Walking Without Footwear : కొంతమంది చెప్పులు లేకుండా నడుస్తారు.. ఎందుకని ఆలోచించారా?
Walking Without Footwear Benefits : తెలుగు వాళ్లలో కూడా కొందరు చెప్పులు లేకుండా నడవటం చూసి ఉంటారు. ఇలా నడిచేందుకు కొన్ని కారణాలు ఉన్నాయి. ఈ పద్ధతి ఆస్ట్రేలియాలో ఎక్కువగా ఉంటుంది.
చెప్పులు లేకుండా నడవటం అనేది ఒక మంచి జీవన విధానం. కానీ మన దగ్గర అసలు చెప్పులు లేకుండా బయటకు రానేరారు. కానీ కొందరు మాత్రం.. అస్సలు చెప్పులు వేసుకోరు. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే చాలా మంది ఆస్ట్రేలియన్లు తమ దేశం సంస్కృతి, ప్రకృతితో బలమైన అనుబంధం ఫలితంగా చెప్పులు లేకుండా నడవడం అలవాటు చేసుకున్నారు.
ప్రపంచవ్యాప్తంగా అనేక మంది వ్యక్తులను ఆకర్షించే ఈ చర్య వెనుక అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మన దగ్గర కూడా కొందరు ఈ పద్ధతిని ఫాలో అవుతూ ఉన్నారు. కొన్ని పుస్తకాల్లోనూ చెప్పులు లేకుండా నడవాలని రాసి ఉంటుంది. ప్రకృతికి దగ్గరగా జీవించినట్టు అవుతుందని, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని దాని అర్థం. కొందరు చెప్పులు లేకుండా నడవడానికి గల కారణాలను చూద్దాం..
చెప్పులు లేకుండా నడవడం వల్ల భూమి శక్తితో కనెక్ట్ అయిన అనుభూతి చెందుతారు. ఆస్ట్రేలియన్లు సహజ ప్రపంచం పట్ల గొప్ప గౌరవాన్ని కలిగి ఉంటారు. చెప్పులు లేకుండా నడవడం వల్ల ప్రకృతితో అనుబంధం ఏర్పడుతుంది. ఇది వారి నమ్మకం.
ఒత్తిడి తగ్గుతుంది
చెప్పులు లేకుండా నడవడం వల్ల పాదాల్లోని నరాల చివర్లు ఉత్తేజితమవుతాయన్నది శాస్త్రీయ సత్యం. ఈ అభ్యాసం స్థిరమైన ఒత్తిడిని తగ్గిస్తుంది. నరాలను మసాజ్ చేయడం ద్వారా ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది మరింత విశ్రాంతి, ఒత్తిడి లేని నడకకు దారితీస్తుంది.
కాళ్లకు మంచిది
చెప్పులు లేకుండా నడవడం వల్ల పాదాలు, చీలమండలు భిన్నంగా పని చేస్తాయి. ఇది శరీరం అంతటా అమరిక, భంగిమను మెరుగుపరుస్తుంది. బూట్లు ధరించడం వలన పాదాలు పూర్తి స్థాయి కదలికను అనుభవించడానికి అనుమతించవు. ఇది ఒక విధంగా భంగిమను మార్చగలదు.
ఇంద్రియాలపై ప్రభావం
తరచుగా చెప్పులు లేకుండా నడవడం ద్వారా ఇంద్రియ, సమతుల్య నైపుణ్యాలను అభివృద్ధి అవుతాయి. ఇవి స్థిరత్వం, సమన్వయానికి ముఖ్యమైనవి. చెప్పులు లేకుండా నడవడం ద్వారా శరీరాన్ని బాగా సమతుల్యం చేసుకోవడం నేర్చుకోవచ్చు. నడుస్తున్నప్పుడు పడిపోయే అవకాశాలను తగ్గించవచ్చు.
కండరాలు బలంగా అవుతాయి
బూట్లు ధరించడం వల్ల మీ పాదాల సహజ చలనం వేరేలా ఉంటుంది. అయితే చెప్పులు లేకుండా ఉండటం వల్ల మీ పాదాల కండరాలు బలంగా మారడానికి, వివిధ ఉపరితలాలకు అనుగుణంగా మారడానికి సహాయపడుతుంది. చెప్పులు లేకుండా నడవడం కండరాలను బలోపేతం చేయడానికి, ఉపరితలాలను బాగా పట్టుకోవడానికి ఉపయోగపడుతుంది.
రక్త ప్రసరణ
చెప్పులు లేకుండా నడవడం పాదాల అరికాళ్ళపై ఒత్తిడిని కలిగిస్తుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. గుండె ఆరోగ్యానికి, మొత్తం ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది. పాదాలను నేలపై క్రమం తప్పకుండా మసాజ్ చేయడం వల్ల పాదాలలో రక్త ప్రసరణ మెరుగవుతుంది.
చెప్పులు లేకుండా నడవడం అనేది సంపూర్ణత, చురుకుదనాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది ప్రకృతికి ఇచ్చే గౌరవంగా కూడా కొంతమంది ఆస్ట్రేలియన్లు ఫీలవుతారు. దీనితో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇలా చెప్పులు లేకుండా నడిస్తే మీ మనసుపై ఉన్న ఒత్తిడి తగ్గిన ఫీలవుతాయి. రక్తప్రసరణ మెరుగ్గా జరుగుతుంది.