సేతుబంధాసనంలో యోగాలో ముఖ్యమైన భంగిమ. ఇది శారీరక, మానసిక ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడే వారికి శరీరంలో ఆక్సిజన్ ప్రసరణను పెంచాలనుకునే వారికి సేతుబంధాసనం ఎంతో ముఖ్యమైనది. ఆస్తమా వంటి సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు సేతుబంధాసనం వేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందుతారు.
ఆస్తమా అనేది ఒక శ్వాసకోశ వ్యాధి. ఇది చిన్నగా కనిపిస్తున్నా పెట్టే ఇబ్బంది మాత్రం ఎక్కువే. ఏమాత్రం గాలి కాలుష్యం ఉన్నా చిన్న చిన్న దుమ్ము ధూళి శ్వాసకోశ వ్యవస్థలో చేరినా విపరీతమైన దగ్గు, ఆయాసంతో ఇబ్బంది పడిపోతారు. కాబట్టి ఆస్తమాను కేవలం మందులతోనే కాకుండా యోగాతో కూడా తగ్గించుకోవాలి.
ఆస్తమా రోగులు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడడంతో పాటు పిల్లికూతలు, విపరీతమైన దగ్గుతో బాధపడుతూ ఉంటారు. సాధారణ జీవితం కష్టంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి వారు సేతుబంధాసనం ద్వారా తమ ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అలాగే శరీరం మొత్తం ఆక్సిజన్ సవ్యంగా జరిగేలా చేసుకోవచ్చు.
సేతుబంధాసనం అనేది ఒక బ్రిడ్జిల్లా కనిపిస్తుంది. అందుకే దీనికి సేతు అనే పేరును పెట్టారు. ఇరుకైన మార్గాలను తెరచి వాయువు ఊపిరితిత్తుల్లో సవ్యంగా ప్రవహించేలా చేస్తుంది. సేతుబంధాసనం ప్రతిరోజు చేస్తే మీకున్న శ్వాసకోశ సమస్యలు చాలా వరకు తగ్గుతాయి.
సేతుబంధాసనం ఎలా వేయాలో మాటల్లో కన్నా ఫోటోలో చూడడం ద్వారా మీరు సులువుగా వేసుకోవచ్చు. సేతుబంధాసనం అనేది ఒక సంస్కృత పదాల కలయిక నుండి పుట్టింది. సేతు అంటే వంతెన, బంధ అంటే బంధించడం, ఆసనం అంటే భంగిమ.
సేతుబంధాసనం వేయడానికి ముందుగా మీరు కింద పడుకోవాలి. వీపును నేలవైపు తాకేలా ఉంచాలి. చేతులు రెండింటినీ మీ శరీరం పక్కన ఉంచండి. ఇప్పుడు మెల్లగా వెన్నును పైకి లేపడానికి ప్రయత్నించండి. చేతులు రెండు మాత్రం కదలకుండా అలాగే ఉండాలి. అలాగే మీ తల కూడా నేలపై అలానే ఉండాలి. మధ్యలో వెన్ను నుంచి మోకాళ్ల వరకు పైకి లేపాలి. అలా ఈ ఆసనంలో కొన్ని సెకండ్ల పాటు ఉండి మరల సాధారణ స్థితికి రావాలి. ఇలా రోజుకు రెండు మూడు సార్లు చేయడం వల్ల మంచి ఉపయోగం ఉంటుంది.