Guava recipes: స్పైసీగా జామ కాయ చాట్ ఇలా చేసుకుంటే రుచి అదిరిపోతుంది
Guava recipes: జామకాయలు చలికాలంలోనే అధికంగా లభిస్తాయి. లోపల గులాబీరంగులో ఉండే జామకాయలు చాలా టేస్టీగా ఉంటాయి. వాటిని ఒకసారి జామకాయ చాట్ చేసుకుని చూడండి. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది.
చలికాలంలో స్పైసీగా ఏదైనా తింటే చాలా రుచిగా ఉంటుంది. శీతాకాలంలో రోజులో కొంతకాలంపాటే ఎండ వస్తుంది. ఆ ఎండలో కూర్చుని జామకాయ చాట్ రెసిపీ తిన్నారంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ చాట్ రిసిపి తయారు చేయడం చాలా సులభం. ఇది తినడానికి చాలా రుచికరమైనది మాత్రమే కాదు ఆరోగ్యకరమైనది కూడా. ఈ రెసిపీని తయారు చేయడానికి, తాజా జామకాయను కట్ చేసి, దాని ముక్కలకు మసాలా పట్టించి తింటే టేస్టీగా ఉంటుంది. స్పైసీ జామ చాట్ రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
జామ చాట్ రెసిపీకి కావలసిన పదార్థాలు
జామకాయ - 2
బ్లాక్ సాల్ట్ - అర స్పూను
జీలకర్ర పొడి - ఒక స్పూను
కొత్తిమీర తరుగు - ఒక స్పూను
చాట్ మసాలా - అర స్పూను
పచ్చి మిర్చి తరుగు - అర స్పూను
నిమ్మరసం - ఒక స్పూను
జామ కాయ చాట్ రెసిపీ
- తాజా జామకాయలను ఈ జామకాయ చాట్ రెసిపీ చేయడానికి ఎంపిక చేసుకోండి.
- ముందుగా జామకాయను బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- ఆ తర్వాత ఒక పాత్రలో తరిగిన జామకాయను వేసి అందులో బ్లాక్ సాల్ట్, వేయించిన జీలకర్ర పొడి, కారం, చాట్ మసాలా, తరిగిన పచ్చిమిర్చి వేసి కలపాలి.
- జామకాయలో మసాలా దినుసులన్నీ బాగా కలిపిన తర్వాత అందులో నిమ్మరసం పిండాలి.
- ఇప్పుడు ఈ చాట్ పైన తాజాగా తరిగిన కొత్తిమీర తరుగు చల్లాలి.
- అంతే స్పైసీ జామ చాట్ రెడీ. జామకాయ చాట్ తయారు చేసిన వెంటనే సర్వ్ చేయాలి. ఆలస్యమైతే జామకాయ నుంచి నీరు విడుదలవుతుంది. ఈ చాట్ ను వెంటనే తింటే రుచిగా ఉంటుంది.
జామకాయ ఉపయోగాలు
జాయ కాయ ఆరోగ్యానికి అన్నిరకాలుగా మేలు చేస్తుంది. దీనిలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఈ పండులో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఇది మధుమేహాన్ని నివారించడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ షుగర్ లెవల్స్ అకస్మాత్తుగా పెరగకుండా నివారిస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ శరీరంలో చక్కెర స్థాయిలు పెరగకుండా అడ్డుకుంటాయి.
జీవక్రియను పెంచడం ద్వారా జామపండు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. జామపండు తిన్న తరువాత, పొట్ట నిండినట్లు అనిపిస్తుంది. ఇది వ్యక్తి ఎక్కువ కేలరీలు తీసుకోకుండా నిరోధిస్తుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. జామపండులో ఉండే మెగ్నీషియం కండరాలను బలోపేతం చేయడం ద్వారా కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. జామకాయలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను కాపాడుతుంది. ఇది మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
టాపిక్