Mirch Ka Salan Recipe । బిర్యానీతో మిర్చి కా సలాన్ కలుపుకొని తింటే టేస్ట్ అదుర్స్!
Mirch Ka Salan Recipe: బిర్యానీ మరింత రుచిగా ఉండాలంటే అందులో మిర్చి కా సలాన్ కలుపుకోవాలి. ఈ టేస్టీ వంటకం రెసిపీ ఇక్కడ చూడండి.
Biryani Recipes: హైదరాబాదీ మిర్చి కా సలాన్ గురించి తెలియనివారు ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నారంటే వారు ఇప్పటివరకు హైదరాబాదీ దమ్ బిర్యానీ తినలేదని అర్థం. మిర్చి కా సలాన్ అనేది బిర్యానీతో వడ్డించే ప్రసిద్ధ వంటకం. ఉర్దూలో సలాన్ అంటే గ్రేవీ కూర అలాగే మిర్చి అనేది మిరపకాయలు అనే అర్థాలను ఇస్తాయి. మొత్తంగా మొత్తంగా మిర్చి కా సలాన్ అంటే మిరపకాయల గ్రేవీ కర్రీ అనుకోవచ్చు. ఈ గ్రేవీ ఎంతో రుచికరంగా ఉంటుంది. బిర్యానీ, పులావు మొదలైన రైస్ వంటకాలతో తిన్నప్పుడు మరింత రుచిగా ఉంటుంది. దీనితో పాటు చల్లటి రైతా కూడా సర్వ్ చేసుకుంటే ఆ రుచి గురించి చెప్పటానికి మాటలు చాలవు.
మీకు మిర్చి కా సలాన్ తినాలని ఉందా? దీని తయారు చేసుకోవడం చాలా సులభం. మిర్చి కా సలాన్ రెసిపీని ఇక్కడ అందిస్తున్నాం. సూచనలను అనుసరించి సులభంగా మీ ఇంట్లో తయారు చేసుకోవచ్చు.
Mirch Ka Salan Recipe కోసం కావలసినవి
- 7-8 పొడవైన మందపాటి పచ్చి మిరపకాయలు
- 1/4 కప్పు నూనె
- 1/2 టీస్పూన్ ఆవాలు
- ¼ టీస్పూన్ మెంతులు
- 7-8 తాజా కరివేపాకు
- 1 టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్
- 1 కప్పు చింతపండు రసం
- 1/2 కప్పు నీరు
- రుచికి తగినంత ఉప్పు
- 1/2 టీస్పూన్ కారం
- 1 టమోటా
మసాలా కోసం:
- 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు
- 1 టేబుల్ స్పూన్ వేరుశెనగ
- 1 టేబుల్ స్పూన్ ధనియాలు
- 1 టేబుల్ స్పూన్ జీలకర్ర
- 1 టేబుల్ స్పూన్ నువ్వులు
- 1 పెద్ద ఉల్లిపాయ
మిర్చి కా సలాన్ తయారీ విధానం
- ముందుగా ఒక పాన్‌ను వేడి చేసి, దానిపై కొబ్బరి, వేరుశనగ, ధనియాలు, జీలకర్ర, నువ్వులు వేసి పొడిగా వేయించాలి. ఆపై వీటిని పక్కన పెట్టండి.
- అదే పాన్‌లో, ఒక టీస్పూన్ నూనె వేసి, ఉల్లిపాయ ముక్కలు వేసి, రంగు మారేంతవరకు వేయించాలి.
- ఇప్పటి వేయించిన మసాలా దినుసులు, ఉల్లిపాయలను కాస్త చల్లబరిచి, అనంతరం బ్లెండర్లో వేసి మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఉప్పు, అర టీస్పూన్ పసుపు, అరకప్పు నీళ్లు పోసి మెత్తని పేస్ట్‌లా రుబ్బుకోవాలి.
- ఇప్పుడు ఒక వంట పాత్రలో నూనె వేసి వేడి చేయాలి. అందులో పచ్చి మిరపకాయలు వేసి మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించాలి. అప్పుడప్పుడు కలుపుతూ మిరపకాయల రంగు కొద్దిగా మారే వరకు ఉడికించాలి. అనంతరం మిరపకాయలను బయటకు తీయండి.
- అదే నూనెలో మెంతులు, ఆవాలు వేసి చిటపటలాడనివ్వండి, ఆపై తాజా కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించండి.
- ఇప్పుడు ఉల్లిపాయ మసాల పేస్ట్ కూడా వేసి కలుపుతూ వేయించండి. మూతపెట్టి 5 నిమిషాలు ఉడికించాలి.
- చింతపండు రసం, అర కప్పు నీరు కలపండి. రుచి ప్రకారం కారం, ఉప్పు కలపండి. ఒక టమాటా సగానికి కట్ చేసి వేయండి.
- మీడియం వేడి మీద సుమారు 10-15 నిమిషాలు కూరను మూతపెట్టి గ్రేవీ చిక్కగా మారేంత వరకు ఉడికించాలి.
- చివరగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసుకోండి.
అంతే, మిర్చి కా సలాన్ రెడీ. బిర్యానీతో సర్వ్ చేసుకొని తినండి.
సంబంధిత కథనం