Saturday Motivation: అనవసర విషయాలు మాట్లాడడం, వినడం రెండూ మానేయండి, ప్రశాంతంగా జీవిస్తారు
Saturday Motivation: అనవసర విషయాల వల్లే జీవితంలో ఎక్కువ సమస్యలు వస్తాయి. అలాంటి విషయాలు విన్నాక వేరేచోట మాట్లాడాల్సి కూడా రావచ్చు. అందుకే అనవసరమైన విషయాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
ఓ రోజు చాణక్యుడు ఆరుబయట కూర్చుని ఉన్నాడు. అతనితో ఒక స్నేహితుడు మాట్లాడేందుకు వచ్చాడు. స్నేహితుడు పరుగు పరుగున రావడం, ఏదో ఆత్రుతగా ఉండడం చాణక్యుడు గుర్తించాడు. వెంటనే ఆ వ్యక్తి ‘చాణక్యా... ఆ వీధి చివర ఉండే నీ స్నేహితుడు గురించి తెలుసా?’ అని మొదలుపెట్టాడు.
వెంటనే చాణక్యుడు ‘ఒక్క నిమిషం ఆగు, నువ్వు చెప్పే విషయం పూర్తిగా నిజమని నీకు తెలుసా?’ అని అడిగాడు. దానికి ఆ వ్యక్తి ‘లేదు... ఎవరో నాతో చెబితే నీకు చెబుతున్నాను’ అని సమాధానం ఇచ్చాడు. వెంటనే చాణక్యుడు ‘మరి నువ్వు చెప్పబోయే విషయం నిజమో కాదో తెలియనప్పుడు మనకెందుకు? ఇంతకీ నువ్వు చెప్పాలనుకున్నది మంచి విషయమేనా?’ అని ప్రశ్నించారు. దానికి ఆ వ్యక్తి కాదని సమాధానం ఇచ్చాడు.
చాణక్యుడు ‘నిజమో కాదో తెలియని విషయం, అందులోనూ మంచి విషయం కాదు, దాన్ని నాకు చెప్పేందుకు ఇంత ఆత్రుతగా రావడం అవసరమా’ అన్నాడు. దానికి ఆ వ్యక్తి లేదు అని సమాధానం ఇచ్చాడు.
చాణక్యుడు చివరిగా ఆ వ్యక్తిని ‘నువ్వు చెప్పబోయే విషయం వల్ల నాకు ఏమైనా ఉపయోగం ఉంటుందా’ అని అడిగాడు. దానికి ఆ వ్యక్తి ‘ఉండదండి’ అని సమాధానం ఇచ్చాడు. వెంటనే ‘నువ్వు చెప్పబోయే విషయం నిజమైందో కాదో తెలియదు. నాకు మంచి కూడా చేయదు. ఏ రకంగానూ ఉపయోగపడదు. మరి అలాంటి విషయాన్ని వినడం వల్ల నాకేంటి ఉపయోగం? ఎవరో పక్క వారి గురించి లేనిపోని విషయాలు తెలుసుకోవడం వల్ల నా ఆలోచనలే కలుషితమవుతాయి. కాబట్టి నాకు ఆ విషయం చెప్పద్దు’ అని అన్నాడు. దాంతో ఆ వ్యక్తి నిరాశగా వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు.
చాణక్యుడు చెప్పినట్టు అనవసరమైన విషయాలను వినడం, వాటిల్లో జోక్యం చేసుకోవడం వల్ల మన సమయం, శక్తి వృధా అవుతుంది. దానికి మించి ఎలాంటి ఉపయోగం ఉండదు. అలాగే ఇతరుల వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూడడం కూడా మంచి పద్ధతి కాదు. మీ జీవితాన్ని ఇతరులు ఎంతగా గౌరవించాలి అనుకుంటున్నారో, మీరు కూడా ఇతరుల వ్యక్తిగత జీవితాన్ని అంతే గౌరవించాలి. లేకుంటే ఏదో రోజు పర్యవసానాన్ని మీరు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.
మీరు ఉద్దేశపూర్వకంగా లేదా తెలియక అయినా ఇతరుల గురించి చెడుగా వినడం, మాట్లాడడం చేయరాదు. ఇలా చేయడం వల్ల ఎప్పటికైనా మీకు చెడే జరుగుతుంది. మీ గురించి వేరే వాళ్ళు మాట్లాడే అవకాశాన్ని మీరే ఇచ్చిన వారవుతారు. కాబట్టి ఎవరి గురించైనా మీకు ఇతరులు చెడుగా చెబుతున్నప్పుడు వద్దని చెప్పడం అలవాటు చేసుకోండి. అనవసర విషయాల్లోకి జోక్యం చేసుకుంటే అది మీ ఎదుగుదలకు, అభివృద్ధికి ఆటంకంగా మారిపోతుంది. ఇది మీకు సమస్యలను తెచ్చిపడుతుంది. అలాగే మీ లక్ష్యాన్ని మీకు దూరం చేస్తుంది. మీ ఆసక్తులను వ్యక్తిగత ఎదుగుదలను కూడా మార్చేస్తుంది.
కాబట్టి ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం ఇతరుల గురించి చెడుగా మాట్లాడడం, చెడుగా వినడం కూడా పూర్తిగా మానేయండి. మీ జీవితం ఎంత ఆనందంగా, ఎంత పాజిటివ్ గా ఉంటుందో చూడండి.