మహిళలు సోలోగా ట్రావెల్ చేయాలనుకుంటే ఇండియాలో కచ్చితంగా వీటిని ట్రై చేయండి!-solo female travelers india must try destinations await ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  మహిళలు సోలోగా ట్రావెల్ చేయాలనుకుంటే ఇండియాలో కచ్చితంగా వీటిని ట్రై చేయండి!

మహిళలు సోలోగా ట్రావెల్ చేయాలనుకుంటే ఇండియాలో కచ్చితంగా వీటిని ట్రై చేయండి!

Ramya Sri Marka HT Telugu

భారతదేశంలో మహిళలు ధైర్యంగా, ప్రశాంతంగా, అద్భుతమైన అనుభూతులను పొందేందుకు అనేక సురక్షితమైన ప్రదేశాలు ఉన్నాయి. సరైన ప్రణాళిక, కరెక్ట్ ఛాయీస్‌లతో మీ సోలో ట్రిప్ అద్భుతమైన జ్ఞాపకంగా మారుతుంది. మరింకెందుకు ఆలస్యం. అవేంటో చూసేయండి.

మహిళలు సోలోగా ట్రావెల్ చేయడం ఒక లక్కే

మహిళలు ఒంటరిగా ప్రయాణించడం అనేది ఒక ట్రెండ్‌గా మారింది. ప్రపంచాన్ని చూడాలనే ఆకాంక్ష, కొత్త అనుభవాలను సొంతం చేసుకోవాలనే తపన చాలామంది మహిళలను సోలో ప్రయాణాలకు ప్రోత్సహిస్తోంది. అయితే, భద్రత విషయంలో కొన్ని ఆందోళనలు ఉండటం సహజం. అటువంటి సమయంలో భారతదేశంలో మహిళలు ఒంటరిగా, నిర్భయంగా ప్రయాణించగలిగే ప్రదేశాలు ఏమున్నాయి? ఎక్కడా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా, అద్భుతమైన అనుభూతులను సొంతం చేసుకోగలిగే ప్రదేశాలు తెలుసుకుందాం.

ప్రకృతి అందాలను, సాహసాలను, లేదా ఆధ్యాత్మిక ప్రశాంతత లాంటి మీ కోరికలు ఎలా ఉన్నా సరే, మీ అభిరుచికి తగిన సురక్షితమైన గమ్యస్థానాలు భారతదేశంలో చాలానే ఉన్నాయి. మీకు చక్కటి అనుభూతిని కలిగించే ప్రదేశాలేంటో ఒక లుక్కేద్దామా..

తూర్పు, ఈశాన్య భారతదేశం:

సిక్కిం: పచ్చని పర్వతాలు, ప్రశాంతమైన వాతావరణం ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది. ఇక్కడ ఉండే బౌద్ధ ఆశ్రమాలు మీకు చాలా సురక్షితమైన ప్రదేశం.

దక్షిణ భారతదేశం:

మున్నార్ (కేరళ): పచ్చటి తేయాకు తోటలు, కొండలు, పొగమంచుతో నిండిన వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ప్రకృతి ప్రేమికులకు బాగా నచ్చుతుంది.

గోవా: గోవా కేవలం మగవాళ్ళకి మాత్రమే కాదు, ఆడవాళ్ళకి కూడా సేఫెస్ట్ ప్లేస్. బీచ్‌లలో సందడిగా ఎంజాయ్ చేయవచ్చు. రాత్రిపూట కూడా కొద్దిగా జాగ్రత్తలు పాటిస్తే సురక్షితం.

హంపి (కర్ణాటక): ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. పురాతన శిథిలాలు, దేవాలయాలు, చారిత్రక ప్రదేశాలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఇక్కడ ఒంటరిగా ప్రయాణించినా సురక్షితంగా ఉంటుంది.

పుదుచ్చేరి: చిన్న ఫ్రెంచ్ పట్టణం లాగా ఉంటుంది. ఇక్కడ బీచ్‌లు, ఫ్రెంచ్ శైలి రోడ్లు, నైట్‌లైఫ్, షాపింగ్ వంటివి ఆస్వాదించవచ్చు.

సోలోగా ట్రావెలింగ్‌కి రెడీయా
సోలోగా ట్రావెలింగ్‌కి రెడీయా

ఉత్తర భారతదేశం:

సిమ్లా, మనాలి, డల్హౌసీ (హిమాచల్ ప్రదేశ్): ఇక్కడి కొండ ప్రాంతాలు చల్లని వాతావరణంతో పాటు ఆహ్లాదకరంగా చాలా అందంగా ఉంటాయి. చాలా మంది ఒంటరి మహిళా ప్రయాణికులు అందుకే ఈ వాతావరణాన్ని బెస్ట్ ఛాయీస్‌గా తీసుకుంటారు. ఇవే కాకుండా ఇక్కడ ఉండే ధర్మశాల, మెక్‌లియోడ్‌గంజ్ కూడా సురక్షితంగా ఉంటాయి.

నైనిటాల్, రిషికేశ్, ఔలి, డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్): ఇవి కూడా కొండ ప్రాంతాలు, ఆధ్యాత్మికత, సాహస క్రీడలకు ఫ్యామస్. ప్రశాంతమైన వాతావరణంతో పాటు ప్రయాణికులకు సురక్షితంగా ఉంటుంది.

జైసల్మేర్, ఉదయ్‌పూర్ (రాజస్థాన్): రాజస్థాన్‌లో కొన్ని నగరాలు మహిళలకు చాలా సురక్షితమైనవి. జైసల్మేర్‌లో గోల్డెన్ సిటీ కోట, ఎడారి సఫారీ వంటివి కొత్త అనుభూతిని కలిగిస్తాయి. ఉదయ్‌పూర్‌ను 'సిటీ ఆఫ్ లేక్స్' అని పిలుస్తారు. ఇక్కడ రాజభవనాలు, కోటలు, సరస్సులు చాలా అందంగా ఉంటాయి.

జర్నీ చేయాలనుకునే ముందు చేయాల్సిన పనులు:

మీరు వెళ్లాలనుకునే ప్రదేశం గురించి, అక్కడి వాతావరణం గురించి, ట్రాన్స్‌పోర్ట్ విషయాల గురించి ముందుగానే తెలుసుకోండి. నమ్మదగిన ట్రాన్స్‌పోర్ట్ సర్వీసులనే ఉపయోగించండి. పర్యాటక ప్రదేశాల్లో అందుబాటులో ఉండే హోటల్స్‌ను లేదా హోమ్‌స్టేలను సోషల్ మీడియా రేటింగుల ఆధారంగా ఎంచుకోండి. ఎక్కడైనా సహాయం కావాలంటే స్థానిక ప్రజలను అడగడానికి సంకోచించకండి. మీ కుటుంబ సభ్యులకు లేదా స్నేహితులకు మీ ప్రయాణ వివరాలు, బస చేసే ప్రదేశాల గురించి ఎప్పటికప్పుడు తెలియజేయండి. ఏదైనా ఇబ్బంది అనిపిస్తే వెంటనే పోలీసులకు లేదా స్థానిక అధికారులకు తెలియజేయండి.

రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.