నోరు చప్పగా అనిపించినప్పుడు ఇలా వెల్లుల్లి పచ్చడిని స్పైసీగా చేసుకుని తినండి, అన్నంలో తింటే అదిరిపోతుంది
నోరు చప్పగా అనిపించినప్పుడు, వాతావరణం చల్లగా అనిపించినప్పుడు ఏదైనా స్పైసీగా తినాలనిపిస్తుంది. అప్పటికప్పుడు చేసుకునే వెల్లుల్లి పచ్చడి ఇచ్చాము. దీన్ని అన్నంలో కలుపుకుని అదిరిపోతుంది.
ఆరోగ్యం బాగోలేనప్పుడు నోరు చప్పగా అనిపిస్తుంది. అలాగే వాతావరణం చల్లగా ఉన్నా కూడా ఏదైనా స్పైసీగా తినాలనిపిస్తుంది. అలాంటి వారికి ఆరోగ్యకరమైన వెల్లుల్లి పచ్చడి ఇచ్చాము. దీన్ని అప్పటికప్పుడే ఐదు నిమిషాల్లో చేసేసుకోవచ్చు. పైగా ఇది ఎంతో రుచిగా ఉంటుంది. అన్నంలో కలుపుకుని తింటే అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి దీన్ని ట్రై చేసి చూడండి. మీకు కచ్చితంగా నచ్చుతుంది. దీన్ని వండడానికి పెద్దగా కష్టపడక్కర్లేదు. ఇక రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
వెల్లుల్లి పచ్చడి రెసిపీకి కావలసిన పదార్థాలు
వెల్లుల్లి రెబ్బలు - 10
ఎండుమిర్చి - ఆరు
ఉల్లిపాయ - ఒకటి
ఉప్పు - రుచి సరిపడా
కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు
పసుపు - పావు స్పూను
వెల్లుల్లి పచ్చడి రెసిపీ
1. వెల్లుల్లి పచ్చడి తయారు చేసేందుకు స్టవ్ మీద కళాయి పెట్టి ఒక స్పూను నూనె వేయాలి.
2. ఆ నూనెలో ఎండుమిర్చిని వేసి నలుపుగా అయ్యేవరకు వేయించుకోవాలి. వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి.
3. ఆ తర్వాత మిగిలిన నూనెలో వెల్లుల్లిని వేసి అవి రంగు మారేవరకు బాగా వేయించాలి. తర్వాత వాటిని తీసి కూడా పక్కన పెట్టుకోవాలి.
4. ఇంకా మిగిలిన నూనెలో ఉల్లిపాయల తరుగును వేసి రంగు మారే వరకు బాగా వేయించుకోవాలి.
5. ఆ ఉల్లిపాయల్లోనే రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా వేయించాలి. వాటిని ఒక ప్లేట్లో వేసుకోవాలి.
6. ఇప్పుడు ఎండుమిర్చిని చేత్తోనే బాగా నలుపుకొని పొడిలా చేసుకోవాలి.
7. అందులోనే వెల్లుల్లి రెబ్బలను వేసి చేత్తోనే మెత్తగా నొక్కుకోవాలి.
8. ఆ మిశ్రమంలోనే వేయించిన ఉల్లిపాయలను కూడా వేసి చేతితోనే బాగా కలపాలి.
9. పైన కొత్తిమీర తరుగును వేసి చేతితోనే కలుపుకోవాలి. ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఈ పచ్చడిని వేసుకుని కలుపుకొని చూడండి.
10. రుచి అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి చేసుకున్నారంటే మీకు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది.
వెల్లుల్లిలో మన ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు ఎన్నో ఉంటాయి. ప్రతిరోజు వెల్లుల్లి రెబ్బలు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా జ్వరం, జలుబు, దగ్గు వంటి వాటి వారిన తరచూ పడుతున్న వారు ఇక్కడ మేము చెబుతున్న విధంగా వెల్లుల్లి పచ్చడి చేసుకుని చూడండి. మీకు మంచి ఫలితం కనిపిస్తుంది. ఇక్కడ మేము చెప్పిన ఇన్స్‌టెంట్ వెల్లుల్లి పచ్చడి చేయడానికి ఐదు నిమిషాల సమయం సరిపోతుంది. కాబట్టి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని తయారు చేసుకోవచ్చు. వేడివేడి అన్నంలోనే ఈ పచ్చడిని కలుపుకొని తింటేనే అద్భుతంగా ఉంటుంది. చల్లని అన్నంలో కలుపుకుంటే అంత రుచిగా ఉండకపోవచ్చు. అలాగే ఎండుమిర్చి వెల్లుల్లి బాగా వేగాలి. అప్పుడే దీని రుచి బాగుంటుంది. వెల్లుల్లి లేదా ఎండుమిర్చి సరిగా వేగకపోతే పచ్చిగా అనిపిస్తుంది.