Hair on Face: అమ్మాయిల్లో కొందరికి ముఖంపై గడ్డాలు, మీసాలు పెరుగుతాయి, దీనికి ఆ ఆరోగ్య సమస్యలే కారణం-some of the girls grow beards and mustaches on their faces due to these health problems ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Hair On Face: అమ్మాయిల్లో కొందరికి ముఖంపై గడ్డాలు, మీసాలు పెరుగుతాయి, దీనికి ఆ ఆరోగ్య సమస్యలే కారణం

Hair on Face: అమ్మాయిల్లో కొందరికి ముఖంపై గడ్డాలు, మీసాలు పెరుగుతాయి, దీనికి ఆ ఆరోగ్య సమస్యలే కారణం

Haritha Chappa HT Telugu

Hair on Face: కొంతమంది ఆడవాళ్లకు ముఖంపై వెంట్రుకలు అధికంగా పెరుగుతాయి. ముఖ్యంగా గడ్డాలు, మీసాలు పెరుగుతూ ఉంటాయి. ఇలా ఎందుకు పెరుగుతాయో వివరిస్తున్నారు వైద్యులు.

ప్రాచీ నిగమ్

Hair on Face: ప్రాచీ నిగమ్... ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోలింగ్ గురవుతున్న ఒక బాలిక. ఆమె ఉత్తర ప్రదేశ్ పదో తరగతి ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది. ఆమె ఫోటోలు అన్ని పత్రికల్లోనూ పడ్డాయి. సోషల్ మీడియాలో కూడా ట్రెండ్ అయ్యింది. ఆమెకు మీసాలు, గడ్డాలు ఉండడంతో ఆమె సాధించిన విజయాన్ని పక్కనపెట్టి అబ్బాయిలా ఉందంటూ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అమ్మాయిల్లో కొందరికి గడ్డాలు, మీసాలు ఎందుకు పెరుగుతాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎదుటివారికున్న ఆరోగ్య సమస్యలు తెలుసుకోకుండా వారిని ట్రోల్ చేయడం వెక్కిరించడం పద్ధతి కాదు.

గడ్డాలు, మీసాలు అనేవి పూర్తిగా మగవారికే సొంతం. వారి పురుషత్వానికి అవే మొదటి సంకేతాలు. కానీ కొందరి మహిళల్లో కూడా గెడ్డాలు, మీసాలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా టీనేజీ వయసుకు వచ్చాకే వారిలో మీసాలు, గడ్డాలు మొదలవడం ప్రారంభమవుతాయి. వారానికి ఒకసారి కచ్చితంగా షేవింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి. లేదా లేజర్ ట్రీట్మెంట్ తీసుకున్నా ఈ సమస్యకు కొంతవరకు పరిష్కారం లభిస్తుంది. అయితే అమ్మాయిల్లో ఇలా ముఖంపై వెంట్రుకలు ఎందుకు వస్తాయో వివరిస్తున్నారు వైద్యులు.

ఎందుకు జుట్టు పెరుగుతుంది?

ముఖంపై వెంట్రుకలు పెరగడం అనేది జన్యుపరమైన సమస్య కూడా అంతే. పూర్వీకుల్లో ఎవరికైనా ఈ సమస్య ఉంటే అది వారసత్వంగా ఆ వంశంలో ఎవరికైనా రావచ్చు. ఇక రెండోది హార్మోన్ల అసమతుల్యత అనే సమస్య. హార్మోన్లు సమతుల్యంగా లేనప్పుడు ఇలా మహిళల్లో గెడ్డాలు, మీసాలు మొలుస్తాయి. అలాగే పిసిఒడి అంటే పాలీసిస్టిక్ ఓవెరియన్ డిజార్డర్ ఉన్న మహిళలకు ఇలా ముఖంపై వెంట్రుకలు రావచ్చు. కొన్నిసార్లు ఆరోగ్యపరంగా స్టెరాయిడ్లు అధికంగా వాడాల్సి వస్తుంది. అప్పుడు కొందరి మహిళల్లో టెస్టోస్టెరాన్, ఆండ్రోజెన్ హార్మోన్లు విపరీతంగా ఉత్పత్తి అయిపోతాయి. అప్పుడు ఇలా ముఖంపై వెంట్రుకలు వస్తాయి. టెస్టోస్టెరాన్, ఆండ్రోజెన్ అనేవి పురుష హార్మోన్లు. ఇవి ఎప్పుడైతే మహిళల్లో అధికంగా ఉత్పత్తి అవుతాయో అప్పుడు వారి ముఖంలో మీసాలు, గెడ్డాలు పెరుగుతాయి.

అందరి అమ్మాయిల్లో వారసత్వంగా ముఖంపై వెంట్రుకలు వస్తాయి. ఆ పరిస్థితిని జెనెటిక్ హైపర్ ట్రైకోసిస్ అని పిలుస్తారు. ఇక హార్మోన్ల సమతుల్యత లేకపోవడం వల్ల ఇలా గడ్డాలు, మీసాలు తిరిగే సమస్య వస్తే హర్‌సూటిజం అని అంటారు. పిసిఒడి సమస్య ఇప్పుడు ఎక్కువ మంది అమ్మాయిలను ఇబ్బంది పెడుతోంది. మారిపోయిన ఆహారపు అలవాట్లు, స్టెరాయిడ్స్ వాడడం, గంటల పాటు కదలకుండా కూర్చోవడం, వ్యాయామం చేయకపోవడం, తీవ్ర ఒత్తిడికి గురి కావడం... ఇవన్నీ కూడా పిసిఓడి వచ్చేలా చేస్తున్నాయి. పీసీఓడీ వస్తే మగహార్మోన్లు అయిన టెస్టోస్టిరాన్, ఆండ్రోజన్ వంటి హార్మోన్లు మహిళల్లో ఎక్కువగా పెరిగిపోతాయి. అలాంటప్పుడు ఇలా ముఖంపై జుట్టు పెరిగే అవకాశం అధికంగా ఉంది.

ముఖంపై వెంట్రుకలు పెరగకుండా అడ్డుకునే చికిత్స ఇంతవరకు సమర్థవంతంగా లేదు. హోమియోపతి, ఆయుర్వేదం, అల్లోపతి... అన్నింట్లోనూ తాత్కాలిక పరిష్కారమే. కానీ శాశ్వత పరిష్కారం ఇంతవరకు కనిపెట్టలేదు. లేజర్ ట్రీట్మెంట్ ద్వారా కాస్త మంచి ఫలితాలు వస్తున్నాయి.

ముఖంపై హఠాత్తుగా వెంట్రుకలు పెరిగితే దాన్ని తేలికగా తీసుకోకూడదు. అలా ఎందుకు పెరుగుతున్నాయో కారణం తెలుసుకోవాలి. హార్మోన్ల అసమతుల్యత వల్ల పెరుగుతున్నాయా లేక వారసత్వంగా వచ్చిన లక్షణమా గుర్తించాలి. ఎందుకంటే ఒక్కోసారి ముఖంపై హఠాత్తుగా వెంట్రుకలు పెరగడం క్యాన్సర్ లక్షణం అని చెబుతున్నారు వైద్యులు. కాబట్టి హఠాత్తుగా మీకు ముఖంపై వెంట్రుకలు పెరిగితే వెంటనే వైద్యులను సంప్రదించండి.