Palakura: పాలకూర ఆరోగ్యానికి ఎంతో మంచిది, కానీ ఈ సమస్యలు ఉన్నవారు మాత్రం తినకూడదు
Palakura: పాలకూర పోషకాల గని. దీన్ని తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే వైద్యులు కూడా పాలకూర తినమని సలహా ఇస్తారు. అయితే కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం పాలకూర తినకూడదు. ఎవరు పాలకూర తినకూడదో తెలుసుకోండి.
ఆకుకూరల్లో ఆరోగ్యానికి అవసరమైన అన్ని రకాల పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా పాలకూర ప్రతి ఒక్కరూ తినమని చెబుతూ ఉంటారు. పాలకూరను తినేవారి సంఖ్య కూడా ఎక్కువే. సాధారణంగా చలికాలంలో పాలకూర అధికంగా పండుతుంది. అందుకే ఆ కాలంలో పాలకూరను ఎక్కువగా తింటూ ఉంటారు.
పాలకూర వంటకాలు నోటికి రుచిగా, ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పాలకూరలో ఉండే ఐరన్, క్యాల్షియం, పొటాషియం వంటి పోషకాలు మనకు తెలియకుండానే ఆరోగ్యానికి ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తాయి. పాలకూర ఆరోగ్యానికి మేలు చేసినప్పటికీ, కొన్ని ఆరోగ్య సమస్యలున్నవారు మాత్రం దాన్ని తినకూడదు. ఏ ఆరోగ్య సమస్యలు ఉన్న వారు పాలకూర తినకూడదో తెలుసుకోండి.
కిడ్నీల్లో రాళ్లు
మూత్రపిండాల్లో రాళ్ల సమస్య ఉన్నవారు, ఫుడ్ అలర్జీలు, జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు పాలకూరను తినకూడదు. ఇది వారి ఆరోగ్య పరిస్థితిని దిగజారుస్తుంది. కాబట్టి కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్న వారు పాలకూరకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది.
యూరిక్ యాసిడ్ సమస్య
పాలకూరలో ఉండే ప్యూరిన్ శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిని పెంచుతుంది. శరీరంలో యూరిక్ యాసిడ్ పరిమాణం ఎక్కువగా ఉంటే కీళ్ల నొప్పుల సమస్య పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికే యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు లేదా కీళ్ల నొప్పులతో బాధపడేవారు పాలకూర తినకూడదు.
రక్తం పలుచబడే మందులు
మీరు ఇప్పటికే ఆస్పిరిన్ వంటి రక్తం సన్నబడటానికి మందులు తీసుకుంటుంటే పొరపాటున కూడా పాలకూరను తీసుకోకండి. పాలకూరలో ఉండే విటమిన్ కె రక్తం పలుచన చేసే మందులతో కలిసి ప్రతిస్పందిస్తుంది.ఇది ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుంది. కాబట్టి ఇలాంటి మందులు వాడే వారు ఎట్టిపరిస్థితుల్లో పాలకూరను తినకూడదు.
కిడ్నీ స్టోన్ సమస్యతో బాధపడేవారు కూడా పాలకూర తినకూడదు. పాలకూరలో ఆక్సాలిక్ యాసిడ్ అధికంగా ఉండటం వల్ల కిడ్నీ స్టోన్ పేషెంట్ల సమస్యలు పెరుగుతాయి.
కాల్షియం శోషణకు అంతరాయం
పాలకూర, కాలే వంటి ఆకుపచ్చ కూరగాయలలో కాల్షియం ఉంటుంది, కానీ వాటిలో ఉండే ఆక్సలేట్లు కాల్షియాన్ని బంధిస్తాయి. శరీరంలో కాల్షియం శోషణను నిరోధిస్తాయి. కాబట్టి కాల్షియం లోపం ఉన్నవారు పాలకూర, కాలే వంటి ఆకుకూరలు తినకూడదు.
అలెర్జీలు ఉన్నా..
కొంతమందికి పాలకూర తినడం వల్ల అలెర్జీ ఉండవచ్చు. ఉడికించిన లేదా పచ్చి పాలకూర ఆకులను తినడం వల్ల అలెర్జీలు వస్తాయి. కొన్నిసార్లు పాలకూర వల్ల అలెర్జీలు, నోటి అలెర్జీ సిండ్రోమ్ వంటివి వస్తాయి.
పాల కూర తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నప్పటికీ, పైన చెప్పిన ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పాలకూర తీసుకోవడం తగ్గించడం మంచిది. దీని వల్ల మీ సమస్యలు ఇంకా పెరుగుతాయి.
ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేనివారు మాత్రం పాలకూర తినడం చాలా అవసరం. దీనిలో ఉండే పోషకాలు శరీరానికి ముఖ్యం. కాబట్టి వారానికి రెండు నుంచి మూడుసార్లు పాలకూరను ఆహారంలో భాగం చేసుకోవాల్సిన అవసరం ఉంది.