ఖరీదైన పరుపులపై నిద్రపోయినా ఫలితం ఉండదు, నేలపై పడుకుంటేనే ఆ సమస్యలన్నీ పోతాయి-sleeping on expensive mattresses wont help sleeping on the floor will solve all those problems ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  ఖరీదైన పరుపులపై నిద్రపోయినా ఫలితం ఉండదు, నేలపై పడుకుంటేనే ఆ సమస్యలన్నీ పోతాయి

ఖరీదైన పరుపులపై నిద్రపోయినా ఫలితం ఉండదు, నేలపై పడుకుంటేనే ఆ సమస్యలన్నీ పోతాయి

Haritha Chappa HT Telugu

ఎంత ఖరీదైన పరుపులు వాడినా ఫలితం లేదు. మీకున్న వెన్నునొప్పి, నడుము, వెన్నెముక సమస్యలు తగ్గాలంటే నేలపై పడుకోవడమే ఉత్తమం.

పరుపుపై పడుకోవడం వల్ల వచ్చే సమస్యలు (Pexel)

నేలపై పడుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఖరీదైన పరుపులను వాడేవారు ఎక్కువైపోయారు. బెడ్ రూమ్‌లో అందమైన మంచాలు, వాటిపై వేలు ఖరీదు చేసే పరుపులు వేసుకొని పడుకుంటున్నారు. వాటితోనే అనేక రకాల ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని భావిస్తారు. నిజానికి నేలపై పడుకోవడం వల్లే ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. నేలపై పడుకోవడం వల్ల నడుము, వెన్నెముక ఆరోగ్యం మెరుగుపడుతుంది. వాటికి రక్తప్రసరణ కూడా సరిగా జరుగుతుంది.

నడుము, వెన్నెముక సమస్యలు

మీకు నడుము నొప్పి, వెన్నెముక సమస్యలను దూరం చేసుకోవాలనుకుంటే ప్రతిరోజూ పరుపుపై కాకుండా నేలపై పడుకునేందుకు ప్రయత్నించండి. నేలపై పడుకోవడం వల్ల ఎన్ని రకాల ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకోండి.

నేలపై పడుకోవడం వల్ల శరీర బరువు నేలపై సమానంగా వ్యాపిస్తుంది. దీనివల్ల వెన్నుముక నిర్మాణానికి ఎలాంటి హాని కలగదు. నడుము నొప్పి, వెన్ను సమస్యలు దీనివల్ల తీరిపోతాయి. మీరు నేలపై పడుకున్నప్పుడు శరీరానికి అదనపు మద్దతు లభిస్తుంది. ఇది వెన్నెముకను నిటారుగా ఉంచుతుంది. పొట్టపై ఎటువంటి ఒత్తిడి పడకుండా చూసుకుంటుంది.

నేలపై పడుకోవడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. శరీరానికి ఎంతో ఓదార్పు లభిస్తుంది. రక్తప్రసరణ అవయవాలకు సవ్యంగా జరిగితేనే ఆక్సిజన్ పోషకాల సరఫరా జరుగుతుంది. దానివల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది.

శరీరానికి విశ్రాంతి

నేలపై పడుకోవడం వల్ల కీళ్లపై పడే ఒత్తిడి కూడా చాలా వరకు తగ్గిపోతుంది. కాబట్టి మోకాలు, భుజాలు నొప్పి ఉన్నవారికి కూడా ఉపశమనం కలుగుతుంది. శరీరానికి ఎంతో ఓర్పుగా అనిపిస్తుంది. అలాగే పూర్తి శరీరానికి విశ్రాంతి దక్కుతుంది.

నిద్రపడుతుంది

ఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతిరోజూ నేలపై పడుకునేందుకు ప్రయత్నించండి. నేలపై పడుకున్న వెంటనే శరీరానికి ఎంతో హాయిగా అనిపిస్తుంది. దాంతో గాఢ నిద్రలోకి జారుకునే అవకాశం ఉంది. ఒత్తిడి తగ్గి మానసిక ఆరోగ్యం కూడా ఎంతో మెరుగుపడుతుంది.

నేలపై పడుకోవడం వల్ల కండరాలకు కూడా మద్దతు దక్కుతుంది. ఇది కండరాల ఒత్తిడిని, నొప్పిని తగ్గిస్తుంది. కండరాలు విశ్రాంతి తీసుకునే విధంగా శరీర బరువు నేలపై పరుచుకుంటుంది. కాబట్టి పరుపులు కన్నా నేలపై పడుకోవడం అనేది ఎంతో ఉత్తమమైన పద్ధతి. ఒక రెండు రోజులు మీరు నేలపై పడుకుని చూడండి. మీకు ఖచ్చితంగా ఎంతో హాయిగా అనిపిస్తుంది.

(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)

హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం