పెరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు.. ఈ ఏడాది ఇప్పటికే 13,000 మంది బలవన్మరణం
‘గడచిన పదేళ్లు గా దేశవ్యాప్తంగా , తెలుగు రాష్ట్రాల్లోనూ ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. దేశవ్యాప్తంగా సంభవిస్తున్న ఆత్మహత్యల్లో ఎనిమిది శాతం విద్యార్థులవే ఉండటం ఆందోళన కలిగించే అంశం..’ - సైకాలజిస్ట్ బి.కృష్ణ అందిస్తున్న విశ్లేషణ.
- వాడుతున్న విద్య కుసుమాలు
- పెరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు
- గడచిన పదేళ్లలో 70% పెరుగుదల
- ఈ ఏడాది ఇప్పటికీ 13,000 మంది
- ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ లే కారణం
- దేశంలో ప్రతి 42 నిమిషాలకి ఓ విద్యార్థి ఆత్మహత్య
- సగటున రోజుకి ఐదు మంది విద్యార్థుల ప్రాణాలు గాల్లోకి..
- 2017 నుంచి 2022 వరకు 32 శాతం పెరుగుదల
- కోటాలో ఈ ఏడాది ఇప్పటికీ 25 మంది విద్యార్థులు బలవన్మరణం
ఈ గణాంకాలు చాలు విద్యార్థుల ఆత్మహత్యలు సామాజిక సమస్యగా రూపొందుతున్నాయని చెప్పడానికి. గడచిన పదేళ్లు గా దేశవ్యాప్తంగా , తెలుగు రాష్ట్రాల్లోనూ ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. దేశవ్యాప్తంగా సంభవిస్తున్న ఆత్మహత్యల్లో ఎనిమిది శాతం విద్యార్థులవే ఉండటం ఆందోళన కలిగించే అంశం. చక్కగా చదువుకుని వివిధ వృత్తుల్లో స్థిరపడి దేశానికి మానవ వనరుల సంపదగా మారాల్సిన విద్యార్థులు అర్థంతరంగా ప్రాణాలు తీసుకోవడంపై సమాజంలోని అన్ని వర్గాలు ఆలోచించాల్సిన తరుణం ఇది. దేశంలోని ఐఐటి, ఎన్ఐటి, ఎయిమ్స్ , కేంద్రీయ విశ్వ విద్యాలయాలు తదితర ఉన్నత విద్యా సంస్థల్లో గడిచిన ఐదేళ్లలో 98 మంది విద్యార్థులు ఆత్మహత్య కు పాల్పడ్డారు అంటే ఈ సమస్య ఎంత తీవ్రతరమవుతుందో అర్థం చేసుకోవచ్చు.19 నుంచి 29 ఏళ్ల లోపు వయస్సు వారిలో ప్రాణాలు తీసుకోవాలనే ఆలోచనలు ఎక్కువగా ఉండటం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.
ట్రెండింగ్ వార్తలు
కారణాలు అనేకం..
నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో - 2021 రిపోర్టు ప్రకారం 18 ఏళ్లు లోపు ఆత్మహత్యలు పాల్పడుతున్న వారిలో 30 శాతం మంది కుటుంబ సమస్యలు, 14 శాతం మంది ప్రేమ వ్యహారాలు, 13 శాతం మంది అనారోగ్యం, ఎనిమిది శాతం మంది పరీక్షల్లో ఫెయిల్ అవ్వటం కారణంగా ఆత్మహత్యకు పాల్పడుతున్నారు.
ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ లు విద్యార్థులు, యువత ఆత్మహత్యలకు కారణమని చెప్పవచ్చు. ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో 95 శాతం మంది ఏదో ఒక మానసిక సమస్యతో బాధపడుతున్న వారేనని సర్వేలు చెబుతున్నాయి. డిప్రెషన్, ఒత్తిడి, జీవితంపై నిరాసక్తత, జీవితంలో ఏమి సాధించలేమనే ఆలోచన, భవిష్యత్తు అంధకారంగా కనిపించడం, తమకు తోడుగా నిలిచే వారు ఎవరూ లేరనే భావన తదితర అంశాలు ఆత్మహత్య ఆలోచనలు ప్రేరేపిస్తున్నాయని మనోవిజ్ఞాన నిపుణులు చెప్తున్నారు.
విద్యార్థుల ఆత్మహత్యలకు విద్యా సంబంధిత విషయాలు కూడా కారణం కావడం గమనించదగ్గ అంశం. ఎన్సీఈఆర్టీ 2022లో నిర్వహించిన ఓ సర్వేలో 81 శాతం మంది విద్యార్థులు తమ ఒత్తిడి, ఆందోళనకు విద్యా సంబంధిత విషయాలే కారణమని చెప్పడం గమనార్హం. దేశంలోని విద్యార్థుల్లో 62 శాతం మందికి ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో తెలియదని నిమ్హాన్స్ సంస్థ సర్వేలో తేలింది. దీనికి తోడు విద్యావ్యవస్థలో విద్యార్థులపై పెరుగుతున్న ఒత్తిడి, తోటి విద్యార్థులతో పోటీ, తల్లిదండ్రుల ఆకాంక్షలు, ప్రేమ వ్యవహారాలు విద్యార్థులపై ప్రభావం చూపించి వారు కఠిన నిర్ణయాలు తీసుకునే విధంగా ప్రోత్సహిస్తున్నాయని చెప్పవచ్చు.
కరోనా సమయంలో విద్యార్థులు సోషల్ మీడియాకి ఎక్కువగా ఆకర్షితులు కావడం కూడా వారిలో డిప్రెషన్ పెరగడానికి కారణమని పరిశోధనలు చెపుతున్నాయి. విద్యార్థుల ఆత్మహత్య తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్రతరం అవడం కనిపిస్తూ ఉంది. గత ఏడాది ఇంటర్ ఫలితాల తర్వాత కేవలం వారం రోజుల్లోనే పదిమంది విద్యార్థులు బల్వన్మరణం పొందడం ఇందుకు నిదర్శనం. సమాజాన్ని కలవరపెడుతున్న విద్యార్థుల ఆత్మహత్యలపై దృష్టి సారించకపోతే దేశానికి వెన్నుదన్నుగా నిలిచే మానవ వనరుల సంపదను కోల్పోక తప్పదు. దీన్ని దృష్టిలో పెట్టుకునే కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆత్మహత్యల నివారణ వ్యూహం రూపొందించింది. 2030 నాటికి ఆత్మహత్యలను 10 శాతం తగ్గించడం దీని లక్ష్యం.
కిం కర్తవ్యం!
పాఠశాల స్థాయి నుంచి నుంచి ఉన్నత విద్యాసంస్థల వరకు సంభవిస్తున్న విద్యార్థుల ఆత్మహత్యల నివారణపై ప్రభుత్వం దృష్టి సారించకపోతే పెను నష్టాన్ని చూడాల్సి వస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల ఆత్మహత్యల నివారణపై 2001లో నీరదారెడ్డి కమిటీ ఇచ్చిన 17 సిఫార్సులను ఇంతవరకు అమలు చేయకపోవడం, ఈ విషయంపై ప్రభుత్వాల చిత్తశుద్ధిని శంకించాల్సి వస్తుంది. దేశంలో మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యా సంస్థల్లో ఆత్మహత్యల నివారణ పై దృష్టి సారించి కొన్ని సంస్థలతో కలిపి గేట్ కీపింగ్ శిక్షణ ఇవ్వడానికి పూనుకోవడం శుభ పరిణామం.
ఊక దంపుడు ఉపన్యాసాలు వ్యర్థం..
విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వాలు, ప్రభుత్వ సంస్థలు శాస్త్రీయ పద్ధతిలో కృషి చేయాల్సిన అవసరం ఉంది. విద్యాసంస్థల్లో కేవలం ప్రేరణ తరగతులు నిర్వహించడం ద్వారా నివారించవచ్చు అనుకోవడం భ్రమ. ఆత్మహత్యల నివారణ అనే అంశం శాస్త్రీయపరమైంది. అందుకు కొన్ని శాస్త్రీయ పద్ధతులు కూడా మనోవిజ్ఞాన శాస్త్రంలో ఉన్నాయి. వాటిని అమలు చేయడం ద్వారా కొంతవరకు అధిగమించవచ్చు. కొన్ని అంశాలను అమలు పరచడం ద్వారా మాత్రమే ఆత్మహత్యల నివారణ సాధ్యమవుతుంది.
అమలు చేయాల్సినవి ఇవీ
- అన్ని విద్యాసంస్థల్లోనూ తరచుగా మనోవైజ్ఞానిక నిపుణులతో కౌన్సిలింగ్ నిర్వహించాలి.
- విద్యార్థులకు అతి దగ్గరగా ఉండే ఉపాధ్యాయులు, సంక్షేమ వసతి గృహాల వార్డెన్లు, పాఠశాలలోని పీఈటీలు తదితర వర్గాల వారికి గేట్ కీపింగ్ శిక్షణ ఇవ్వాలి.
- విద్యార్థులకు సమస్య వస్తే చెప్పుకోవడానికి, దిశా నిర్దేశం చేయడానికి 24 గంటలు అందుబాటులో ఉండే హెల్ప్ లైన్ లను అందుబాటులోకి తీసుకురావాలి.
- ఆత్మహత్య సంకేతాలను గుర్తుపట్టడం, తోటి వారిని నిపుణుల సాయం తీసుకునే విధంగా ప్రోత్సహించడం వంటి అంశాలపై అన్ని విద్యాసంస్థల్లో విద్యార్థులకు పీర్ కౌన్సిలర్ శిక్షణ ఇవ్వాలి.
- ప్రభుత్వ రంగంలోనూ, ప్రైవేటు రంగంలోనూ ఉన్న మానసిక నిపుణులకు ఆత్మహత్యల నివారణ అంశాలపై ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించి వారి సేవలను వినియోగించుకోవాలి.
- అన్ని రకాల విద్యాసంస్థలలో ఆత్మహత్యలపై ఉన్న అపోహలు తొలగించే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.
- విద్యార్థుల మానసిక ఆరోగ్య పరిరక్షణ, ఒత్తిడి నిర్వహణా సామర్ధ్యాలపై ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు విస్తృతమైన అవగాహన కల్పించాలి.
- విద్యా వ్యవస్థలో విద్యార్థుల మార్కులకు కాకుండా మేధోపరమైన సామర్థ్యాలకు విలువ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి.
ప్రభుత్వాలు, ఆత్మహత్యల నివారణ కోసం పని చేస్తున్న ఎన్జీవోస్ ఈ అంశాలపై దృష్టి సారించి విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించగలిగితే జాతీయ ఆత్మహత్యల నివారణ వ్యూహం లక్ష్యం సాధించడానికి మార్గం సుగమం అవుతుంది. సామాజిక సమస్యగా ఉన్న ఆత్మహత్యలు సామాజిక రుగ్మతగా మారక ముందే ప్రభుత్వాలు, విద్యాసంస్థలు, తల్లిదండ్రులు , సామాజికవేత్తలు తదితర అన్ని వర్గాల వారు మేల్కొనడం మంచిది.
- బి. కృష్ణ, సైకాలజిస్ట్
అధ్యక్షుడు, ఏపీఏ ఇండియా
ఫోన్ : 99854 28261