Sitting Long hours: కదలకుండా ఒకే చోట కూర్చోవడం మిమ్మల్ని మెల్లగా చంపేస్తుంది, జాగ్రత్త
Sitting Long hours: నిశ్చల జీవనశైలి కష్టం లేకుండా సుఖంగా ఉండవచ్చు, కానీ అది మీకు ప్రాణాంతక పరిస్థితులను తెచ్చిపెడుతుంది. కదలకుండా కూర్చోవడం అనేది మెల్లమెల్లగా మీ ప్రాణాలను తీసేస్తుంది.
Sitting Long hours: ఆరోగ్యకరమైన ఆహారం తినడం ఎంత ముఖ్యమో... వ్యాయామం చేయడం కూడా ఎక్కువ కాలం జీవించడానికి అంతే ముఖ్యం. కానీ ఎంతోమంది కదలకుండా గంటలపాటు కూర్చోవడానికి ఆసక్తి చూపిస్తారు. సినిమాలు, టీవీలు చూస్తూ ఎక్కువసేపు కదలకుండా ఉంటారు. జర్నల్ ఆఫ్ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ లో ప్రచురించిన ఒక పరిశోధన ప్రకారం ఇలా గంటల పాటు కదలకుండా కూర్చోవడం వల్ల అకాలమరణం సంభవించే అవకాశం 30 శాతం పెరుగుతుందని తేలింది. నిశ్చల జీవనశైలికి, మరణానికి మధ్య అనుబంధం ఉందని ఈ పరిశోధన తేల్చింది. ఎక్కువసేపు శారీరకంగా కష్టపడే వారితో పోలిస్తే, ఎక్కువసేపు కూర్చొని గడిపే వ్యక్తులు అనేక రకాల ఆరోగ్య సమస్యల బారిన పడి మరణించే అవకాశం ఎక్కువని పరిశోధన కర్తలు చెబుతున్నారు.
ఒకే చోట ఎక్కువసేపు కదలకుండా కూర్చోవడం వల్ల శక్తి ఖర్చు అవ్వదు. కండరాలు సంకోచిస్తాయి. రక్తప్రసరణ సరిగా జరగదు. గ్లూకోజ్ జీవక్రియను సరిగా జరగనివ్వదు. దీనివల్ల ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం పడుతుంది. అతి తక్కువ కాలంలోనే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం పెరుగుతుంది. ముఖ్యంగా కండరాల క్షీణత, ఎముకలు బలహీనపడడం, గుండెజబ్బులు, మధుమేహం వంటివి వస్తాయి.
డయాబెటిస్
ఎక్కువసేపు కూర్చునే వాళ్ళలో కొవ్వును విచ్ఛిన్నం చేసే ఎంజైములు పనిచేసే స్థాయి తగ్గిపోతుంది. ఈ ఎంజైమ్ చురుకుగా లేకపోతే ట్రైగ్లిజరైడ్స్ పెరిగిపోతాయి. రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. దీనివల్ల బరువు పెరిగిపోతారు. ఇన్సులిన్ నిరోధకత ఏర్పడుతుంది. ఈ పరిస్థితి వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి ఊబకాయం బారిన పడి డయాబెటిస్ వస్తుంది. ఇది ఎప్పటికైనా ప్రాణాంతకమే.
అధికంగా కూర్చునే వారిలో కండరాల పని తక్కువగా ఉంటుంది. దీని వల్ల అవి సంకోచిస్తాయి. కండరాల్లో నిల్వచేసిన ప్రోటీన్ విచ్ఛిన్నమైపోతుంది. ఇది కండరాల నష్టానికి దారితీస్తుంది. కండర ద్రవ్యరాశి తగ్గిపోయి బలం లేకుండా పోతుంది. చిన్న వస్తువులు పట్టుకోలేరు. ఇది కండరాల క్షీణతకు దారితీస్తుంది.
రక్తనాళాలు కుచించుకుపోయి
గంటల పాటు కూర్చునే వారి కాళ్ళల్లో రక్తనాళాలు కుచించకు పోతాయి. దీనివల్ల రక్తపోటు పెరిగిపోతుంది. ఎప్పుడైతే కాళ్లకు రక్త ప్రవాహం తగ్గుతుందో, గుండె కూడా ఇబ్బంది పడుతుంది. రక్తం గడ్డ కట్టవచ్చు కూడా. దీనివల్ల గుండెపోటు ఏ క్షణమైనా రావచ్చు. గుండెకు రక్తాన్ని ఆరోగ్యంగా పంప్ చేయాలంటే కాళ్లకు ఎక్కువ పని చెప్పాలి. అందుకే వాకింగ్ చేయమని చెబుతారు వైద్యులు.
ఎక్కువసేపు కూర్చునే వారిలో వెన్నుముక, కీళ్లు లిగమెంట్లు, డిస్కులు, కండరాలు... ఒత్తిడికి లోనవుతాయి. నడుము నొప్పి వస్తుంది. మెడ నొప్పులు, కండరాల ఒత్తిడి, మహిళలకు గర్భాశయంలో నొప్పి వంటివి వస్తాయి.
గుండె జబ్బులు
ఎవరైతే గంటల పాటు కదలకుండా కూర్చుంటారో వారిలో హృదయ సంబంధిత రోగాలు వచ్చే అవకాశం 147% పెరుగుతున్నట్టు చెబుతున్నాయి. ఊబకాయం, అధిక బరువు లేనివారు ఇలా గుండె జబ్బుల ప్రమాదం బారిన పడే అవకాశం ఉంది. శరీరంలోని ప్రధాన అవయవాలు చుట్టూ కొవ్వు పేరుకుపోయి ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి గుండె ఆరోగ్యం కోసం ప్రతిరోజు గంట పాటు వాకింగ్ చేయడం అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా గంటలపాటు కూర్చోకుండా ప్రతి గంటకు ఒకసారి లేచి ఐదు నిమిషాల పాటు వేగంగా నడవడం చేయాలి .
ఎక్కువగా కూర్చోవడం వల్ల కాలి ఎముకలపై బరువు పెరుగుతుంది. ఇది క్రమంగా ఎముక నష్టానికి దారితీస్తుంది. అలాగే ఆస్టియోపొరోసిస్ వంటి వ్యాధి కూడా రావచ్చు.
శక్తి హీనత
ఎక్కువసేపు నిశ్చల జీవన శైలికి అలవాటు పడిన వారిలో చక్కెర, కొవ్వు విచ్చిన్నత తగ్గిపోతుంది. దీనివల్ల కండరాలకు రక్త ప్రవాహం తగ్గుతుంది. ఆక్సిజన్ తక్కువగా అందుతుంది. దీనివల్ల తీవ్రంగా అలసిపోయినట్టు అనిపిస్తారు. శక్తి హీనంగా అనిపిస్తుంది. ప్రతి అరగంటకు ఒకసారి ఇటూ అటూ కదలడం వల్ల శక్తి ఉత్పత్తి పెరుగుతుంది.
సిరల ఆరోగ్యం
మన శరీరంలో సిరలు చాలా ముఖ్యమైనవి. రక్తం సరిగా ప్రసరించాలంటే సిరలు ఆరోగ్యంగా ఉండాలి. గంటల పాటు కదలకుండా కూర్చోవడం వల్ల కాలి సిరల్లో రక్తం పేరుకుపోయి వాపు వస్తుంది. ఒకే చోట రక్తం పేరుకుపోవడం వల్ల సిరలు వ్యాకోచిస్తాయి. వాపు, నొప్పి వంటివి వస్తాయి. గుండెకు రక్తాన్ని అందించడంలో కూడా ఇవి విఫలమవుతాయి. కాబట్టి ఎక్కువ సేపు కూర్చోవడం మాని ఇటు అటు నడవడం అలవాటు చేసుకోండి.