Sravana Masam 2022 : శ్రావణమాసంలో ప్రతి ఇల్లు దేవాలయమే.. ప్రతిరోజూ పండుగే..-sravana masam 2022 significance and specialty and history ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Sravana Masam 2022 Significance And Specialty And History

Sravana Masam 2022 : శ్రావణమాసంలో ప్రతి ఇల్లు దేవాలయమే.. ప్రతిరోజూ పండుగే..

Geddam Vijaya Madhuri HT Telugu
Jul 28, 2022 07:49 AM IST

అన్ని మాసాలలో శ్రావణమాసం చాలా ప్రత్యేకం. ఈ మాసంలో ప్రతిరోజుకు ఓ ప్రత్యేకత ఉంటుంది. ప్రతి ఇల్లు ఓ దేవాలయాన్ని తలపిస్తుంది. శుభకార్యాలు ఎక్కువగా చేస్తారు. మహిళలు పూజలు, వ్రతాలు, వాయినాలతో బిజీబిజీగా ఉంటారు. చాలా పండుగలు కూడా ఈ మాసంలోనే వస్తాయి. అయితే శ్రావణమాసం రేపటి నుంచి ప్రారంభంకానున్న నేపథ్యంలో దాని గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.

శ్రావణమాసం 2022
శ్రావణమాసం 2022

Sravana Masam 2022 : ఆషాడం వెళ్లి.. శ్రావణమాసం వచ్చిందంటే చాలు మహిళలకు ప్రతిరోజూ పండగే. ప్రతి ఇల్లు ఓ మందిరాన్ని తలపిస్తుంది. ఈ మాసంలో చేసే దైవ కార్యాలకు ఎంతో శక్తి ఉంటుందని వేద పురణాలు చెప్తున్నాయి. అందుకే ఈ మాసంలో లక్ష్మీదేవిని ఎక్కువమంది ఆరాధిస్తారు. అలా ఆరాధిస్తే సకల సంపదలు చేకూరుతాయని భక్తులు నమ్ముతారు.

ప్రత్యేక పూజలు

శ్రావణమాసంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సోమ, మంగళ,శుక్రవారం గురించి. ఎందుకంటే మహిళలు ఆ రోజుల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. ఉదయం, సాయంత్రం దీపారాధన చేస్తారు. అంతేకాకుండా భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతం, మంగళగౌరీ వ్రతం అంటూ ప్రత్యేక పూజలు చేస్తారు. ముత్తైదువులను పిలిచి వాయినాలు ఇస్తారు.

ప్రతిరోజుకు ఓ ప్రత్యేకత

హిందూ క్యాలండర్ ప్రకారం ఐదో మాసమే శ్రావణమాసం. ఈ పవిత్రమైన శ్రావణమాసంలో ప్రతిరోజుకు ఓ ప్రత్యేకత ఉంది. శ్రావణ అష్టమి, నవమి, ఏకాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, పూర్ణిమ వంటి తిథులు లక్ష్మీపూజకు శ్రేష్టమైనవి. సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువే శ్రవణా నక్షత్రంలో జన్మించాడని పురాణాలు చెప్తున్నాయి. స్వామివారు జన్మించిన మాసం కాబట్టి.. లక్ష్మీదేవికి కూడా ఈ మాసమంటే ఇష్టమని భావిస్తారు. పైగా శ్రవణం అంటే వినడం. అందుకే ఈ మాసంలో ఏ పూజ చేసినా.. లక్ష్మీ దేవి వింటుందని భక్తులు నమ్ముతారు.

సోమవారం శివపూజ తప్పనిసరి

అంతేకాకుండా శ్రావణమాసం శివునికి కూడా చాలా ప్రీతిపాత్రమైనది. అందుకే శ్రావణమాసంలో ప్రతి సోమవారం శివుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. శివుడిని పూజిస్తే చాలు.. తమకు అన్ని సౌఖ్యాలు లభిస్తాయని భక్తులు నమ్ముతారు. అంతేకాకుండా ఈ నెలలో ఎన్నో మంచి రోజులు, విశిష్ట పండుగలు కూడా ఉంటాయి. అందుకే శుభకార్యాలను కూడా శ్రావణమాసంలోనే ఎక్కువగా చేస్తారు. పెళ్లిలు, గృహప్రవేశాలు ఇలా చాలా కార్యక్రమాలను శ్రావణమాసంలోనే జరిపేందుకు చూస్తారు.

ప్రతిరోజూ ఓ పండుగే..

శ్రావణమాసంలో దాదాపు అన్ని ఇల్లు పసుపు కుంకుమలతో, పచ్చని మామిడాకు తోరణాలతో కళకళలాడిపోతుంది. ఈ మాసంలో ఒక్కోరోజు గడిచే కొద్ది ఒక్కో పండుగ పలకరిస్తూనే ఉంటుంది. ముందుగా నాగపంచమి వస్తుంది. శ్రావణమాసం ప్రారంభమైన ఐదో రోజే ఇది వచ్చేస్తుంది. ఆ వెంటనే షష్టి వస్తుంది. రాఖీపౌర్ణమి, కృష్ణాష్టమి, శ్రావణమాసంలో వచ్చే ఏకాదశి ఇలా చెప్పపుకుంటూ పోతే.. ఒకటా రెండా చాలా మంచిరోజులు ఉన్నాయి. ఇవి కాకుండా వరలక్ష్మీ వ్రతం, మంగళగౌరీ వ్రతం అంటూ నిత్యం ఏదొక పూజలు చేస్తూనే ఉంటారు మహిళలు.

WhatsApp channel

సంబంధిత కథనం