Chitti Punugulu: చిట్టి పునుగులను మైదా లేకుండా కూడా చేసుకోవచ్చు, ఇదిగోండి రెసిపీ ఇవాళే ట్రై చేసేయండి!-snacks recipe you can also make chitti punugulu without maida here is the simple recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Chitti Punugulu: చిట్టి పునుగులను మైదా లేకుండా కూడా చేసుకోవచ్చు, ఇదిగోండి రెసిపీ ఇవాళే ట్రై చేసేయండి!

Chitti Punugulu: చిట్టి పునుగులను మైదా లేకుండా కూడా చేసుకోవచ్చు, ఇదిగోండి రెసిపీ ఇవాళే ట్రై చేసేయండి!

Ramya Sri Marka HT Telugu

Chitti Punugulu: చిట్టి పునుగులంటే చాలా మందికి ఇష్టం. కానీ వాటిలో మైదా ఉంటుందని చేసుకోవడానికి, తినడానికి భయపడుతుంటారు. ఈ సారి నుంచీ మైదా లేకుండానే చిట్టి పునుగులను వేసుకోండి. అది కూడా చాలా సింపుల్‌గా. లేట్ చేయకుండా రెసిపీలోకి వెళిపోదాం రండి.

మైదా లేకుండానై తయారైన చిట్టి పునుగులు

చిన్నగా ముద్దుగా, కరకరలాడుతూ నోరూరించే చిట్టి పునుగులంటే చాలా మందికి ఇష్టం. కానీ వీటిని తయారు చేసుకుని తినాలంటేనే భయం. ఎందుకంటే ఇవి మైదాతో తయారు అవుతాయి.చింతించకండి.. ఇప్పటి నుంచీ చిట్టి పునుగులు తినడానికి మీరేం భయపడాల్సిన అసవరం లేదు.మీకు ఇష్టమైన చిట్టి పునుగులను మైదా లేకుండానే కూడా వేసుకోవచ్చు.అది కూడా చాలా సింపుల్‌ పద్ధతిలో. ఇవి ఆరోగ్యానికి హాని చేయకపోవడంతో పాటు రుచిలో కూడా అదిరిపోతాయి. మీ ఇంట్లో పిల్లల నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కరికీ ఇవి చాలా చాలా నచ్చుతాయి. ఆలస్యం ఎందుకు.. మైదా లేకుండానే చిట్టి పునుగులు ఎలా తయారు చేసుకోవాలో వివరంగా తెలుసుకుందాం రండి..

మైదా లేకుండా చిట్టి పునుగులు తయారు చేయడం ఎలా?

కావాల్సిన పదార్థాలు:

  • ఒక కప్పు బియ్యం
  • మూడు లేదా నాలుగు బంగాళాదుంపలు
  • రుచికి సరిపడా ఉప్పు
  • ఒక స్పూన్ జీలకర్ర
  • రెండు పచ్చిమిర్చీ
  • రెండు స్పూన్ల కొత్తిమీర తరగు
  • డీప్ ఫ్రైకి సరిపడా నూనె

చిట్టి పునుగులు తయారు చేసే పద్ధతి:

  1. చిట్టి పునుగులు తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక కప్పు బియ్యాన్ని తీసుకోండి.(సన్న బియ్య కన్నా దొడ్డు బియ్యంతో అయితే పునుగులు మరింత రుచిగా ఉంటాయి).
  2. బియ్యాన్ని శుభ్రంగా రెండు సార్లు కడిగిన తర్వాత నీటిలోనే ఉంచి నానబెట్టండి.
  3. కనీసం 2 నుంచి 4 గంటల పాటు బియ్యం నానేలా చూడండి.
  4. ఈ లోపు బంగాళదుంపను తీసుకుని ఉడక పెట్టుకించి పొట్టుతీసి పక్కన పెట్టుకోండి.
  5. 4 గంటలు పాటు నానిన బియ్యాన్ని మిక్సీ జార్లో వేసి మెత్తటి పేస్టులా తయారు చేయండి.
  6. తరువాత ఉడికించిన బంగాళాదుంపలను చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని మిక్సీ జార్లో వేసి మెత్తటి పేస్టులా మారేంత వరకూ మిక్సీ పట్టండి.
  7. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లో బియ్యంతో చేసిన మెత్తటి పేస్టును, బంగాళాదుంపల పేస్టునూ వేసి కలపండి.
  8. ఇప్పుడు దీంట్లోనే జీలకర్ర, పచ్చిమిర్చీ కొత్తిమీరతో పాటు రుచికి సరిపడా ఉప్పు వేసి అన్నీ కలిసిపోయేంత వరకూ బాగా కలపండి.
  9. ఇలా కలిపిన మిశ్రమాన్ని పది నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టండి.
  10. ఈలోపు ఒక ఫ్రైయింగ్ పాన్ తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి వేడి చేయండి.
  11. నూనె వేడెక్కే లోపు ముందుగా తయారు చేసి పక్కన పెట్టుకున్న పిండిని తీసుకుని మరో సారి బాగా కలపిండి.
  12. నూనె వేడెక్కిన తర్వాత పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ నూనెలో వేయండి.
  13. స్టవ్‌ను మీడియం ఫ్లేములోనే ఉంచి పునుగులను అటు ఇటు తిప్పుతూ బంగారు రంగులోకి వచ్చేంత వరకూ వేయించండి.(పునుగులను ఎప్పుడు వేయించిన చిన్న మంట మీద వేయించాలి. పెద్ద మంట మీద వేయిస్తే లోపల పచ్చిగా ఉంటుంది.)
  14. ఇలా పునుగులు కరకరలాడుతూ రంగు మారేంత వరకూ వేయించుకుని తీసారంటే మీ చిట్టి పునుగులు తయారైనట్టే.

వేయించిన పళ్లీలతో చట్నీ చేసుకుని వేడి వేడిగా తిన్నారంటే వేరే పునుగులేవి వద్దంటారు. పిల్లలైతే వీటిని రోజూ కావాలని అడుగుతారు. చిట్టి పునుగుల రెసిపీ నచ్చింది కదా. తయారు చేయడం మొదలు పెట్టేయండి మరి.

Ramya Sri Marka

eMail
రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం