Sobhita Dhulipala: శోభిత ధూళిపాళ్ల ఒకప్పుడు మిస్ ఇండియా, ఇప్పుడు అక్కినేని వారి కాబోయే కోడలు, ఈ విషయాలు తెలుసుకోండి-sobhita dhulipala once miss india now akkinenis future daughter in law know these things ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sobhita Dhulipala: శోభిత ధూళిపాళ్ల ఒకప్పుడు మిస్ ఇండియా, ఇప్పుడు అక్కినేని వారి కాబోయే కోడలు, ఈ విషయాలు తెలుసుకోండి

Sobhita Dhulipala: శోభిత ధూళిపాళ్ల ఒకప్పుడు మిస్ ఇండియా, ఇప్పుడు అక్కినేని వారి కాబోయే కోడలు, ఈ విషయాలు తెలుసుకోండి

Haritha Chappa HT Telugu
Aug 08, 2024 02:22 PM IST

Sobhita Dhulipala: శోభిత ధూళిపాళ్ల అచ్చ తెలుగు ఇంటి అమ్మాయి. ఆమెను చూస్తే మాత్రం టాప్ మోడల్‌లా కనిపిస్తుంది. ఇప్పుడు అక్కినేని వారి ఇంటికి కోడలు కాబోతోందని టాక్.

నాగచైతన్య - శోభితా ధూళిపాళ్ల
నాగచైతన్య - శోభితా ధూళిపాళ్ల

Sobhita Dhulipala: శోభిత ధూళిపాళ్ల - నాగచైతన్య మధ్య ఏదో అనుబంధం ఉందని కొన్నేళ్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా వారిద్దరికీ నిశ్చితార్థమని తెలుస్తోంది. చూడటానికి అంతర్జాతీయ మోడల్‌లా కనిపిస్తూ ఉన్న శోభితా అచ్చ తెలుగింటి అమ్మాయి. ఆంధ్రప్రదేశ్లోని తెనాలిలో ఈమె జన్మించింది. విశాఖపట్నంలోని విశాఖ వ్యాలీ స్కూల్లో చదివింది. తర్వాత తండ్రి ఉద్యోగరీత్యా ముంబై యూనివర్సిటీకి మారింది. భరతనాట్యం, కూచిపూడి వంటి సాంప్రదాయ నాట్యకళారీతులలో శిక్షణ తీసుకుంది. ఇంత పద్ధతిగా ఎదిగిన శోభిత ధూళిపాళ్ల సినిమాలోకి వచ్చాక మాత్రం పూర్తిస్థాయి మోడల్ గా మారింది. సినిమాల్లో ఎక్స్‌పోజింగ్ కూడా ఏ మాత్రం వెనకాడడం లేదు. ఇప్పుడు నాగచైతన్యతో ఈమె వివాహం కానందుని తెలిశాక సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. వారిద్దరి నిశ్చితార్థం ఎంతవరకు నిజమో తెలియదు... కానీ శోభిత గురించి గూగుల్ లో వెతికే వారి సంఖ్య మాత్రం పెరిగిపోయింది.

శోభిత ధూళిపాళ్ల మొదట ఒక మోడల్ గా కెరీర్ మొదలుపెట్టింది. 2013లో ఫెమీనా మిస్ ఇండియా పోటీలో ఆమె పాల్గొంది. ఆ పోటీల్లో ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ 2013 టైటిల్‌ను గెలుచుకుంది. ఆ తరువాత మన భారతదేశం తరుపున మిస్ ఎర్త్ 2013 పోటీల్లోనూ పాల్గొంది. కానీ అక్కడ ఆమె టైటిల్ గెలవలేకపోయింది. అప్పుడే ఆమె బాలీవుడ్ వారి దృష్టిలో మాత్రం పడింది.

మొదటి సినిమా

బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఆమెకు తొలిసారిగా 2016లో తాను తీసిన ‘రామన్ రాఘవ్ 2.0’ సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. ఆ తర్వాత అనేక సినిమాల్లో శోభిత అవకాశాలను దక్కించుకుంది. తెలుగులో ఆమె గూఢచారి, మేజర్ వంటి సినిమాల్లో కనిపించింది. ముఖ్యంగా పొన్నియన్ సెల్వన్ సినిమాతో ఆమె మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత హిందీ వెబ్ సిరీస్ ‘ద నైట్ మేనేజర్’ లో అనిల్ కపూర్ భార్యగా నటించింది. అందులో ఆమె కాస్త బోల్డ్‌గానే కనిపించింది. మంకీ మ్యాన్ అనే అమెరికన్ సినిమాలో నటించింది.

శోభిత ధూళిపాళ్ల తండ్రి మర్చంట్ నేవీలో ఇంజనీర్‌గా పనిచేసేవారు. ఇక తల్లి గవర్నమెంట్ టీచర్‌గా పని చేశారు. పదహారేళ్లు వచ్చే వరకు విశాఖపట్నంలోనే పెరిగింది. ఆ తర్వాత తండ్రి ఉద్యోగరీత్యా ముంబైకి మారింది. అక్కడే చదువులు పూర్తి చేసింది.

కల్కి సినిమాలో...

కల్కి సినిమాలో దీపికా పదుకొనేకు వాయిస్ ఓవర్ ను ఇచ్చింది కూడా శోభితానే. కాకపోతే ఆ సినిమాలో దీపికాకు చాలా తక్కువ డైలాగులు ఉన్నాయి. దీనివల్ల శోభితకు పెద్దగా పేరు రాలేదు.

తెలుగు ప్రజల్లో ఈమె చేసిన సినిమాల కన్నా నాగచైతన్యతో ఆమెకున్న బంధం వల్లే ఎక్కువ పేరును సంపాదించింది. వారిద్దరూ కలిసి బయటికి వెళ్లినప్పుడు కొన్ని ఫోటోలు లీక్ కావడంతో వారిద్దరూ రిలేషన్షిప్ లో ఉన్నారని అనుమానం వచ్చింది. ఇప్పుడు వారిద్దరికీ నిశ్చితార్థం జరిగిపోతుందని తెలుస్తోంది. ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే అక్కినేని వారి ఇంటి నుండి అధికారిక ప్రకటన రావాల్సిందే. నాగచైతన్య, శోభిత దూళిపాళ్ల కలిసి ఇప్పటివరకు ఒక్క సినిమాలో కూడా నటించలేదు... కనీసం ఒక ప్రకటనలో కలిసి కనిపించలేదు, అయినా కూడా వీరి మధ్య అనుబంధం ఏర్పడడం మాత్రం ఎంతో మందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.