నడుం నొప్పిని తేలిగ్గా తీసుకోవద్దు: వైద్య నిపుణుల హెచ్చరిక-spine surgeon warns indians not to ignore back pain until its too late ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  నడుం నొప్పిని తేలిగ్గా తీసుకోవద్దు: వైద్య నిపుణుల హెచ్చరిక

నడుం నొప్పిని తేలిగ్గా తీసుకోవద్దు: వైద్య నిపుణుల హెచ్చరిక

HT Telugu Desk HT Telugu

నడుం నొప్పిని నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన సమస్యలు తప్పవని వెన్నెముక సర్జన్ హెచ్చరిస్తున్నారు. భారత్‌లో మెడ, నడుం నొప్పులను సర్వసాధారణంగా చూడటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

నడుం నొప్పిని తేలిగ్గా తీసుకోవద్దంటున్న వైద్య నిపుణులు (Freepik)

నడుం నొప్పిని తేలిగ్గా తీసుకుంటే అది మొండి సమస్యగా మారి, కదలికలను కూడా కష్టతరం చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మెడ, నడుం నొప్పులను సాధారణంగా చూడటం ఎంతమాత్రం సరికాదని వెన్నెముక సర్జన్ స్పష్టం చేస్తున్నారు.

మీరు రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసేవారైతే, నడుం నొప్పి మీకు కొత్తేమీ కాదు. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్నా, మధ్యమధ్యలో లేచి అటుఇటు తిరుగుతున్నా కూడా, ఒక్కోసారి నడుం నొప్పి మెల్లగా వచ్చి పలకరించే అవకాశాలు చాలా ఎక్కువ. నిజానికి, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వైకల్యానికి గురవడానికి నడుం నొప్పి ఒక ముఖ్యమైన కారణం. అంతేకాదు, 'చాలా మంది తమ జీవితంలో కనీసం ఒక్కసారైనా ఈ నొప్పితో బాధపడతారు' అని కూడా WHO వెల్లడించింది.

ఆరోగ్య సమస్యలకు రెండో ప్రధాన కారణం

WHO 2023 జూన్ నెల నివేదిక ప్రకారం, 2020లో ప్రపంచవ్యాప్తంగా 61.9 కోట్ల మంది ప్రజలు దిగువ వెన్ను నొప్పితో ఇబ్బంది పడ్డారు. జనాభా పెరుగుదల, వృద్ధాప్యం వల్ల ఈ సంఖ్య 2050 నాటికి 84.3 కోట్లకు చేరుకుంటుందని అంచనా. ఇంత జరుగుతున్నా కూడా ఈ నొప్పి తీవ్రమయ్యే వరకు చాలా మంది దీన్ని పట్టించుకోరని ముంబైలోని కిమ్స్ హాస్పిటల్స్‌కు చెందిన వెన్నెముక సర్జన్, కన్సల్టెంట్ డాక్టర్ అమోఘ్ జవార్ చెబుతున్నారు.

ఓ ప్రముఖ మీడియా సంస్థతో మాట్లాడిన డాక్టర్ జవార్, "శరీర ఆరోగ్యంలో వెన్నెముక పాత్ర చాలా పెద్దది. కానీ మనం దానిని అంతగా పట్టించుకోం. ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి తర్వాత, ప్రజలు పెద్దగా కదలకుండా ఉండటం (ఇంట్లోంచే పనిచేయడం లేదా శారీరక శ్రమ తగ్గడం) వల్ల వెన్నెముక సమస్యలు బాగా పెరిగాయి. నడుం, మెడ నొప్పి ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సమస్యలకు ప్రధాన కారణాల్లో ఒకటిగా, రెండో స్థానంలో నిలిచింది" అని వివరించారు.

వెన్నెముక సంరక్షణ అంటే సర్జరీ ఒక్కటే కాదు

వెన్నెముక శస్త్రచికిత్స అనేది పుర్రె కింద భాగం నుంచి వెన్నెముక కింది ప్రాంతం వరకు ఉన్న అన్ని సమస్యలను సరిచేసే ఒక ప్రత్యేకమైన చికిత్సా విధానం అని డాక్టర్ జవార్ చెప్పారు. అయితే, ఆశ్చర్యకరంగా, వెన్నెముక సమస్యలతో బాధపడేవారిలో ఐదు శాతం కంటే తక్కువ మందికి మాత్రమే శస్త్రచికిత్స అవసరం అవుతుందట.

"చాలా వెన్నెముక సమస్యలను ఆపరేషన్ లేకుండానే నయం చేయవచ్చు. ఫిజియోథెరపీ, మందులు, జీవనశైలి మార్పులు, ఇతర చికిత్సలతో వీటిని తగ్గించవచ్చు. గత పదేళ్లలో లూపెక్స్ నావిగేషన్ సిస్టమ్స్, మినిమల్లీ ఇన్వేసివ్ స్పైన్ సర్జరీ (MIS) వంటి ఆధునిక సాంకేతికతలు వచ్చాయి. ఈ కొత్త పద్ధతుల వల్ల రోగులు ఇప్పుడు ఎక్కువ రోజులు ఆసుపత్రిలో ఉండాల్సిన పనిలేదు, కోలుకోవడానికి కూడా ఎక్కువ సమయం పట్టదు. వెన్నెముక ఆపరేషన్ తర్వాత చాలా రోజులు బెడ్‌రెస్ట్ తీసుకోవాలి, కదలకుండా ఉండాలి అనే పాత ఆలోచనలు మారిపోయాయి" అని ఆయన అన్నారు.

వెన్నెముక సంరక్షణ అంటే కేవలం ఆపరేషన్ మాత్రమే కాదని, అందులో రోగి మానసిక ఆరోగ్యం, పోషకాహారం, జీవనశైలి వంటి అంశాలపై కూడా సరైన అవగాహన ఉండాలని డాక్టర్ జవార్ చెప్పారు. "అమెరికా, బ్రిటన్‌లలో జరిగిన పరిశోధనల ప్రకారం, డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక సమస్యలు వెన్నెముక లక్షణాలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. MRI స్కాన్‌లు శరీర భాగాల గురించి చాలా సమాచారం ఇస్తాయి నిజమే, కానీ అవి మాత్రమే రోగ నిర్ధారణకు సరిపోవు. మానసిక, జీవనశైలి అంశాలను కూడా సమగ్రంగా పరిశీలించాలి" అని ఆయన స్పష్టం చేశారు.

నిశ్చల జీవనశైలి కూడా వెన్ను నొప్పికి కారణమవుతోందంట
నిశ్చల జీవనశైలి కూడా వెన్ను నొప్పికి కారణమవుతోందంట (Freepik)

చాలా మంది చికిత్సను ఎందుకు ఆలస్యం చేస్తారు?

డాక్టర్ జవార్ అభిప్రాయం ప్రకారం, వెన్నెముక సమస్యల చికిత్సలో పెద్ద లోపం ఏమిటంటే సరైన అవగాహన లేకపోవడం. "చాలా మంది రోగులు దీనిపై సరైన జ్ఞానం లేకపోవడం వల్ల చికిత్సను ఆలస్యం చేస్తారు. సమస్య తీవ్రమై, నయం చేయలేని స్థితికి చేరుకున్నప్పుడు మాత్రమే వైద్య సహాయం కోరుతారు. మన భారతదేశంలో నడుం నొప్పిని తేలిగ్గా తీసుకోవడం, దాని తీవ్రతను తగ్గించి చూడటం చాలా సాధారణం. కదలడం కూడా కష్టమయ్యే వరకు లేదా అంతకంటే దారుణమైన పరిస్థితి వచ్చే వరకు కూడా చాలా మంది దీన్ని పట్టించుకోరు. ప్రతిరోజూ 30-45 నిమిషాలు నడవాలని గుర్తుంచుకోవాలి. నిర్లక్ష్యం చేయడమే అవగాహన లోపానికి, చికిత్స ఆలస్యం కావడానికి కారణం" అని ఆయన అన్నారు.

ఎవరికి ఎక్కువ ప్రమాదం?

"టీనేజర్లు, ముఖ్యంగా క్రీడల్లో చురుగ్గా పాల్గొనేవారు, బరువులు ఎత్తేటప్పుడు లేదా వ్యాయామం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. 18 ఏళ్లు వచ్చే వరకు ఇది వారి వెన్నెముక పెరుగుదలను అడ్డుకోవచ్చు. మరోవైపు, కూర్చుని పనిచేసేవారు కొన్ని చిన్నపాటి మార్పులు చేసుకుంటే వెన్నెముక సమస్యలను నివారించవచ్చు. ఉదాహరణకు, వెన్నెముకకు, చేతులకు సపోర్ట్ ఇచ్చే కుర్చీని వాడటం, ఎక్కువ సేపు ఒకే పొజిషన్‌లో కూర్చోకుండా ఉండటం, కూర్చున్నప్పుడు పొజిషన్ మార్చుకోవడం, ల్యాప్‌టాప్‌కు బదులుగా డెస్క్‌టాప్‌ను ఉపయోగించడం వంటివి" అని డాక్టర్ జవార్ వివరించారు.

శరీరంలో విటమిన్ D3, B12 లోపాలు చాలా సాధారణమని, ఇవి ఎముకలను, కండరాలను బలహీనపరిచి, వెన్నెముక సమస్యలకు గురిచేస్తాయని డాక్టర్ జవార్ తెలిపారు. "సరైన పోషకాహారంతో పాటు విటమిన్ సప్లిమెంట్లు తీసుకోవడం మంచిదే అయినా, వెన్నెముక ఆరోగ్యం కోసం ఎముకలు, కండరాల బలానికి దోహదపడే ఇతర అంశాలను కూడా పరిష్కరించడం చాలా ముఖ్యం" అని ఆయన చెప్పారు.

"వెన్నెముక సంరక్షణ అనేది నిరంతరం, జీవితాంతం కొనసాగించాల్సిన ఒక అంశం" అని ఆయన వివరించారు. "వెన్నెముకకు ఏదైనా గాయం అయిన తర్వాత, రోజువారీ పనులు స్వతంత్రంగా చేసుకోగలిగేలా, తిరిగి మామూలు స్థితికి వచ్చేలా పునరావాసంపై దృష్టి పెట్టాలి. దీని కోసం పరిసరాలను మార్చుకోవడం, వైకల్యం ఉన్నవారు కూడా క్రీడల్లో, ఇతర శారీరక కార్యకలాపాల్లో పాల్గొనేలా ప్రోత్సహించడం చాలా అవసరం" అని ఆయన చెప్పారు.

సరైన అవగాహన, సకాలంలో చికిత్స చాలా వెన్నెముక సమస్యలను శస్త్రచికిత్స లేకుండానే నయం చేయవచ్చునని డాక్టర్ జవార్ చెప్పారు. "సమాజంగా మనం వెన్నెముక ఆరోగ్యాన్ని ఇప్పుడు సీరియస్‌గా తీసుకోవాలి. నడుం నొప్పి అనేది మన జీవితంలో ఒక అనివార్య భాగం కాకూడదు" అని డాక్టర్ జవార్ బలంగా చెప్పారు.

(పాఠకులకు ముఖ్య గమనిక: ఈ కథనం కేవలం సమాచారం కోసమే. ఇది నిపుణులైన వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. మీకు ఏదైనా ఆరోగ్య సమస్య గురించి సందేహాలు ఉంటే, దయచేసి మీ డాక్టర్‌ను సంప్రదించండి.)

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.