రోజంతా కూర్చుని పని చేస్తున్నారా? శరీరంతో పాటు మెదడు కూడా ప్రమాదంలో పడినట్లేనని చెబుతున్న అధ్యయనాలు!-sitting at your desk all day studies suggest your brain is at risk too not just your body ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  రోజంతా కూర్చుని పని చేస్తున్నారా? శరీరంతో పాటు మెదడు కూడా ప్రమాదంలో పడినట్లేనని చెబుతున్న అధ్యయనాలు!

రోజంతా కూర్చుని పని చేస్తున్నారా? శరీరంతో పాటు మెదడు కూడా ప్రమాదంలో పడినట్లేనని చెబుతున్న అధ్యయనాలు!

Ramya Sri Marka HT Telugu

రోజంతా కుర్చీకే అతుక్కుపోయి పని చేస్తున్నారా? అలసట, ఒళ్లు నొప్పులు మాత్రమే కాదు మీ మెదడు సైతం ప్రమాదంలో పడుతోందట. తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్న భయంకరమైన నిజాలు తెలిస్తే షాక్ అవుతారు. అవేంటో తెలుసుకుని జాగ్రత్త పడండి.

రోజంతా కూర్చుని పని చేయడం వల్ల ఒత్తిడికి గురవుతున్న వ్యక్తి (Freepik)

కూర్చొని పని చేయడం వల్లన మీ శరీరం, మెదడు రెండూ ప్రమాదంలో పడినట్లేనని అధ్యయనాలు చెబుతున్నాయి. పైకి చురుగ్గా కనిపించినప్పటికీ, మీ డెస్క్ వద్ద లేదా సోఫాలో ఎక్కువ సేపు కూర్చొని పనిచేసే వాళ్ల మెదడు పనితీరు క్రమంగా దెబ్బతింటుందట. కొత్త పరిశోధన ప్రకారం, ఇది జ్ఞాపకశక్తి, అభిజ్ఞానానికి సంబంధించిన ప్రాంతాలలో కుంచించుకుపోవడానికి కారణం కావొచ్చు.

మీరు క్రమం తప్పకుండా వ్యాయామం చేసినప్పటికీ, ఎక్కువసేపు కూర్చోవడం మీ మెదడుకు హాని కలిగిస్తుందని పరిశోధన సూచిస్తుంది. ఏడు సంవత్సరాల అధ్యయనంలో ఎక్కువగా కూర్చుని పనిచేసే వారిలో మెదడు కుంచించుకుపోవడం, మానసిక క్షీణత కనిపిస్తాయని తెలిసింది. ఎక్కువగా కూర్చోవడం వల్ల కలిగే నష్టాన్నిక్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం వల్ల తిరిగి మార్చవచ్చనే ఆలోచనను ఈ రీసెర్చ్ ఛాలెంజ్ చేస్తుంది.

కూర్చోవడం వల్ల మెదడు ఆరోగ్యంపై ప్రభావం

వాండర్‌బిల్ట్ యూనివర్సిటీ మెమరీ అండ్ అల్జీమర్స్ సెంటర్ పరిశోధకులు యావరేజ్‌గా 71 సంవత్సరాలున్న 404 మంది వృద్ధులను ఏడు సంవత్సరాలకు పైగా వారి చేసే పనులను రిస్ట్ మానిటర్‌ల సహాయంతో ట్రాక్ చేశారు. జర్నీ, డెస్క్ ఉద్యోగాలు, భోజనం, విశ్రాంతి సమయంతో పాటు రోజుకు సగటున 13 గంటల పాటు వీరిని మానిటర్ చేసేవారు.

కూర్చోవడం వల్ల మెదడు ఆరోగ్యంపై ప్రభావం
కూర్చోవడం వల్ల మెదడు ఆరోగ్యంపై ప్రభావం (Pixabay)

ఎక్కువగా కూర్చున్న వారికి జ్ఞాపకశక్తి, అల్జీమర్స్‌ రావడానికి కారణమైన మెదడు ప్రాంతాలలో కుచించుకుపోవడం, జ్ఞాపకశక్తి పరీక్షలలో పేలవమైన పనితీరు కనిపించింది. అల్జీమర్స్‌లో మొదట క్షీణించే కీలకమైన మెదడు ప్రాంతమైన హిప్పోకాంపల్ వాల్యూమ్ వేగంగా కోల్పోవడాన్ని కూడా గమనించారు.

అధ్యయనం వెల్లడించిన విషయాలు

అల్జీమర్స్ ప్రమాదాన్ని పెంచే APOE-ε4 జన్యు వైవిధ్యాన్ని కలిగి ఉన్నవారికి కూర్చోవడం మెదడు ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపిస్తుంది. ఎక్కువ సేపు కూర్చున్న APOE-ε4 క్యారియర్‌లు, ఇలాంటి కూర్చునే అలవాట్లు ఉన్న నాన్-క్యారియర్‌లతో పోలిస్తే, ముఖ్యంగా ఫ్రంటల్, ప్యారిటల్ లోబ్స్‌లో మెదడు పదార్థంలో గణనీయంగా తగ్గుదలని కనిపించింది.

మునుపటి అధ్యయనాలు కూర్చోవడాన్ని గుండె జబ్బులు, డయాబెటిస్, క్యాన్సర్‌తో ముడిపెట్టాయి. ఈ పరిశోధన ఇప్పుడు ఆ జాబితాకు మెదడు ఆరోగ్యాన్ని కూడా జోడిస్తుంది. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల మెదడు రక్త నాళాలు దెబ్బతినవచ్చు, మంట పెరగవచ్చు. మెదడు కణాల కనెక్షన్లకు అంతరాయం కలిగించవచ్చు.

మీ మెదడును ఎలా రక్షించుకోవాలి

టెక్నాలజీ, స్మార్ట్‌ఫోన్‌లు, AI, రిమోట్ ప్రతిదీ రోజువారీ జీవితాన్ని మరింత సౌకర్యవంతంగా మారుస్తుండటం వల్ల ప్రజలు ఎక్కువసేపు కూర్చొనే ఉంటున్నారు. అధ్యయనంలో ఉదహరించిన పరిశోధన ప్రకారం, సగటు వృద్ధుడు రోజుకు తొమ్మిది గంటలకు పైగా కూర్చుంటాడు. మెదడు ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్న వారికి, కూర్చునే సమయాన్ని తగ్గించడం చాలా ముఖ్యం. ఇది చాలా చురుగ్గా ఉండటానికి కూడా తోడ్పడుతుంది. స్టాండింగ్ డెస్క్‌లు, క్రమం తప్పకుండా విరామాలు, మరిన్ని రోజువారీ కార్యకలాపాలను చేర్చడం వల్ల నిజమైన మార్పు వస్తుంది.

మీ మెదడు వ్యాయామం చేస్తే ఆరోగ్యంగా ఉంటుందనే ఆలోచనను వదిలి వ్యవహరించండి. ఎక్కువగా కదలడం, తక్కువ కూర్చోవడం వల్ల కూడా ప్రయోజనం ఎక్కువగా పొందొచ్చు.

రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.