Spinach omelette: పాలకూర ఆమ్లెట్ ఇలా చేసుకొని తిన్నారంటే ఎంత హెల్తీనో అంత టేస్టీ
Spinach omelette: గుడ్డుతో చేసిన వంటకాలు ఏవైనా రుచిగా ఉంటాయి. ఇక్కడ మేము పాలకూర ఆమ్లెట్ రెసిపీ ఇచ్చాము. సాధారణ ఆమ్లెట్ కన్నా ఇది ఎంతో ఆరోగ్యం.
కోడిగుడ్డు, పాలకూర రెండు ఆరోగ్యానికి మేలు చేసే ఈ రెండు కలిపి ఆమ్లెట్ చేసి చూడండి.దీని ద్వారా శరీరానికి కావలసిన పోషకాలు ఎన్నో అందుతాయి. పాలకూర ఆమ్లెట్ తినడం వల్ల పోషకాహార లోపం రాకుండా ఉంటుంది. చలికాలంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే బరువు కూడా పెరగకుండా ఉంటారు. పాలకూర ఆమ్లెట్ చేయడం చాలా సింపుల్ రెసిపీ ఇక్కడ ఇచ్చాము. ఫాలో అయిపోండి.
పాలకూర ఆమ్లెట్ రెసిపీకి కావలసిన పదార్థాలు
పాలకూర - ఒక కట్ట
కోడిగుడ్లు - రెండు
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - ఒక స్పూను
ఉల్లిపాయ తరుగు - రెండు స్పూన్లు
పచ్చిమిర్చి తరుగు - ఒక స్పూను
మిరియాల పొడి - చిటికెడు
జీలకర్ర పొడి - చిటికెడు
గరం మసాలా - చిటికెడు
ధనియాల పొడి - చిటికెడు
పాలకూర ఆమ్లెట్ రెసిపీ
1. పాలకూర ఆమ్లెట్ చేయడానికి ముందుగా పాలకూరను సన్నగా తరిగి నీటిలో వేసి శుభ్రంగా కడుక్కోవాలి.
2. ఇప్పుడు ఈ స్టవ్ మీద కళాయి పెట్టి అర స్పూను నూనె వేయాలి.
3. అందులో పాలకూర వేసి పచ్చివాసన పోయేదాకా ఉడికించుకోవాలి.
4. ఇది బాగా వేగాక మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
5. ఇప్పుడు ఒక గిన్నెలో రెండు కోడిగుడ్లను వేసి పగలగొట్టాలి.
6. ఆ మిశ్రమంలోనే పాలకూర ఫ్యూరీని కూడా వేసి బాగా గిలకొట్టాలి.
7. తర్వాత ఉల్లిపాయల తరుగు, పచ్చిమిర్చి తరుగు, రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర పొడి, గరం మసాలా, ధనియాల పొడి, మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి.
8. స్టవ్ మీద పెనం పెట్టి అర స్పూను నూనె వేయాలి.
9. ఆ నూనెలో ఈ మిశ్రమాన్ని ఆమ్లెట్ లాగా వేసుకోవాలి.
10. రెండు వైపులా కాల్చుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది.
11. పాలకూరలోనూ కోడిగుడ్డులో కూడా ఉండే పోషకాలు మన శరీరానికి అందుతాయి. రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి సాయంత్రం పూట స్నాక్ గా లేకపోతే ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ గా దీన్ని తినవచ్చు.
పాలకూరలో ఉండే పోషకాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రతి ఒక్కరికీ అవసరమైన ఫోలేట్ ఇందులో ఉంటుంది. బాలింతలకు, చిన్న పిల్లలకు, వృద్ధులకు, చదువుకునే పిల్లలకు ఫోలేట్ చాలా అవసరం. అలాగే కోడి గుడ్డును సంపూర్ణ ఆహారంగా చెప్పుకుంటారు మన శరీరానికి కావలసిన అన్ని పోషకాలు ఒక కోడి గుడ్డులో ఉంటాయని అంటారు. అలాగే తొమ్మిది అమైనో ఆమ్లాలను కోడి గుడ్డు కలిగి ఉంటుంది. ఇలా మన శరీరానికి అత్యవసరమైన తొమ్మిది అమైనో ఆమ్లాలను కలిగి ఉన్న ఒకే ఒక్క ఆహారం కోడిగుడ్డే. కాబట్టి ప్రతిరోజు ఒక కోడిగుడ్డును తినమని వైద్యులు కూడా సూచిస్తూ ఉంటారు. ఈ పోషకాల ఆమ్లెట్ ను తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.