బరువు చెక్ చేయడానికి అత్యంత చెత్త సమయాలు ఇవేనట! మరి సరైన సమయం ఏది?-stop weighing yourself at these times if youre trying to lose weight ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  బరువు చెక్ చేయడానికి అత్యంత చెత్త సమయాలు ఇవేనట! మరి సరైన సమయం ఏది?

బరువు చెక్ చేయడానికి అత్యంత చెత్త సమయాలు ఇవేనట! మరి సరైన సమయం ఏది?

Ramya Sri Marka HT Telugu

బరువు తగ్గే ప్రయాణంలో వెయిట్ చెక్ చేసుకోవడవం చాలా అవసరం. కానీ దాన్ని ఎప్పుడు చెక్ చేసుకోవాలో తెలుసుకోవడం అంత కన్నా ముఖ్యం. ఎందుకంటే తప్పుడు సమయాల్లో బరువు చూసుకుంటే హెచ్చుతగ్గులను చూపించవచ్చు. అది మీ ప్రయత్నాలను నిరుత్సాహపరచవచ్చు. కాబట్టి ఎప్పుడు బరువు చూడకూడదో, ఎప్పుడు చూడాలో తెలుసుకోండి!

బరువు చెక్ చేసుకుంటున్న వ్యక్తి (Shutterstock)

బరువు తగ్గడం అనేది ఒక ప్రయాణం, అందులో ఎన్నో ఒడుదుడుకులు ఉంటాయి. చాలామంది ఈ ప్రయాణంలో తమ బరువును క్రమం తప్పకుండా చెక్ చేసుకుంటూ ఉంటారు. నిజానికి వెయిట్ లాస్ అవడం అనేది అంత ఈజీగా, త్వరగా జరిగేది కాదు. కచ్చితంగా సమయం పడుతుంది, కానీ బరువు చూసుకోవాలనే ఆత్రుత మాత్రం మనలో చాలామందికి ఉంటుంది. అయితే, మనం ఎప్పుడు పడితే అప్పుడు బరువు చూసుకుంటే, కొన్నిసార్లు అది మనల్ని నిరుత్సాహానికి గురి చేస్తుంది. ఎందుకంటే, కొన్ని సమయాల్లో బరువులో వచ్చే మార్పులకు వేరు వేరు కారణాలుంటాయి.

ఫిట్‌నెస్ నిపుణులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. శరీర బరువును చెక్ చేయడానికి కొన్ని సరైన సమయాలు ఉన్నాయి, అలాగే కొన్ని తప్పు సమయాలు కూడా ఉన్నాయి. మనం తప్పు సమయాల్లో బరువు చూసుకుంటే, అది మన మానసిక స్థితిపై ప్రభావం చూపుతుంది, బరువు తగ్గడం కోసం మన ప్రయత్నాలను నిరుత్సాహపరచవచ్చు.

బరువు చూడకూడని కొన్ని ముఖ్యమైన సమయాలు:

1. తీవ్రమైన వ్యాయామం చేసిన వెంటనే:

వ్యాయామం చేసినప్పుడు మన శరీరం నుండి చెమట రూపంలో నీరు బయటకు పోతుంది. దీనివల్ల బరువు కొద్దిగా తగ్గినట్లు అనిపించవచ్చు. అయితే, వ్యాయామం తర్వాత మనం నీరు త్రాగటం లేదా ఏదైనా తినడం వల్ల ఆ బరువు తిరిగి వస్తుంది. కాబట్టి, వ్యాయామం వెంటనే చూసే బరువు నిజమైన మార్పును చూపించదు. ఇది కేవలం శరీరంలో నీటి శాతం మారడం వల్ల వచ్చే తేడా మాత్రమే.

2. భోజనం తిన్న తర్వాత:

మనం భోజనం తిన్నప్పుడు ఆ ఆహారం మన కడుపులో ఉంటుంది. దీనివల్ల బరువు కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. ఇది మనం కొవ్వు పెంచామని కాదు, కేవలం తిన్న ఆహార బరువు మాత్రమే. కొంత సమయం తర్వాత అది జీర్ణమైతే బరువు మళ్లీ సాధారణ స్థితికి వస్తుంది.

3. పీరియడ్స్ సమయంలో:

మహిళల శరీరంలో రుతుక్రమం సమయంలో హార్మోన్ల స్థాయిలు మారుతుంటాయి. ముఖ్యంగా లూటియల్ దశలో అంటే అ ఒవెల్యూషన్ తర్వాత, పీరియడ్స్ ముందు శరీరంలో నీరు నిలుపుదల ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఉబ్బరం, కాళ్ళ వాపు వంటి సమస్యలు వస్తాయి. బరువు కూడా కొంచెం ఎక్కువగా అనిపించవచ్చు. ఇది హార్మోన్ల ప్రభావం వల్ల వచ్చే తాత్కాలిక మార్పు మాత్రమే. నిజమైన బరువు కాదు.

4. పడుకునే ముందు:

రోజంతా మనం తింటూ, త్రాగుతూ, కదులుతూ ఉంటాము. దీనివల్ల రాత్రికి మన శరీర బరువు ఉదయం కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, పడుకునే ముందు బరువు చూడటం సరైనది కాదు.

5. అధిక సోడియం, అధిక కార్బోహైడ్రేట్లు తిసుకున్న తర్వాత:

ఉప్పు, పిండి పదార్థాలు మన శరీరంలో నీటిని నిలుపుకునేలా చేస్తాయి. మనం ఎక్కువ ఉప్పు లేదా అధిక కార్బోహైడ్రేట్లు కలిగిన పిండి పదార్థాలు తిన్న తర్వాత బరువు చూసుకుంటే, బరువు పెరిగినట్లు అనిపించవచ్చు. కానీ ఇది నిజమైన కొవ్వు పెరగడం కాదు, కేవలం శరీరంలో ఎక్కువ నీరు ఉండటం వల్ల వచ్చే మార్పు మాత్రమే.

మరి బరువును చెక్ చేసుకోవడానికి సరైన సమయం ఏది?

  • ఫిట్‌నెస్ నిపుణులు సూచించే దాని ప్రకారం, బరువును తనిఖీ చేయడానికి ఉత్తమ సమయం ఉదయం. నిద్రలేచిన తర్వాత, బాత్రూమ్ వెళ్ళి వచ్చిన తర్వాత, ఏమీ తినకముందు బరువును చెక్ చూడాలి. ఇలా చేయడం వల్ల ఆహారం లేదా నీటి వల్ల వచ్చే బరువు ప్రభావం ఉండదు.
  • అలాగే, బరువును తరచుగా చూడకుండా వారానికి ఒకసారి చూడటం మంచిది. వారంలో ఒకే రోజు, ఒకే సమయంలో బరువు చూడటం వల్ల మార్పులను సరిగ్గా గమనించవచ్చు. ఎందుకంటే వారాంతంలో వచ్చే అదనపు ఆహారం లేదా విందుల ప్రభావం అప్పటికి ఉండదు.

బరువు తగ్గే ప్రయాణంలో నిరుత్సాహపడకుండా ఉండాలంటే, సరైన సమయాల్లో బరువు చూడటం చాలా ముఖ్యం. గుర్తుంచుకోండి, బరువు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే, మీ మొత్తం ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ను అది మాత్రమే నిర్ణయించదు. మీరు మీ ఆహారం, వ్యాయామం, జీవనశైలిలో ఆరోగ్యకరమైన మార్పులు చేసుకుంటూ ఉండండి, ఫలితాలు తప్పకుండా కనిపిస్తాయి.

రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.