Soya matar Curry: సోయా బఠాని కర్రీ వండారంటే మటన్ కీమా కర్రీ కన్నా రుచిగా ఉంటుంది, ఇలా వండేయండి
Soya matar Curry: సోయా బఠానీ కర్రీ వండారంటే టేస్టీగా ఉంటుంది. ఇది మటన్ కీమా కర్రీని గుర్తు చేస్తుంది. దీన్ని వండడం చాలా సులువు.

Soya matar Curry: సోయాబీన్స్ తో చేసిన సోయా గ్రాన్యూల్స్ మార్కెట్లో దొరుకుతున్నాయి. వాటిని తెచ్చుకుంటే మటన్ కీమా కర్రీని వండుకోవచ్చు. ఇది రుచిగా కూడా ఉంటుంది. పచ్చి బఠానీలు దొరకకపోతే ఎండు బఠానీలను తీసుకొచ్చి రాత్రంతా నానబెట్టి ఈ గ్రాన్యూల్స్ తో కలిపి సోయా మటర్ కర్రీ వండవచ్చు. దీని రుచి మామూలుగా ఉండదు.
సోయా బఠానీ కర్రీ రెసిపీకి కావలసిన పదార్థాలు
సోయా గ్రాన్యుల్స్ - ఒక కప్పు
బఠానీలు - ఒక కప్పు
ఉల్లిపాయ - ఒకటి
టమోటా - ఒకటి
వెల్లుల్లి తరుగు - ఒక స్పూను
అల్లం తరుగు - ఒక స్పూను
పచ్చిమిర్చి - నాలుగు
కారం - అర స్పూను
కొత్తిమీర - ఒక కట్ట
ధనియాల పొడి - అర స్పూను
గరం మసాలా - ఒక స్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - సరిపడినంత
సోయా బఠాని కర్రీ రెసిపీ
1. సోయా గ్రాన్యుల్స్ ని నీటిలో వేసి నానబెట్టాలి.
2. ఒక గంట పాటు నానబెడితే అవి బాగా నానుతాయి. పచ్చిబఠానీలు దొరికితే వాటిని వాడుకోవచ్చు.
3. పచ్చిబఠానీలు లేకపోతే ఎండు బఠానీలు తెచ్చి రాత్రంతా నీళ్లలో నానబెట్టాలి. ఉదయం కుక్కర్లో వేసి ఒక విజిల్ వచ్చేవరకు ఉడికించి ఆపేయాలి.
4. నీటిని వడకట్టి ఈ బఠానీలను పక్కన పెట్టుకోవాలి.
5. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
6. అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించాలి.
7. అవి బాగా రంగు మారేవరకు వేయించాక తరిగిన వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చిని వేసి వేయించుకోవాలి.
8. అలాగే ఒక టమాటాను మిక్సీలో వేసి ప్యూరీలా చేసి దాన్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి.
9. తర్వాత ధనియాల పొడి రుచికి సరిపడా ఉప్పు, కారం వేసి బాగా ఉడికించుకోవాలి.
10. ఇవన్నీ దగ్గరగా ఇగురులాగా అవుతాయి.
11. అప్పుడు ఉడికించిన బఠానీలను వేసి బాగా కలిపి మూత పెట్టాలి.
12. కనీసం పది నిమిషాలు బఠానీలను ఉడికించాలి.
13. ఆ తర్వాత నానబెట్టుకున్న సోయా గ్రాన్యూల్స్ చేత్తోనే పిండి అందులో వేయాలి. మొత్తం కర్రీని కలుపుకోవాలి.
14. అవసరమైతే కాస్త నీళ్లు వేసుకోవాలి. చిన్న మంట మీద ఉడికిస్తే సోయా మటర్ కర్రీ రెడీ అయిపోతుంది.
15. దించే ముందు పైన కొత్తిమీర తరుగును చల్లుకోవాలి. అంతే టేస్టీ కూర తినడానికి రెడీ అయిపోతుంది.
సోయా గ్రాన్యుల్స్‌లో మన ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఉన్నాయి. వీటిని అప్పుడప్పుడు మన ఆహారంలో భాగం చేసుకోవడం చాలా అవసరం. అలాగే బఠానీలు కూడా మనం తినాల్సిన ఆహారాలలో ఒకటి. ఇందులో మనం వాడిన పదార్థాలన్నీ పోషకాలు కలిగినవే. కాబట్టి ఈ కర్రీని అప్పుడప్పుడు చేసుకుంటే చపాతీతో, రోటితో టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో కూడా బాగుంటుంది.
టాపిక్