skipping breakfast: ఉదయాన్నే అల్పాహారం తినకపోతే బరువు తగ్గుతామా, లేదా?
skipping breakfast: బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వాళ్లు ఉదయం అల్పాహారం తినడం లాభదాయకం అనుకుంటారు. అది నిజమేనా కాదా తెలుసుకుందాం.
సోషల్ మీడియాల్లో చక్కర్లు కొట్టే రకరకాల డైట్ ప్లాన్‌లను ఫాలో అయ్యే వారి సంఖ్య ఈ మధ్య కాలంలో ఎక్కువైంది. ఉదయాన్నే అల్పాహారం చేయడం అనేది ఇప్పుడు కొందరికి అత్యావశ్యకం. అయితే కొందరికి ఆప్షనల్‌గా మారిపోయింది. ఆరోగ్యంపై శ్రద్ధ పెరగడం, ఆన్‌లైన్‌లో బోలెడంత సమాచారం అందుబాటులో ఉండటంతో ఎవరికి నచ్చిన దారుల్ని వారు ఫాలో అయిపోతున్నారు. అయితే వాటిలో సైంటిఫిక్‌గా కరెక్ట్ అయినవి ఏవో అర్థం కాక అయోమయంలో పడుతున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్ పర్సనల్ న్యూట్రీషనిస్ట్ అయిన రుజుత దివాకర్ బ్రేక్ ఫాస్ట్ విషయంలో తన అనుభవాల్ని షేర్ చేసుకున్నారు. ఉదయాన్నే అల్పాహారం తినడాన్ని మాత్రం అస్సలు మానేయొద్దని చెబుతున్నారు. ఈ విషయాల్నిఆమె తన ఇన్‌స్టాగ్రాం రీల్ ద్వారా రాసి పంచుకున్నారు.
‘బ్రేక్ ఫాస్ట్‌ని మానేయడం అనేది మంచి ఆలోచన కానేకాదు. ఇది క్రమేపీ ఆ రోజులో మరింత ఎక్కువగా ఆహారాన్ని తినేలా ప్రేరేపిస్తుంది. అలాగే ఎక్కువ కెఫిన్ తీసుకోవడం వల్ల ఎక్కువ చురుకుదనంతో ఉండి ఎక్కువ క్రేవింగ్స్ అవుతాయి. ఇది మీరు ఆరోగ్యంగా ఉండేందుకు ఏ మాత్రం సహాయ పడదు. అలాగే ఎక్కువ బరువును తొందరగా తగ్గిపోవడానికీ ఏ మాత్రం పనికిరాదు. కాబట్టి ఏం తిన్నా ఆలోచించి తెలివిగా తినండి’ అంటూ రాసుకొచ్చారు.
‘ఈ మధ్య కాలంలో జరిగిన కొన్ని పరిశోధనల్లో వెల్లడైన విషయాల్ని బట్టి ఇది చెప్పాల్సి వస్తోంది. ఉదయాన్నే ఎన్ని కేలరీలను తీసుకున్నారు? సాయంత్రం ఎన్ని కేలరీలను తీసుకున్నారు? అనే విషయాన్ని ఈ స్టడీల్లో పరిశీలించారు. ఉదయాన్నే టిఫిన్ తినే వారితో పోలిస్తే తినని వారు సాయంత్రానికల్లా ఎక్కువ కేలరీల ఆహారాన్ని తీసుకున్నారు. స్టడీలో ఈ విషయాన్ని గుర్తించారు. అంటే బరువు తగ్గాలని మీరు చేస్తున్న పని వల్ల బరువు పెరిగే అవకాశాలు ఎక్కువ అవుతున్నాయి. అందుకనే తప్పకుండా ఉదయపు అల్పాహారాన్ని తినేందుకే ప్రయత్నించండి. అప్పుడే బరువు తగ్గేందుకు మీరు చేసే ప్రయత్నాలు ప్రభావవంతంగా పని చేసే అవకాశాలు ఉంటాయి. ఉదయపు బ్రేక్‌ఫాస్ట్ చేయని వారిలో రాత్రిళ్లు పీజ్జాలు, పాస్తాలు లాంటి వాటిపైకి ఎక్కువగా దృష్టి వెళ్లిపోతుంది. అలాగే ఫ్రిజ్లో ఉన్న స్నాక్స్ అన్నీ తినేయాలని అనిపిస్తుంది. ఈ క్రేవింగ్స్ వల్ల రాత్రి పూట వద్దన్నా శరీరంలోకి ఎక్కువగా కేలరీలు చేరిపోతాయి. ఎంతకీ బరువు తగ్గక పోవడంతో వారి ఆత్మవిశ్వాసం దెబ్బతిని మళ్లీ సాధారణ భోజనపు అలవాట్లలోకి వచ్చేస్తున్నారు.’ అంటూ ఆమె చెప్పుకొచ్చారు.