Stages Of Relationship: ప్రేమలో గెలవాలంటే ఈ 5 దశలను దాటాలట! మీరు ఎన్ని దాటారు, ఇప్పుడు ఏ స్టేజ్‌లో ఉన్నారు?-stages of relationship to win love how many have you gone through and what stage are you in now ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Stages Of Relationship: ప్రేమలో గెలవాలంటే ఈ 5 దశలను దాటాలట! మీరు ఎన్ని దాటారు, ఇప్పుడు ఏ స్టేజ్‌లో ఉన్నారు?

Stages Of Relationship: ప్రేమలో గెలవాలంటే ఈ 5 దశలను దాటాలట! మీరు ఎన్ని దాటారు, ఇప్పుడు ఏ స్టేజ్‌లో ఉన్నారు?

Ramya Sri Marka HT Telugu

Stages Of Relationship: ఏ సంబంధమైనా అనేక దశల గుండా వెళుతుంది. అప్పుడే అది తన గమ్యస్థానాన్ని చేరుకుంటుంది. ప్రేమ సంబంధం కూడా అలాంటిదే. ప్రేమలో గెలవాలంటే ముఖ్యంగా 5 దశలను దాటాలట. మీరు ఎన్ని దశలు దాటారు? ఇప్పుడు ఏ స్టేజ్‌లో ఉన్నారో తెలుసుకోవాలని ఉంటే ఇది చదివేయండి.

ప్రేమలో గెలవాలంటే ఏయే దశలు దాటాలి (Shutterstock)

ఏ సంబంధంలోనైనా చివరి మజిలీకి చేరుకోవాలంటే అనేక దశల గుండా వెళ్లాల్సి ఉంటుంది. అది ప్రేమబంధం అయినా, పెళ్లి బంధం అయినా లేక స్నేహ బంధం అయినా అనేక ఒడిదుడుకులను దాటుకుంటూ వెళితేనే గమ్యస్థానాన్ని చేరుకుంటుంది.అన్ని రకాల దశలు దాటితేనే బలంగా తయారవుతుంది, శాశ్వతంగా నిలిచిపోతుంది. ముఖ్యంగా రొమాంటిక్ సంబంధం విషయంలో, వీటి ప్రాముఖ్యత మరింత పెరుగుతుంది.

ఎందుకంటే ప్రేమించే ప్రతి వ్యక్తి కోరిక ఒక్కటే. అదేంటంటే.. తమ భాగస్వామితో విడదీయరాని బంధాన్ని ఏర్పరుచుకోవడం, ఎనలేని ప్రేమను పొందడం. ఇదే ఇద్దరు వ్యక్తులను ఒక్కటి చేసేది. ఇందుకోసం చాలా విషయాలను తట్టుకుని నిలబడాల్సి ఉంటుంది. ప్రేమలో ముఖ్యంగా ఎన్ని దశలుంటాయి? వాటిలో మీరు ఇప్పటి వరకూ ఎన్ని దశలను దాటారు, ప్రేమలో మీరు ఇప్పుడు స్టేజ్‌లో ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి..

1. మొదటి దశ ఆకర్షణ(Attraction)

ప్రేమ సంబంధంలో మొదటి దశ ఆకర్షణ. అందరూ అంటారు కదా 'మొదటి చూపులో ప్రేమ'. అని. నిజానికి అది ప్రేమ కాదు, ఆకర్షణ. కానీ సాధారణంగా ప్రేమ ఇక్కడే మొదలవుతుంది. మీరు ఒక వ్యక్తిని చూడగానే ఆకర్షితులై, ఆ వ్యక్తి గురించి మరింత తెలుసుకోవాలని కోరుకుంటారు. వారికి దగ్గర అవాలని ఆశ పడతారు. ఈ దశను కొంతమంది ప్రేమతో కాకుండా, కేవలం వాంఛతో కూడా అనుసంధానిస్తారు. ఎందుకంటే ఇక్కడ అవతలి వ్యక్తి గురించి ఎక్కువ ఏమీ తెలియదు, వారి గురించి ఏమీ అర్థం చేసుకోకుండా, కేవలం రూపం లేదా ఇతరల ఆకర్షణీయ అంశాల ఆధారంగా మాత్రమే వారిని కోరుకుంటారు. ఈ ఆకర్షణ దశను మరింత ఆసక్తికరంగా చేసే హార్మోన్లు శరీంలో ఉత్పత్తి అవుతాయి.

2. రెండవ దశ హనీమూన్(Honeymoon)

ప్రేమ సంబంధంలో రెండవ దశను 'హనీమూన్ దశ' అని పిలుస్తారు. ఈ దశ మొదటి దశకు కాస్త భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఈ దశలో కూడా హార్మోన్ల ఉత్పత్తి ఎక్కువగానే ఉంటుంది. ఈ సమయంలో ప్రతిక్షణం ప్రేమలో మునిగి ఉన్నట్లు కనిపిస్తుంది. అన్ని పనులను వదిలి గంటల తరబడి ఫోన్లో మాట్లాడటం, చంద్రుడు, నక్షత్రాలు వంటి వాటి గురించి మాట్లాడటం, పూర్తి ప్రపంచాన్ని ప్రేమకు శత్రువుగా భావించడం, ఇవన్నీ ఈ దశలో జరుగుతాయి. అయితే, ఈ దశలో మీరు ఒకరినొకరు మెరుగ్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. నిజానికి ఏ ప్రేమ సంబంధంలోనైనా ఇది చాలా ముఖ్యం కూడా.

3. భావోద్వేగ దశ వస్తుంది(Emotional Attachment)

ప్రేమలో మూడవ దశ భాగస్వామికి భావోద్వేగంగా దగ్గర అవడం. ఈ సమయంలో మీరు ఒకరి గురించి ఇంకొకరు ఆలోచించడం ప్రారంభిస్తారు. అంటే ఆనందం, దుఃఖం పంచుకునే ప్రయత్నం చేస్తారు. ఈ దశలోనే భవిష్యత్తు ప్రణాళిక ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది. నిజానికి ఇది మీరు మీ భాగస్వామితో ముందుకు సాగి వివాహం చేసుకోవాలా వద్దా అని నిర్ణయించుకునే దశ. మొత్తంమీద మీరు ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవడం ఇక్కడే జరుగుతుంది. ఈ దశలో మీరు అవతలి వ్యక్త మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నారా లేక ఆకర్షణతో కోరుకుంటున్నారా అని తెలుస్తుంది.

4. మేక్ ఆర్ బ్రేక్ దశ(Make OR Break)

భావోద్వేగ దశ తర్వాత మేక్ ఆర్ బ్రేక్ దశ వస్తుంది. దీనిని ఆత్మపరిశీలన దశ అని కూడా అంటారు. ఇది మీ బంధాన్ని చివరి వరకూ కొనసాగించగలరో లేదో నిర్ణయం తీసుకోగలిగే దశ. ఈ దశలో చాలా పరీక్షలు ఉంటాయి. ఒకరిపై ఒకరు అపారమైన ప్రేమ, నిబద్ధత కలిగి ఉంటారు. సంబంధంలో వచ్చిన సమస్యలను కలిసి పరిష్కరించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. మీరు ఈ దశను బాగా పూర్తి చేయగలుగుతున్నారంటే, మీరు జీవితం పొడవునా మీ బంధాన్ని కొనసాగించగలని అర్థం.

5. ఒకరినొకరు నమ్మే దశ(Stability)

ఇది ప్రేమలో చివరి దశ. ఈ దశకు చేరుకునే సమయానికి జంట చాలా పరిణతి చెంది ఉంటుంది. వారి బంధం కూడా బలంగా మారుతుంది. ఒకరినొకరు చాలా బాగా అర్థం చేసుకున్న తర్వాత , ఒకరి మంచి చెడులను మరొకరు పూర్తిగా అంగీకరించిన తర్వాత ఒకరిపై మరొకరు పూర్తి నమ్మకంతో నిలబడే దశ ఇది. ఈ దశలో మీరు ఒకరితో ఒకరు ఉండటానికి పూర్తిగా సిద్ధంగా ఉంటారు. ఇప్పుడు నక్షత్రాలను తెచ్చి, చంద్రుడిని చూపించడం వంటి విషయాలు మాట్లాడుకోరు. జీవిత లక్ష్యాలు, భవిష్యత్తు ప్రణాళికలు, కలిసి జీవితాన్ని ఆనందించడం మీ చర్చా అంశంగా మారుతుంది.

చూశారు కదా. ఇవి ప్రేమలో ముఖ్యమైన 5 దశలు. మీరు ఏ దశలో ఉన్నారో మీకు ఇప్పటికే అర్థం అయి ఉండాలి. అర్థం చేసుకుని మరిన్ని దశలు సుగమంగా దాటి మీ ప్రేమను గెలవండి. సంతోషంగా జీవించండి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల అభిప్రాలయను క్రోడీకరించి మాత్రమే ఈ సూచనలు అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Ramya Sri Marka

eMail
రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం