Naga Chaitanya and Sobhita: ఉప్పాడ చీరలో శోభితా, పట్టు పంచెలో నాగచైతన్య, వీరి ఎంగేజ్‌మెంట్ లుక్ అదిరిపోయింది
Naga Chaitanya and Sobhita: శోభితా ధూళిపాళ్ల - నాగచైతన్య ఎంగేజ్మెంట్ గుట్టుగా జరిగిపోయింది. నిశ్చితార్థం రోజు వరకు ఈ విషయం బయటికి తెలియనివ్వాలి. ఈ ప్రేమపక్షలు ఎంగేజ్మెంట్ లుక్ ఎంతో సంప్రదాయబద్ధంగా ఉంది.
శోభితా ధూళిపాళ -నాగచైతన్యల నిశ్చితార్థం చాలా సీక్రెట్ గా జరిగిపోయింది. గురువారం ఉదయం హైదరాబాద్ లో సంప్రదాయబద్ధంగా వీరి నిశ్చితార్థం జరిగింది. వారిద్దరి నిశ్చితార్థం గురించి హీరో నాగార్జున సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ రోజు ఉదయం 9:42 గంటలకు శోభిత ధూళిపాళతో నాగచైతన్య నిశ్చితార్థం జరగడం ఆనందంగా ఉందని, ఆమెను మా కుటుంబంలోకి స్వాగతించడానికి సంతోషిస్తున్నామని ఆయన రాసుకొచ్చారు.
నాగార్జున కొత్త జంట ఫోటోలను కూడా పోస్టు చేశారు. ఆ ఫోటోల్లో నాగ చైతన్య - శోభితా ధూళిపాళ ఎంతో అందమైన ఎథ్నిక్ దుస్తుల్లో కనిపించారు. వారి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వారి అభిమానుల నుండి నాగచైతన్యకు, శోభితకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా నిశ్చాతార్థం రోజు కొత్త జంట ఎథ్నిక్ లుక్ గురించి ఎక్కువమందిని ఆకర్షించింది.
మనీష్ మల్హోత్రా చీరలో
కొత్త జంట తమ ప్రత్యేకమైన రోజు కోసం బాలీవుడ్ ఫేవరెట్ డిజైనర్ మనీష్ మల్హోత్రా సాయం తీసుకున్నారు. శోభిత లెహంగాలు, మ్యాక్సీ గౌన్లను విడిచిపెట్టి, ఆరు గజాల చీరలో అందంగా మెరిసింది. ఆమె తన చీర బాధ్యతను మనీష్ కు అప్పగించారు. ఆమె చీర ఆకర్షణీయమైన లేత పీచ్ షేడ్ లో కనిపిస్తోంది. అంచుల్లో బంగారు తీగలతో డిజైన్లు వేసి ఉంది. ఈ చీర రాయల్ వైబ్స్‌ను అందిస్తోంది. సంప్రదాయబద్ధంగా చీర కట్టుకున్న శోభితా చాలా సింపుల్ గా కనిపిస్తోంది. ఆమె చీర ఉప్పాడ పట్టుతో నేసింది. శోభితా తన నిశ్చితార్ధానికి కచ్చితంగా ఉప్పాడ చీరనే కావాలని మనీష్ ను కోరింది. ఆయన ఉప్పాడ చీరనే డిజైనెర్‌వేర్ గా మార్చారు.
చీరకు తగ్గట్టే సింపుల్ మేకప్ ఎంపిక చేసుకుంది శోభితా. మ్యాచింగ్ స్వీట్ నెక్ లైన్ బ్లౌజ్ ను వేసుకుంది. ఆమె ఈ చీరలో చాలా సొగసుగా కనిపిస్తోంది. యాక్సెసరీస్ కోసం శోభిత బంగారు ఆభరణాలను అలంకరించుకుంది. స్టెప్ నెక్లెస్, బంగారు గాజులు, అందమైన జుమ్కాలతో అచ్చ తెనుగు అమ్మాయిలా ఉంది. న్యూడ్ ఐషాడో, ఐలైనర్, కాటుక, ప్రకాశవంతమైన హైలైటర్, న్యూడ్ లిప్ స్టిక్ షేడ్ తో ఆమె మేకప్ అదిరిపోయింది. ఆమె నుదుటిని పెళ్లి బొట్టును పెట్టుకుంది. తలలో కనకాంబరాలను పెట్టుకుంది.
పంచెకట్టులో నాగచైతన్య
మరోవైపు నాగచైతన్య ఆల్ వైట్ లుక్ లోకి కనిపించాడు. వి-నెక్, ఫుల్ స్లీవ్స్ తో ఐవరీ కుర్తా ధరించాడు. పక్కాగా చెప్పాలంటే నాగచైతన్య పంచెకట్టులో మెరిసిపోయాడు. పైన కండువా ధరించి స్టైలిష్ గా కనిపించాడు. మెరిసే జుట్టుతో, గడ్డంతో, చిరునవ్వుతో తన నిశ్చితార్థ లుక్ ను పూర్తి చేశాడు.