Egg Semiya: స్పైసీ ఎగ్ సేమియాను ఇలా చేయండి, ప్రోటీన్ నిండిన ఈ వంటకం ఆరోగ్యానికి ఎంతో మంచిది
Egg Semiya: ప్రోటీన్ నిండిన వంటకాలను తినాలనుకుంటే ఒకసారి ఎగ్ సేమియా ట్రై చేయండి. దీన్ని బ్రేక్ ఫాస్ట్ లోనే కాదు, రాత్రి డిన్నర్ లో కూడా తినవచ్చు.
సేమ్యాతో రకరకాల వంటకాలు వండుకోవచ్చు. దీంతోని కేవలం స్వీట్ మాత్రమే కాదు, ఆకలి వేసినప్పుడు అప్పటికప్పుడు చేసుకునే కొన్ని రెసిపీలను ప్రయత్నించవచ్చు. మీకు మరీ ఆకలిగా అనిపిస్తే ఒకసారి స్పైసీగా ఎగ్ సేమియా రెసిపీ ప్రయత్నించండి. దీన్ని బ్రేక్ ఫాస్ట్ లో తిన్నా రుచిగా ఉంటుంది. లేదా సాయంత్రం పూట తింటే రాత్రికి ఆకలి కూడా వేయదు. దీన్ని చేయడం కూడా చాలా సులువు. స్పైసీ ఎగ్ సేమియా రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
ఎగ్ సేమియా రెసిపీకి కావలసిన పదార్థాలు
సేమ్యా - ఒక కప్పు
గుడ్లు - మూడు
మిరియాల పొడి - పావు స్పూను
కారం - పావు స్పూను
ఉల్లిపాయ - ఒకటి
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను
నూనె - సరిపడినంత
ఉప్పు - రుచికి సరిపడా
నిమ్మరసం - రెండు స్పూన్లు
కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు
క్యాప్సికం తరుగు - రెండు స్పూన్లు
బీన్స్ తరుగు - రెండు స్పూన్లు
పచ్చిమిర్చి తరుగు - ఒక స్పూను
క్యారెట్ తరుగు - రెండు స్పూన్లు
ఎగ్ సేమియా రెసిపీ
1. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. ఆ నూనెలో సేమియాను వేసి వేయించాలి.
2. అది కాస్త కలర్ మారినప్పుడు రెండు మూడు కప్పుల నీటిని వేయాలి. అందులోనే సేమ్యాను బాగా కలపాలి.
3. ఆ తర్వాత సేమియాను వడకట్టి తీసి ప్లేట్లో పొడిపొడిగా వచ్చేలా ఆరబెట్టుకోవాలి.
4. ఇప్పుడు వేరే కళాయి స్టమ్ మీద పెట్టి మూడు స్పూన్ల నూనె వేయాలి.
5. అందులో కోడిగుడ్లను కొట్టి వేయించాలి. అది పెద్ద పెద్ద ముక్కలుగా వేయించుకోవాలి.
6. అందులోనే కారం, మిరియాల పొడి కూడా వేసి కలుపుకోవాలి.
7. ఈ మిశ్రమాన్ని కూడా తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి.
8. ఇప్పుడు అదే కళాయిలో నూనె వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ను వేసి వేయించాలి.
9. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి తరుగు, క్యారెట్ తరుగు, క్యాప్సికం తరుగు, బీన్స్ తరుగు వేసి బాగా కలుపుకోవాలి.
10. ముందుగా ఆరబెట్టుకున్న సేమియాను కూడా వేసి దీంట్లో కలుపుకోవాలి.
11. రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. అలాగే మిరియాల పొడి, కారంపొడి మళ్లీ కలుపుకోవాలి.
12. ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్ ముక్కలను పైన వేసి కలపాలి.
13. కొత్తిమీర తరుగును, నిమ్మ రసాన్ని చల్లుకోవాలి. అంతే టేస్టీ ఎగ్ సేమియా రెడీ అయినట్టే. దీని రుచి అదిరిపోతుంది. వేడివేడిగా తింటే ఎంత తిన్నా ఇంకా తినాలని అనిపిస్తూనే ఉంటుంది.
ఎగ్ సేమియా చేయడం చాలా సులువు. నూడుల్స్ ని ఎలా చేస్తారో వీటిని కూడా అలా చేస్తే సరిపోతుంది. ఎగ్ నూడుల్స్ బదులుగా ఎగ్ సేమియా చేసుకొని తినండి. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. నూడిల్స్ ని ఎక్కువగా మైదాతో చేసే అవకాశం ఉంది. మైదా ఉన్న ఆహారం తినడం మంచిది కాదు. దీన్ని పిల్లలకు లంచ్ బాక్స్ రెసిపీగా కూడా పెట్టవచ్చు. ఇది వారికి కచ్చితంగా నచ్చుతుంది.
టాపిక్