను గ్రహించి శరీరాన్ని చల్లగా ఉంచేందుకు సహాయపడతాయి. కాటన్ వస్త్రం సహజమైన, తేలికైన బట్ట. ఇది వేసవిలో ధరించడానికి చాలా అనువైనది.
షిఫాన్ బట్ట అన్ని బట్టల కంటే అత్యంత తేలికైనది, అత్యంత మెత్తటిది కూడా. స్టైల్‌గా ఉంచే విషయంలోనూ షిఫాన్ బట్ట ది బెస్ట్. షిఫాన్ వస్త్రం మీ వేసవిని మరింత సౌకర్యవంతంగా చేస్తుంది. చెమటను పీల్చుకోవడంతో పాటు శరీరంపై కంఫర్ట్ ఫీలింగ్ కలుగజేస్తుంది. ఈ షిఫాన్ వస్త్రంతో చీరలు, బ్లౌజ్‌లు, షర్టులు, కుర్తీలు తయారు చేస్తుంటారు. వేసవి కాలం తప్పనిసరిగా అటెండ్ కావాల్సిన ఫంక్షన్లకు కూడా షిఫాన్ వస్త్రంతో తయారుచేసిన డ్రెస్సులు వేసుకోవడం ద్వారా స్టైల్ గా కనిపిస్తారు.
మార్కెట్లో కాటన్ డ్రెస్సుల తర్వాత ఎక్కువ మంది ఆదరించేది లినెన్ క్లాత్‌నే. లినెన్ అనేది ఫ్లాక్స్ పీచులతో తయారైన సహజ బట్ట. దీన్ని ప్రపంచంలోని అత్యంత పురాతన బట్టల్లో ఒకటిగా భావిస్తారు. కాటన్ బట్టతో పోలిస్తే దాని కంటే బలంగా ఉంటుంది. అందుకే, దీని ధర కాటన్ బట్ట కంటే ఎక్కువ.
రేయాన్ క్లాత్ వేసవికి మంచి ఆప్షన్. దీనికి ఉండే సింథటిక్ స్వభావం కారణంగా ఇది తేలికగా ఉంటుంది. వేడి వాతావరణంలో శరీరానికి అతుక్కోకుండా ఫ్రీగా ఉంటుంది. వేసవిలో ఈ బట్ట ధరించడం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. వేసవికాలం జరిగే ఫంక్షన్లకు, ఈవెంట్లకు రేయాన్ క్లాత్ తో తయారుచేసిన వస్త్రాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.
షీర్ ఫ్యాబ్రిక్ వేసవిలో అత్యధికంగా ఉపయోగించే బట్టల్లో ఒకటి. దీనిని కూడా పత్తి నుంచే తయారుచేస్తారు. మిగతా వాటితో పోలిస్తే, కాస్త బరువుగా ఉంటుంది. కానీ, ఇతర బరువైన బట్టలకు భిన్నంగా, ఇది వేసవిలో శరీరానికి అతుక్కోకుండా ఫ్రీగా ఉంటుంది.
మరింకెందుకు ఆలస్యం.. ఈ సమ్మర్‌ను చల్లగా, ఉంచుకోవడానికి, స్టైలిష్ వస్త్రాలు రెడీ చేసేసుకోండి.
సంబంధిత కథనం