Good friday 2024: గుడ్ ఫ్రైడే గురించి ఈ ఆసక్తికరమైన విషయాలు మీకు తెలుసా?-some interesting and unknown facts about holy day good friday ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Some Interesting And Unknown Facts About Holy Day Good Friday

Good friday 2024: గుడ్ ఫ్రైడే గురించి ఈ ఆసక్తికరమైన విషయాలు మీకు తెలుసా?

Gunti Soundarya HT Telugu
Mar 28, 2024 01:43 PM IST

Good friday 2024: ప్రపంచ వ్యాప్తంగా గుడ్ ఫ్రైడేని జరుపుకుంటారు. క్రైస్తవులందరూ చర్చికి వెళ్ళి యేసు క్రీస్తు తమ కోసం చేసిన త్యాగం గుర్తు చేసుకుంటూ కన్నీటితో ప్రార్థనలు చేస్తారు. గుడ్ ఫ్రైడే గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం.

గుడ్ ఫ్రైడే గురించి ఆసక్తికర విషయాలు
గుడ్ ఫ్రైడే గురించి ఆసక్తికర విషయాలు (pixabay)

Good friday: యేసుక్రీస్తును శిలువ వేసిన రోజుగా గుడ్ ఫ్రైడే జరుపుకుంటారు. ఆరోజు ఉదయం 10:00 నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు క్రైస్తవులందరూ చర్చికి వెళ్ళి ప్రార్ధన చేస్తారు. ఉపవాసం ఉంటారు. 40 రోజుల పాటు లెంట్ డేస్ గుడ్ ఫ్రైడే తో ముగుస్తాయి. వీటిని శ్రమల దినాలు అని కూడా అంటారు. 

శ్రమల దినాలలో క్రైస్తవులు ఉపవాసం ఉంటూ ప్రతిరోజు యేసుక్రీస్తుని ఆరాధిస్తూ ప్రార్థనలు చేస్తారు. చర్చిలో సాయంకాల ప్రార్ధనలు నిర్వహిస్తారు. ఈ నలభై రోజులు మాంసాహారానికి దూరంగా ఉంటారు. గుడ్ ఫ్రైడే అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణిస్తారు. ప్రార్థనలు చేసుకుంటూ యేసు బోధనలు వింటూ గడుపుతారు.  మానవులను పాపాల నుంచి రక్షించడం కోసం ప్రభువైన యేసుక్రీస్తు ఎంతో శ్రమని పొంది శిలువలో ప్రాణత్యాగం చేసిన రోజు గుడ్ ఫ్రైడే. ఇది క్రైస్తవులకు ఎంతో పవిత్రమైన దినం. యేసు త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీళ్ళు పెట్టుకునే రోజు. అందుకే గుడ్ ఫ్రైడ్ కి శుభాకాంక్షలు చెప్పుకోరు. 

గుడ్ ఫ్రైడే గురించి ఆసక్తికరమైన విషయాలు

రోమన్ క్యాథలిక్ చర్చిలో గుడ్ ఫ్రైడేని ఉపవాస దినంగా పరిగణిస్తారు. ఆరోజు మాంసాహారం తీసుకోరు. బదులుగా చేపలు తింటారు. గుడ్ ఫ్రైడే రోజు సెలవు దినం లేని దేశాల్లో మధ్యాహ్నం మూడు గంటల తర్వాత నుంచి కొన్ని గంటలపాటు పనులు నిలిపివేశారు. ఎందుకంటే మూడు గంటలకు యేసు శిలువలో ప్రాణాలు విడిచిన సమయంగా బైబిల్ చెప్తుంది.  

గుడ్ ఫ్రైడే రోజు క్రైస్తవులందరూ చర్చికి వెళ్లి యేసు ప్రభువును స్మరించుకుంటారు. ఆ రోజు చర్చి ప్రారంభమయ్యే సమయంలో గంట మోగించరు. ఖచ్చితంగా 3 గంటలకు మాత్రం గంట మోగిస్తారు. ప్రభువైన యేసుక్రీస్తుకి ప్రతీకగా భావించే శిలువని ముద్దుపెట్టుకుంటారు. 

గుడ్ ఫ్రైడేని పవిత్రమైన దినంగా భావిస్తారు. యేసు క్రీస్తు తన మరణానంతరం సజీవంగా ఉన్నాడు. మూడో రోజున పునరుత్థానుడిగా సమాధి నుంచి బయటకి వచ్చాడు. నేను ఎప్పటికీ మీతోనే ఉన్నాను మీకు మంచి చేయడమే నా ఉద్దేశం అనే సందేశం ఇచ్చారు. ఇక్కడ మంచి అంటే పవిత్రమైనది. అందుకే గుడ్ ఫ్రైడేని హోలీ ఫ్రైడే, బ్లాక్ ఫ్రైడే, గ్రేట్ ఫ్రైడే అని కూడా పిలుస్తారు. 

బెర్ముడా, బ్రెజిల్, కెనడా, చిలి, కొలంబియా, కోస్టారికా, పెరు, మెక్సికో, వెనిజులా, అరేబియన్ దేశాలు, జర్మనీ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, గ్రేట్ బ్రిటన్ వంటి వివిధ దేశాలు క్రైస్తవ సంప్రదాయాలను అమలు పరుస్తారు. ఈ దేశాల్లో గుడ్ ఫ్రైడేని సెలవు దినంగా ప్రకటిస్తారు.

గుడ్ ఫ్రైడే రోజు సింగపూర్ తో పాటు అనేక దేశాల్లో అన్ని వ్యాపార సముదాయాలు మూసేస్తారు. కొన్ని ప్రకటనలు టెలివిజన్, రేడియో ప్రసారాల నుంచి కూడా తీసేస్తారు.

క్యాథలిక్ దేశమైన ఐర్లాండ్ లో గుడ్ ఫ్రైడే రోజు మద్యం అమ్మకాలు నిషేధం. గుడ్ ఫ్రైడే రోజు పబ్లిక్ డాన్స్ తో సహా థియేటర్లలో ప్రదర్శనలు, నాటకాలు వేయడం చట్ట విరుద్ధంగా పరిగణిస్తారు. 

భారతదేశంలో గుడ్ ఫ్రైడే రోజు సెలవుదినంగా  పాటిస్తారు. స్టాక్ మార్కెట్ కూడా మూసివేస్తారు. క్రైస్తవ జనాభా ఎక్కువగా ఉన్న కేరళ, గోవా వంటి కొన్ని రాష్ట్రాల్లో వ్యాపారాలు కూడా మూసేస్తారు. పొద్దుటి నుంచి సాయంత్రం వరకు చర్చిలో నిర్వహించే ప్రార్థనల్లో పాల్గొంటారు.  

ఆర్థోడాక్స్ క్రైస్తవులు గుడ్ ఫ్రైడే రోజు, మరుసటి రోజు కఠినమైన ఉపవాసం ఉంటారు. అయితే రోమన్ క్యాథలిక్ లు(RCM) మాత్రం గుడ్ ఫ్రైడే రోజు మాత్రమే ఉపవాసం ఉంటారు.

గుడ్ ఫ్రైడే రోజు బెర్ముడాలో గాలిపటాలు ఎగరేస్తారు.  వీటిని టిష్యూ పేపర్ ఉపయోగించి శిలువ ఆకారంలో చేతితో తయారుచేస్తారు. ఆకాశంలో ఎగురుతున్న ఈ గాలిపటాలు స్వర్గానికి వారికి మార్గాన్ని సూచిస్తాయని నమ్ముతారు. 

యూకేలో గుడ్ ఫ్రైడే రోజు గుర్రపు పందేలు నిర్వహించరు. అయితే 2008 లో తొలిసారిగా ఆరోజు క్యాసినోవాలు ఓపెన్ చేశారు. 

ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులందరూ గుడ్ ఫ్రైడేని పవిత్రమైన రోజుగా భావిస్తారు. అందుకే ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకోకుండా ప్రార్థనలు చేస్తూ తమ పాపాల నుంచి రక్షించమని కన్నీటితో వేడుకుంటారు. గుడ్ ఫ్రైడే తర్వాత మూడో రోజు ఈస్టర్ ని జరుపుకుంటారు. ఆరోజు యేసు క్రీస్తు సమాధి నుంచి పునరుత్థానుడిగా తిరిగి వచ్చిన రోజు. 

 

WhatsApp channel