బిజీ లైఫ్ స్టైల్‌లో నిద్రలేమితో ఇబ్బంది పడే వాళ్లు చాలా మందే ఉన్నారు. పని ఒత్తిడి, మానసిక సమస్యలతో పాటు ఇతర కారణాల వల్ల నిద్రలేమి సమస్యకు గురవుతారు. వీరికి నిద్రపోవడానికి సమయం కేటాయించుకున్నా సరిగా నిద్రపోలేరు. అదే పరిస్థితి కొనసాగుతూ పోతే అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతిని ఫ్లూ జ్వరాలు, ఇన్ఫెక్షన్లు వేగవంతంగా వ్యాపిస్తాయి. అంతేకాకుండా రక్తపోటు పెరిగి దీర్ఘకాలంలో గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని కూడా పెంచుతాయి.
ఈ సమస్య రాకుండా ఉండాలంటే, నిద్రించే ముందు మీరు కొన్ని చిట్కాలు పాటించాలని ఆయుర్వేద నిపుణులు రాజా ఈశన్ చెప్పారు. నిద్రకు ఉపకరించే చిట్కాలను హిందుస్తాన్ టైమ్స్ తెలుగుతో ఆయన పంచుకున్నారు.
1. నిద్రించే ముందు రెండు గ్లాసుల నీటిని మరిగించి, అందులో ఒక పిడికెడు పంచదార వేయండి. అలా మరిగి ఒక గ్లాసు నీరు మాత్రమే మిగిలిన తర్వాత వెచ్చగా ఉన్నప్పుడే తాగేయాలి..
2. మూడు వేళ్ల వెడల్పు కంటే తక్కువ ఎత్తు ఉన్న దిండును తల కింద పెట్టుకుని నిద్రపోయేందుకు ప్రయత్నించాలి.
3. ఆహారం విషయంలో జాగ్రత్త వహిస్తూ.. రాత్రి భోజనాన్ని రాత్రి 8 గంటలలోపే పూర్తి చేయాలి.
4. నిద్రించే ముందు కొంత సమయం మనోవశం వ్యాయామం చేయాలి. (మనోవశం వ్యాయామం అంటే మనస్సును శాంతింపజేసుకోవడానికి వృత్తాలతో కూడిన చిత్రాన్ని రెండు నిమిషాలు చూడాలి. ఆ తర్వాత కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకున్నప్పుడు ఆ చిత్రం మీ మనస్సులో కనిపిస్తుంది. అప్పుడు ఓం అనే ధ్వనిని ఉచ్చరించాలి. దీన్ని 48 రోజులు చేస్తే మీ మనసు మీ వశమవుతుంది).
5. ఉదయం లేవగానే రెండు తులసి ఆకులను తినాలి.
6. మధ్యాహ్న భోజనంలో తప్పనిసరిగా నెయ్యి వేసుకోవాలి.
7. ప్రకృతి జీవన విధానాన్ని అనుసరించాలి.
8. ప్రతిరోజూ శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి.
9. సాయంత్రం పూట నూనెతో దీపం వెలిగించి దీపారాధన చేయాలి. (ఈ వ్యాయామం చేయడానికి దీపాన్ని వెలిగించి దాని ముందు కూర్చుని కొన్ని నిమిషాలు దీపాన్ని చూస్తూ ఉండాలి. దీన్ని 20 నిమిషాలు చేయాలి)
10. నిద్రించే రెండు గంటల ముందు ఫోన్‌ను, ల్యాప్‌టాప్‌ను చూడటం మానేయాలి.
11. కుదిరితే రోజులో ఉదయం లేదా సాయంత్రం సమయంలో యోగా లేదా ధ్యానం వంటివి 20 నుంచి 30 నిమిషాల వరకూ చేస్తూ ఉండండి.
ఇక్కడ పంచుకున్న సమాచారం అంతా సహజంగా సాధారణమైన పరిష్కారం. కొందరికీ ఈ పరిష్కారం సరిపోకపోవచ్చు. ఎక్కువ మంది ప్రయోజనం అందుకున్న విధానాన్ని మాత్రమే మీ ముందుంచాం. అనుభవాల ఆధారంగా ఎంచుకుని పరిశోధించిన ఫలితాలే ఇవి. కాబట్టి, దీర్ఘకాలిక లేదా తీవ్రమైన సమస్యలు ఉన్న వారు వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. మీ శరీర నిర్మాణానికి అనుగుణంగా అవసరమైన సమస్యలను వైద్యుడికి తెలియజేసి ప్రయోజనం పొందండి. ఇవన్నీ ప్రథమ చికిత్సగా మాత్రమే పరిగణించాలి. ఇక్కడ ఇచ్చిన వైద్య సూచనలను అనుసరించి ప్రయోజనం పొందండి.
సంబంధిత కథనం