Suji Potato Puri: రవ్వ, ఆలూతో ఇలా పూరీ చేశారంటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం, ఇదిగోండి రెసిపీ!
Suji Potato Puri: ఇప్పటివరకూ మీరు గోధుమపిండితో చేసిన పూరీలు, మైదాపిండితో చేసిన పూరీలు తిని ఉంటారు. బంగాళదుంపలు, రవ్వతో చేసిన పూరీలు ఎప్పుడైనా తిన్నారా. ఇప్పటివరకూ లేకపోతే ఇప్పుడు తప్పకుండా ప్రయత్నించండి. ఈ రెసిపీ రుచిలో మాత్రమే కాదు తయారీలో కూడా బెస్ట్.

పూరీలంటే మైదా పిండి లేదా పూరీ పిండితో మాత్రమే చేయాలా? వేరే ఆప్షన్ లేదా అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అనిపిస్తే మాత్రం ఇది మీ కోసమే. రొటీన్ గా మనం చేసుకునే పూరీల కన్నా ఎక్కువ రెట్లు రుచికరమైనవి మాత్రమే కాకుండా మృదువైన, ఆరోగ్యకరమైన పూరీల గురించి ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. ఆలూ, రవ్వ, గోధుమపిండితో తయారు చేసే ఈ పూరీలు చాలా మృదువుగా, టేస్టీగా ఉంటాయి. వీటిని మీరు ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్‌గా, సాయంత్రం స్కూలు నుంచి వచ్చే పిల్లలకు స్నాక్స్‌గానూ లేదా రాత్రి అల్పాహారంగానూ, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకుని తినచ్చు. ఈ పూరీల రుచి కచ్చితంగా అందరికీ నచ్చుతుంది, అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఆలస్యం చేయకుండా ఆలూ, రవ్వతో పూరీల తయారీ విధానం గురించి తెలుసుకుందాం రండి..
కావాలసిన పదార్థాలు..
- ఉప్మా రవ్వ ఒక కప్పు
- నాలుగు బంగాళాదుంపలు
- చిన్న కప్పు కొత్తిమీర
- రుచికి సరిపడా ఉప్పు
- ఒక టీ స్పూన్ వాము
- ఒక టీ స్పూన్ జీలకర్ర
- ఒకటి లేదా రెండు ఎర్రమిరపకాయలు
- ఒక టీ స్పూన్ కాలోంజి
- అర కప్పు గోధుమపిండి
- డీప్ ఫ్రైకి సరిపడా నూనె
- నీరు
రవ్వ బంగాళదుంప పూరీ తయారీ విధానం:
- ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఉప్మా రవ్వను వేయండి.
- తర్వాత దాంట్లో రవ్వ మునిగేంత వరకూ నీరు పోసి రవ్వను నానబెట్టండి.
- ఇప్పుడు మరొక గిన్నె తీసుకుని నాలుగు బంగాళదుంపలు వేసి ఉడికించండి.
- ఉడికించిన బంగాళదుంపలను పొట్టు తీసేసి సన్నగా తురిమి పక్కకు పెట్టుకోండి. తురమడానికి టైం పడుతుంది అనుకుంటే గరిటెతో నొక్కడం, పిసకడం కూడా చేసుకోవచ్చు.
- ఈ బంగాళాదుంపల తురుములోనే మనం తీసుకున్న సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పచ్చిమిర్చీ, కళోంజి గింజలు, వాము, జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి.
- తరువాత ఈ మిశ్రమంలో ముందుగా నానబెట్టిన రవ్వను తీసుకుని నీటిని వడకట్టి వేయండి, తరువాత గోధుమపిండిని వేసి అన్నీ కలిసిపేయేంత వరకూ చక్కగా కలుపుకోండి.
- ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకుని దాంట్లో నూనె పోసి ముందుగా కలుపుకున్న ఈ ఆలూ, రవ్వ, గోధుమపిండి మిశ్రమాన్ని వేసి బాగా కలపండి.
- తరువాత ఈ పిండి ముద్దను చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని పక్కకు పెట్టుకోండి.
- ఈలోపు ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకుని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేయండి.
- ఇప్పుడు పిండి ముద్దలను తీసుకుని పూరీల్లాగా తయారు చేసుకుని కాగుతున్న నూనెలో వేయాలి. అవి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకూ వేయించండి.
- అంతే మృదువైన, రుచికరమైన ఆలూ, రవ్వ పూరీలు తయారైనట్టే. వీటిని ఏదైనా కర్రీ లేదా చట్నతో తినేయచ్చు. పిల్లలకు, పెద్దలకూ కూడా ఇవి చాలా బాగా నచ్చుతాయి. వీటిని రుచి చూశారంటే ప్రతిసారీ పూరీలు ఇలాగే చేసుకోవాలి అనుకుంటారు.
మరి, ఇంకెందుకు లేటు, బంగాళదుంపలతో భళే పూరీలు చేసుకుని లాగించేయండి.
సంబంధిత కథనం