Saturday Motivation: గుండె కోసం మరింత నవ్వండి, ఎక్కువ కాలం జీవించేందుకు ఇదే సులువైన మార్గం
Saturday Motivation: గుండె ఆరోగ్యం ఎంత చక్కగా ఉంటే ఆయుష్షు అంతగా పెరుగుతుంది. ఆధునిక కాలంలో గుండె జబ్బుల వల్లే ఎక్కువ మంది మరణిస్తున్నారు. కాబట్టి ఆయుష్షును పెంచేందుకు తనివి తీరా నవ్వండి.
నవ్వడం ఒక యోగం. ప్రతిరోజూ నవ్వే వారు అదృష్టవంతులు. అలాంటి అదృష్ట వంతుల జాబితాలో ప్రతి ఒక్కరూ చేరితే… వారి ఆరోగ్యం ఎన్నో విధాలా బావుంటుంది. ఇది మానసిక స్థితి మెరుగ్గా ఉండేందుకు, ఆనందంగా ఉండేందకు నవ్వు ఎంతో ఉపయోగపడుతుంది. ఎక్కువగా నవ్వడం ద్వారా గుండె జబ్బులను దూరం చేసుకోవచ్చని ఎన్నో అధ్యయనాలు ఉన్నాయి. జపాన్ కు చెందిన యమగాట విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు 40 లేదా అంతకంటే తక్కువ వయస్సు గల 17,152 మందిపై వారి నవ్వు విధానాలను ట్రాక్ చేశారు. ప్రతిరోజూ ఎంత ఎక్కువగా నవ్వితే గుండె ఆరోగ్యాన్ని అంతగా పెంచుకోవచ్చని వారి అధ్యయనం చెబుతోంది. ఇప్పుడు ఈ అధ్యయనం వల్ల యమగాటా పౌరులను రోజూ నవ్వమని ఆదేశించడానికి ఒక చట్టాన్ని ఆమోదించాలని అక్కడ స్థానిక ప్రభుత్వం జపాన్ దేశ ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసింది.
నవ్వు ఫ్రీక్వెన్సీని పెంచడం వల్ల గుండె ఆరోగ్యం పెరుగుతుందని, ఎక్కువ కాలం జీవించేలా చేస్తుందని ఈ అధ్యయనం పేర్కొంది. నవ్వు ప్రయోజనాలు నిరూపించడానికి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అధ్యయనాలు జరిగాయి. ప్రివెంటివ్ మెడిసిన్ జర్నల్లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, వృద్ధులు వారి స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఎక్కువగా నవ్వినప్పుడు, వారు వారి వయస్సులో ఉన్నవారు సాధారణంగా ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలను అభివృద్ధి చేసే ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
మానసిక ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది
నర్సింగ్ & హెల్త్ సైన్సెస్ లో మరొక అధ్యయనం ప్రకారం, మనం నవ్వినప్పుడు, ఇది కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ ఉత్పత్తిని శరీరంలో తగ్గిస్తుంది. ఇది మానసిక ఆందోళనను తగ్గిస్తుంది. నవ్వు శరీరం సహజ విశ్రాంతి ప్రక్రియను సక్రమంగా చేయడానికి సహాయపడుతుంది. మనకు మంచి అనుభూతిని కలిగిస్తుంది.
ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీలో ఎవల్యూషనరీ సైకాలజీ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న రాబిన్ డన్బార్ నవ్వు వల్ల కలిగే శారీరక, మానసిక ప్రభావాలను ఏళ్ల తరబడి అధ్యయనం చేశారు. నవ్వడం మానసిక స్థితిని పెంచడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుందని ఆయన పేర్కొన్నారు. మనం నవ్వినప్పుడు ఎండార్ఫిన్ల విడుదలకు సహాయపడతాయి. ఇది నొప్పిని నిర్వహించడానికి సహాయపడుతుంది. మనకు ఆనందాన్ని కలిగిస్తుంది. మంచి గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.
నవ్వు ప్రయోజనాలు
మంచి ఆరోగ్యానికి నవ్వు దోహదం చేస్తుంది. సామాజిక ప్రవర్తనలో దాని ప్రయోజనాలు అపారమైనవి. యూసీఎల్ ప్రొఫెసర్, ఇన్స్టిట్యూట్ ఫర్ కాగ్నిటివ్ న్యూరోసైన్స్ డైరెక్టర్ సోఫీ స్కాట్ మాట్లాడుతూ, మనలో మనం కాకుండా మరొకరితో కలిసి నవ్వితే మంచిది. ఇది ఒక బంధాన్ని సృష్టించడానికి, ఇతరులను కలుపుకుపోయేలా చేయడానికి సహాయపడుతుంది. నవ్వు మన సంబంధాల నాణ్యతను మెరుగుపరుస్తుంది. ఇది మన హృదయాన్ని యవ్వనంగా, సంతోషంగా ఉంచుతుంది. కాబట్టి ప్రతి రోజూ కాసేపైనా నవ్వుకు కేటాయించాలి. ఇది మీ ఆయుష్షును పెంచుతుంది. నెల రోజుల పాటూ లాఫింగ్ థెరపీ తీసుకుంటే ఎంతో మేలు.