సెలవుల్లో పిల్లలు చేసే అల్లరి తట్టుకోలేకపోతున్నారా? ఈ 10 చిట్కాలతో చెక్ పెట్టేయండి!-smart summer parenting 10 tips for a peaceful summer while teaching kids discipline ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  సెలవుల్లో పిల్లలు చేసే అల్లరి తట్టుకోలేకపోతున్నారా? ఈ 10 చిట్కాలతో చెక్ పెట్టేయండి!

సెలవుల్లో పిల్లలు చేసే అల్లరి తట్టుకోలేకపోతున్నారా? ఈ 10 చిట్కాలతో చెక్ పెట్టేయండి!

Ramya Sri Marka HT Telugu

సెలవులు వచ్చేసరికి పిల్లల అల్లరి ఎక్కువైపోయిందా? వారు చేసే రచ్చకు చెక్ పెట్టే మార్గం కోసం చూస్తున్నారా? టెన్షన్ పడకండి! మీ చిట్టి తారల్ని కూల్‌గా, క్యూట్‌గా క్రమశిక్షణలో పెట్టేందుకు సహాయపడే 10 సూపర్ హిట్ చిట్కాలు మీ కోసం రెడీగా ఉన్నాయి. వీటితో మీ పిల్లలు ఎంజాయ్ చేస్తూనే, మంచి పిల్లల్లా ఉంటారు.

అల్లరి చేస్తూ తల్లిని విసిగిస్తున్న పిల్లవాడు

వేసవి సెలవులు వచ్చాయంటే పిల్లలకు అల్లరికీ, ఆనందానికి అవధులుండవు. స్కూలు, ట్యూషన్లు, హోంవర్క్ ఏమీ ఉండవు.. రోజంతా ఆటలు, పాటలు, సరదాలే. అయితే ఈ స్వేచ్ఛ కొన్నిసార్లు వారిని అదుపు తప్పేలా చేస్తుంది. ఇంట్లో అల్లరి పెరగడం, నియమాలు పాటించకపోవడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. ఇలాంటి సమయంలో పిల్లలను మందలించడం కంటే, వారిని ప్రేమగా క్రమశిక్షణలో పెట్టడం చాలా ముఖ్యం.

సెలవుల్లో పిల్లలకు సరైన దారి చూపించడానికి, వారిలో మంచి అలవాట్లు పెంపొందించడానికి తల్లిదండ్రులుగా మీరు కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు పాటించడం అవసరం. మీ పిల్లలు సంతోషంగా గడుపుతూనే బాధ్యతాయుతంగా ప్రవర్తించడానికి సహాయపడే 10 శక్తివంతమైన చిట్కాలను మీకోసం మేం తీసుకొచ్చాం. ఇవి మీ పిల్లల ప్రవర్తనను మెరుగుపరచడమే కాకుండా, మీ బంధాన్ని మరింత బలపరుస్తాయి. ఆలస్యం చేయకుండా పిల్లల అల్లరికి చెక్ పెట్టి సెలవులను మరింత ఆహ్లాదకరంగా, క్రమశిక్షణతో కూడినదిగా మార్చే ఆ చిట్కాలు ఏంటో చూసేద్దాం రండి.

పిల్లల అల్లరిని తగ్గి క్రమశిక్షణ పెరిగేందుకేు సహాయపడే సింపుల్ చిట్కాలు:

1. రోజు ఒక టైమ్‌టేబుల్ పెట్టుకోండి: -

బడి లేకపోవడంతో పిల్లలకు రోజంతా ఖాళీగా ఉంటుంది. దీనివల్ల ఏం చేయాలో తెలియక విసుగు చెంది ఎక్కువ అల్లరి చేసే అవకాశం ఉంది. అందుకే మీరు వారికి ఒక ప్రత్యేకమైన టైం టేబుల్ సెట్ చేయండి. కొంచెం అటుఇటుగా సాగినా పర్లేదు, కానీ ఒక పద్ధతితో మెలిగేలా చేయండి. నిద్ర లేచే టైమ్, ఉదయం టిఫిన్ టైమ్, ఆడుకునే టైమ్, చదువుకుకోవడం లేదా బొమ్మలతో ఆడుకోవడం, రాత్రి భోజనం టైమ్, పడుకునే టైమ్ ఇలా ఒక సాధారణ టైమ్‌టేబుల్ లాంటిది ఏర్పాటు చేయండి. ఇది వాళ్లకు ఒక పద్ధతిని అలవాటు చేస్తుంది. కచ్చితంగా ఇదే టైమ్‌కి చేయాలని ఒత్తిడి చేయకండి, కాస్త అటుఇటుగా అయినా ఒక పద్ధతిలో చేయించడానికి ప్రయత్నించండి. ఉదాహరణకు, ఉదయం 9 గంటలకు లేవడం, 10 గంటలకు చదవడం లేదా రాయడం, 11 గంటలకు ఆడుకోవడం ఇలా ఒక ప్లాన్ వేసుకోవచ్చు.

2. వాళ్లకు ఇష్టమైన, కొత్త విషయాలు నేర్పించే పనులు చేయించండి:-

పిల్లలకు బోర్ కొడితేనే ఎక్కువ అల్లరి చేస్తారు. కాబట్టి బోర్ కొట్టకుండా ఉండటానికివాళ్లకు ఇష్టమైన పనులు ఏంటో తెలుసుకొని వాటిని చేయమని ప్రోత్సహించండి. బొమ్మలు వేయడం, రంగులు వేయడం, కథలు చదవడం, చిన్న చిన్న క్రాఫ్ట్ పనులు చేయడం, పాటలు పాడటం లేదా ఇంకేదైనా ఏదైనా కొత్త విషయం నేర్చుకోవడం వంటివి వారితో చేయించండి. వీలైతే, వాళ్లను ఏదైనా వేసవి శిబిరాల్లో (సమ్మర్ క్యాంప్స్) లేదా క్లాసుల్లో (డ్యాన్స్, మ్యూజిక్) వంటి వాటిలో చేర్పించండి. అక్కడ వాళ్లకు కొత్త ఫ్రెండ్స్ కూడా దొరుకుతారు, కొత్త కొత్తి విషయాలు నేర్చుకుంటారు.

3. ఆడుకోవడానికి ఎక్కువ సమయం ఇవ్వండి: -

చాలా మంది తల్లిదండ్రులు చేసే పొరపాటు ఏంటంటే.. పిల్లలను రోజంతా ఇంట్లోనే ఉంచడం. ఇది సరైన పెంపకం కాదని తెలుసుకోండి. బయట ఆటలకు ప్రాధాన్యత ఇవ్వండి. పిల్లలకు వాళ్లలో ఉన్న ఎనర్జీని బయటకు పంపడానికి ఆడుకోవడం చాలా ముఖ్యం. రోజూ కనీసం ఒక గంట అయినా బయట ఆడుకోవడం, పరిగెత్తడం, సైకిల్ తొక్కడం, బంతి ఆటలు ఆడటం వంటివి చేయంచండి. కుదరని పక్షంలో ఇంట్లో గంతులు వేయడానికి, పరిగెత్తడానికి ఛాన్స్ ఇవ్వండి. బయట ఆడుకోవడం వల్ల వాళ్లకు మంచి గాలి తగులుతుంది, ఎముకలు బలంగా అవుతాయి, బాగా ఆకలి వేస్తుంది, దాంతో నిద్ర కూడా బాగా పడుతుంది. బాగా ఆడుకున్న పిల్లలు ఇంట్లో ఎక్కువ అల్లరి చేయకుండా ఉంటారు.

4. ఇంట్లో కొన్ని రూల్స్ పెట్టుకోండి: -

ఇంట్లో అందరూ కలిసి కొన్ని ముఖ్యమైన రూల్స్ పెట్టుకోండి. టీవీ లేదా మొబైల్ ఎంతసేపు చూడాలి, ఎప్పుడు నిద్రపోవాలి, పెద్దవాళ్లతో ఎలా మాట్లాడాలి, ఇంట్లో సామాన్లు ఎక్కడ పెట్టాలి లాంటి విషయాలపై ఒక ఒప్పందానికి రండి. ఈ రూల్స్‌ను అందరూ పాటించాలి. రూల్ తప్పితే ఏమి జరుగుతుందో కూడా డిసైడ్ అవండి. అంటే చిన్న చిన్న శిక్షలు వంటివి వేసుకునేలా ప్లాన్ చేసుకోండి. ఇలా ఇంట్లో అందరూ కలిసి రూల్స్ పెట్టుకుంటే వాటిని పాటించడానికి పిల్లలు ఎక్కువ ఇష్టపడతారు. పోటీ పడి వాటిని సక్రమంగా నిర్వహిస్తారు.

5. చిన్న చిన్న పనులు చెప్పండి: -

చిన్న వయసు నుంచి పిల్లలకు బాధ్యత నేర్పించడం చాలా మంచిది. అంటే పిల్లలకు వాళ్ల వయస్సుకు తగ్గట్టు చిన్న చిన్న బాధ్యతలు అప్పగించండి. వాళ్ల గదిని వాళ్లే సర్దుకోవడం, బట్టలు ఒక చోట పెట్టడం, పుస్తకాలు బ్యాగ్‌లో పెట్టుకోవడం, మొక్కలకు నీళ్లు పోయడం లేదా భోజనం తర్వాత ప్లేట్లు తీయడం లాంటి పనులు చెప్పవచ్చు. ఇలా చేస్తే వాళ్లకు బాధ్యత అంటే ఏమిటో తెలుస్తుంది, వాళ్లు కూడా ఇంటికి ఏదో ఒక రకంగా సహాయం చేస్తున్నామనే భావన కలుగుతుంది. అల్లరి కూడా తగ్గుతుంది.

6. మంచిగా ఉంటే మెచ్చుకోండి, చిన్న బహుమతులు ఇవ్వండి: -

పిల్లల పెంపకంలో ప్రోత్సాహం చాలా ముఖ్యం. పిల్లలు మీరు చెప్పినట్లు వింటే లేదా ఏదైనా మంచి పని చేస్తే వెంటనే వాళ్లను మెచ్చుకోండి. "నువ్వు చాలా బాగా చేశావ్", "నీట్ గా సర్దావ్" లాంటి మాటలతో వారిని మెచ్చుకుంటూ ఉండండి. అప్పుడప్పుడు చిన్న చిన్న గిఫ్ట్‌లు (చాక్లెట్లు, స్టిక్కర్లు) ఇవ్వడం వల్ల వాళ్లకు మరింత ప్రోత్సాహంగా ఉంటుంది. మంచి ప్రవర్తనకు గుర్తింపు లభిస్తే వాళ్లు మళ్లీ మళ్లీ మంచిగా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తారు.

7. గొడవలు పడితే ఎలా మాట్లాడుకోవాలో నేర్పించండి :-

పిల్లలు ఆడుకునేటప్పుడు లేదా ఏదైనా విషయంలో వాళ్ల అభిప్రాయాలు వేరుగా ఉంటే గొడవపడటం సహజం. ఇలాంటప్పుడు కొట్టుకోకుండా, తిట్టుకోకుండానే మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకోవడం ఎలాగో వాళ్లకు నేర్పించండి. రాజీ పడటం నేర్పించండి. ఉదాహరణకు ఒకే బొమ్మ కోసం ఇద్దరు కొట్టుకుంటే వారి దగ్గర నుంచి ఆ బొమ్మను తీసుకుని గొడవ పడితే ఆ బొమ్మతో ఆడుకోవడానికి ఇద్దరికీ ఛాన్స్ ఉండదని చెప్పాలి. చెప్పిన దాని ప్రకారమే ఆ బొమ్మను కాసేపటి వరకూ వారికి ఇవ్వకండి. అప్పుడే వాళ్లకు తెలుస్తది ప్రతి యాక్షన్‌కు ఒక రియాక్షన్ ఉంటదని. గొడవపడితే ఏమీ రాదని. ఎమోషన్స్ వారికి అర్థం కావు కాబట్టి ఇలా లాజికల్‌గా కనెక్ట్ చేయాలి.

8. ఫోన్, టీవీకి టైమ్ పెట్టండి: -

వేసవి సెలవుల్లో పిల్లలు ఎక్కువసేపు ఫోన్లు చూడటం లేదా టీవీ చూడటం చేస్తుంటారు. ఇది వారికి కళ్లకు, బుద్దికి మంచిదీ.కాబట్టి వీటికి ఒక టైమ్ లిమిట్ పెట్టండి. రోజులో ఒక నిర్దిష్ట సమయం మాత్రమే చూడటానికి అనుమతించండి. ఆ టైమ్ అయిపోయాక వాళ్లను బయటకు వెళ్లి ఆడుకోమని లేదా ఇతర పనులు చేయమని చెప్పండి. ఎక్కువసేపు స్క్రీన్ చూడటం వల్ల కళ్లు పాడవుతాయి, బుద్ధి కూడా మందగిస్తుంది.

9. ఓపిక పట్టండి, ప్రేమగా చూడండి: -

పిల్లలు అల్లరి చేస్తే, మీరు చెప్పిన మాట వినకపోతే కోపం రావడం సహజం. కానీ వాళ్లను తిట్టడం లేదా కొట్టడం వల్ల సమస్య పరిష్కారం కాదు. ఇలా చేయడం వారిలో మెండితనానికి దారి తీస్తుంది. కాబట్టి ఏదైనా ఓపికగా చెప్పండి, వాళ్లను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ప్రేమగా చూసుకుంటే వాళ్లు కూడా మీ మాట వింటారు, మంచిగా ఉంటారు.

10. మీరు కూడా కాసేపు రెస్ట్ తీసుకోండి: -

పిల్లలను రోజంతా చూసుకోవడం చాలా కష్టమైన పని. మీరు అలసిపోతే చిరాకు వస్తుంది, పిల్లలపై కోపం చూపే అవకాశం పెరుగుుతుంది. అందుకే మీకు నచ్చిన పనులు చేయడానికి మీరు కూడా రోజులో కొంత సమయం కేటాయించుకోండి. మీరు హ్యాపీగా ఉంటేనే పిల్లలను కూడా హ్యాపీగా చూసుకోగలరు, వారితో మంచిగా, ఓపికగా ఉండగలరు.

రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం