First night halwa: ఫస్ట్ నైట్ హల్వా గురించి విన్నారా? ఈ సీక్రెట్ స్వీట్ లేకపోతే శోభనమే జరగదక్కడ..
First night halwa: శోభనానికి ఈ ప్రాంతాల్లో దంపతులుంటే సరిపోదు. మాడుగుల హల్వా కూడా ఉండాల్సిందే. ఈ ప్రత్యేక హల్వా గురించి పూర్తి వివరాలు తెల్సుకోండి.
విశాఖపట్నం నుంచి 70 కి.మీ దాకా దూరంలో ఉంటుంది మాడుగుల అనే గ్రామం. ఇక్కడ చేసే స్పెషల్ హల్వా చాలా ప్రసిద్ధి. ఈ చుట్టు పక్కల గ్రామాల్లో ఎక్కడ శోభనం రాత్రి జరిగినా ముందు మాడుగుల హల్వా పార్శిల్ కట్టించి తీసుకెళ్తారు. ఈ ఊరుపేరు మీదే మాడుగుల హల్వా అని పిలిచే ఈ స్వీట్ రుచి ఒక్కసారి తిన్నారంటే మరే హల్వా రుచి నచ్చదు. ఇక్కడ పెళ్లి వేడుకలున్నాయంటే అందులో మాడుగుల హల్వా ఉండాల్సిందే. ముఖ్యంగా మొదటి రాత్రికి పెట్టే స్వీట్లలో మాడుగుల హల్వా ఉంచడం తప్పనిసరి. ఈ స్వీట్ చిన్న పిల్లలకూ పెద్దలకూ నచ్చేస్తుంది. దీని ఆరోగ్య ప్రయోజనాలు కూడా బోలెడు. అన్ని సహజ పదార్థాలు వాడి తయారు చేసే ఈ తీపి వంటకం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
ఆరోగ్య గుణాలే కారణం:
ఈ హల్వా తయారీకి ఆవు నెయ్యి, ఆరోగ్యాన్నిచ్చే అనేక రకాల డ్రై ఫ్రూట్స్, నాటు రకం తేనె వాడి, గోధుమ పాలతో తయారు చేస్తారు. ఈ హల్వాకు ఉన్న ఆరోగ్య గుణాల వల్ల మాడుగుల చుట్టు పక్క ప్రాంతాల్లో శోభనం రాత్రి రోజు ఈ స్వీట్ తినడం ఆనవాయితీగా మారింది. ఈ హల్వా తింటే ఆరోగ్యంతో పాటూ బలం.
హల్వా ఎలా తయారు చేస్తారు?
మామూలుగా హల్వా తయారీకి మైదా వాడతారు. లేదా రవ్వ లాంటి పదార్థాలూ ఉపయోగిస్తారు. కానీ ఈ హల్వా అందుకు పూర్తిగా భిన్నం. అన్నీ సహజ సిద్ధ, ఆరోగ్యకరమైన పదార్థాలే దీంట్లో ఉంటాయి.
1. ఈ స్వీట్ తయారు చేయడానికి అయిదు రోజుల దాకా సమయం పడుతుంది. తయారు చేసిన హల్వా కనీసం నెలపాటైనా పాడవ్వకుండా నిల్వ ఉంటుంది.
2. దీనికోసం ముందుగా గోధుమలను 3 రోజుల పాటూ నీళ్లలో నానబెడతారు. దాంతో నీళ్లు పీల్చుకుని మెత్తగా తయారవుతాయి.
3. ఈ గోధుమలను మెత్తగా రుబ్బి, వడకట్టి అందులో నుంచి గోధుమ పాలు బయటకు తీస్తారు. నీళ్లలో నానడం వల్ల గోధుమలను పిండి చేయడం సులువవుతుంది.
4. ఇలా తీసిని గోధుమ పాలను పంచదార పాకంలో ఉడికిస్తారు. అందులోనే జీడిపప్పు, పిస్తాలు, బాదాం, అరకు తేనె కలుపుతారు.
5. బాగా ఉడికిన మిశ్రమంలో చాలా ఎక్కువ పరిమాణంలో స్వచ్ఛమైన ఆవు నెయ్యి కలుపుతారు. ఎలాంటి మెషీన్లు వాడకుండా చేత్తోనే దీన్ని తయారు చేస్తారు. అలాగే స్వచ్ఛమైన మాడుగుల హల్వా కోసం కట్టెల పొయ్యి మాత్రమే వాడతారు. దాంతో హల్వాకు ప్రత్యేక రుచి వస్తుంది.
ఇప్పటి రుచి కాదిది:
1890ల్లో దంగేటి ధర్మా రావు అనే వ్యక్తి ఈ హల్వాను తయారు చేశారు. ఆయన చేసిన రెసిపీ నూతన పెళ్లి దంపతులు తినే వంటకంగా మారుతుందని ఆయన అనుకుని ఉండరు. మొట్ట మొదలే ఇప్పుడు వాడుతున్న పదార్థాలతో తయారీ చేయలేదు. ముందు పాలు, గుమ్మడికాయ గుజ్జు వాడి దీన్ని తయారు చేశారు. క్రమంగా రకరకాల మార్పులు చేసి ఇప్పుడున్న హల్వా తయారు చేశారు. దాదాపు శతాబ్దం తర్వాత కూడా ఈ హల్వాకున్న ప్రాముఖ్యత తగ్గలేదు. దుంగేటి ధర్మారావు మాడుగుల హల్వా పేరుతోనే దీన్ని ఇప్పటికీ ఆయన వారసులు అమ్ముతున్నారు. కానీ, మాడుగుల హల్వా ఇప్పుడు అనేక షాపుల్లో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా పంచదార లేకుండా ఈ హల్వా తయారు చేయడానికీ ప్రయత్నిస్తున్నారు.
టాపిక్