విద్యార్థుల విజయానికి క్రమశిక్షణ, ఏకాగ్రత, పట్టుదల, ప్రతిభ, తెలివితేటలు అవసరం అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఒక విద్యార్థికి ఈ అంశాలన్నీ ఉండి, ఆ ఒక్క ముఖ్యమైన లక్షణం లేకపోతే, అటువంటి విద్యార్థి విజయం సాధించలేడు. అంత ముఖ్యమైన లక్షణం ఏమిటని తెగ ఆలోచించేస్తున్నారా? అదేనండీ.. క్యురియాసిటీ. చాలా విషయాల గురించి తెలిసిన వెంటనే క్యూరియస్ గా ఫీలయ్యే పిల్లలు కొన్ని విషయాల పట్ల అంతగా ఆసక్తి చూపరు. వాటిల్లో ఎడ్యుకేషన్ ఒకటి కాకుండా ఉండాలంటే, ఇలా చేయండి.
పిల్లలకు వారు చదివే సబ్జెక్టులన్నింటిలో కేవలం కొన్నింటి మీద మాత్రమే క్యూరియస్ గా ఉంటారు. వారిలో ఉండే ఈ కుతూహలమే త్వరగా నేర్చుకోవడానికి దారితీస్తుంది. అయితే ప్రస్తుత పోటీ ప్రపంచంలో పిల్లల్లో ఈ రకమైన భావన కలగకుండా ఒత్తిడి పెరిగిపోయి మార్కుల కోసం తంటాలు పడుతున్నారు. కానీ, నేర్చుకోవడంపై ధ్యాస ఉంచలేకపోతున్నారు.
మనలో చాలా మంది తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలను పుస్తకాల్లో ఉన్నది చదివితే చాలని చెప్తుంటారు. ఎందుకంటే, కుతూహలంతో ప్రశ్నలు అడగడం మొదలుపెడితే ఆ విషయం గురించి ఎక్కువసేపు చర్చించాల్సి వస్తుందని వాయిదా వేసేస్తుంటారు. వాస్తవానికి ఇలా చెప్పడం వల్ల వారి మానసిక ఎదుగుదలపై, నేర్చుకోవాలనే తపనపై ప్రభావం చూపిస్తుంది. కుతూహలం (క్యూరియాసిటీ) ఫీలింగ్ తగ్గిపోయి మెషీన్‌లా చదువుకోవడం మొదలుపెడతారు.
పిల్లలు కచ్చితంగా చదువు లేదా మరే ఇతర అంశాలలోనైనా కుతూహలాన్ని పెంపొందించుకోవాలి. ఈ కుతూహలమే ఆ సబ్జెక్టును లోతుగా అధ్యయనం చేయడానికి, అర్థం చేసుకోవడానికి దోహదపడుతుంది. గణితం, సోషియాలజీ లేదా సైన్స్, స్పోర్ట్స్ ఏదైనా సరే, ప్రతి అంశాన్ని కుతూహలం పెంచుకుని సాధన చేయడానికి ప్రయత్నించమనాలి. మీ అభ్యసన కేవలం పరీక్ష, ఫలితం, ఉపాధి కోసం మాత్రమే కాకుండా పూర్తిగా నేర్చుకోవడం, ఎదగాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగాలని ప్రేరేపించాలి. పిల్లలు ఇదే వైఖరితో కొనసాగితే, వారు ఏ విషయాన్నైనా నేర్చుకోవడంలో ఎటువంటి ఆటంకాలు ఏర్పడవు. ఒకవేళ ఎదురైనా వారిని అడ్డుకోలేవు.
విద్యార్థులు కుతూహలంతో నేర్చుకుంటే వారిలో నుంచి ఒక శాస్త్రవేత్త, ఒక మహా మేధావి బయటకు వచ్చే అవకాశం ఉంది. పిల్లల గొప్ప సంపద అయిన కుతూహలాన్ని ఎంకరేజ్ చేయండి. అదే వారిని ఉత్తేజపరిచి నడిపిస్తుంది. అప్పుడు విద్యార్థి స్వచ్చందంగా సొంతంగా నేర్చుకోవడం కొనసాగిస్తాడు.
సంబంధిత కథనం
టాపిక్