Sunday Motivation: చిరునవ్వు, మౌనం... ఈ రెండూ గొప్ప ఆయుధాలు. అవి మీ దగ్గర ఉన్నంతవరకు మీకు ఓటమి ఉండదు. అనువు కానీ చోట అధికుల మనరాదు... అని ఎప్పుడో చెప్పారు పెద్దలు. ఎక్కడపడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు డబ్బాలో రాలేసినట్టు వాగుతూ ఉంటే విలువ ఉండదు. రోజులో ఎక్కువ సమయం మౌనంగా ఉంటేనే మంచిది. మౌనానికి ఉన్న శక్తి ఇంతా అంతా కాదు... గుండె పగిలే బాధను కూడా మౌనం చాటున దాచేయొచ్చు. నిస్సహాయ స్థితిలోంచి వచ్చే బాధను మౌనం వెనుక కట్టి పడేయొచ్చు.
చిన్న చిరునవ్వు ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపిస్తే, మౌనం ఎన్నో సమస్యలను మన దగ్గరికి రాకుండా అడ్డుకుంటుంది. గౌతమ్ బుద్ధుడు కూడా మౌనం అనే ధ్యానాన్ని పాటించమని చెప్పారు. మాటల కోటలను కూల్చే బాణం మౌనం. ఒక వ్యక్తి మౌనంగా ఉంటాడంటే అతడు చేతకాని వాడని, చేవలేదని భావించకండి. అతని మౌనంలో పెద్ద సముద్రమే దాగి ఉండవచ్చు. కొన్నిసార్లు వాదించి బాధపడే కన్నా మౌనంగా ఉండడమే మంచిది. అయితే ఏ సమయంలో మాట్లాడాలో, ఏ సమయంలో మౌనంగా ఉండాలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
ఒక విషయం గురించి తెలియకపోతే మాట్లాడకుండా ఉండడం మౌనం. ఒకవేళ ఆ విషయం గురించి తెలిసినా, అనవసర సందర్భాల్లో మాట్లాడకుండా ఉండడమే జ్ఞానం. తెలిసీ తెలియక అనవసరంగా వాడడం మూర్ఖత్వం. బదులు దొరకని ఎన్నో ప్రశ్నలకు సైతం మౌనం బదులు ఇవ్వగలదు.
నీ జీవితం ప్రశాంతంగా ఉండాలంటే మౌనాన్ని సాధన చేయండి. గొప్ప గొప్ప ఆలోచనలు మౌనంగా ఉన్నప్పుడే రూపు దాల్చుకుంటాయి. గొప్పతనం అంటే ఏదో సాధించడం, సంపాదించడం మాత్రమే కాదు. మన మాటల వల్ల లేదా మన చేతల వల్ల ఎవరినీ బాధ పెట్టకుండా ఉండకుండా చూసుకోవాలి. కాబట్టి మన మాటలపై అదుపు సాధించాలంటే ముందుగా మౌనాన్ని ఆశ్రయించాలి.
మౌనం గొప్పతనం ప్రాచీన కాలం నుంచి ప్రతి ఒక్కరికీ తెలుసు. అందుకే మౌన వ్రతం పుట్టుకొచ్చింది. వారంలో కనీసం ఒక్కరోజైనా మౌనవ్రతం పాటిస్తే మనసు, శరీరం స్వచ్ఛంగా మారుతాయి అని అంటారు. అందుకే మౌన వ్రతాన్ని ఆచరణలోకి తీసుకొచ్చారు.
మౌనంగా ఉండే వారిలో గుండె సమస్యలు వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుంది. వారు ఆరోగ్యపరంగాను ఎంతో చక్కగా ఉంటారు. మెదడు కంట్రోల్ లో ఉంటుంది. ఆలోచనలు కూడా అదుపు తప్పకుండా ఉంటాయి. రోజులో రెండు నుంచి మూడు గంటలు మౌనంగా ఉండేందుకు ప్రయత్నించండి. లేదా వారానికి ఒక రోజంతా మౌనంగా ఉండేందుకు ప్రయత్నించండి. అప్పుడే తెలుస్తుంది మౌనం ఒక పెద్ద వరం అని.
మౌనంగా ఉండడం వల్ల భావోద్వేగాలన్నీ అదుపులో ఉంటాయి. విపరీత సంతోషం, విపరీత కోపం రెండూ రాకుండా ఉంటాయి. దీనివల్ల సమస్యలు రావు. అతిగా మాట్లాడడం వల్లే ప్రశాంతత చెడిపోతుంది. మౌనంగా ఉంటే ఎలాంటి నెగటివ్ ముద్ర మీ మీద పడదు. మౌనంగా ఉంటే మంచిదని... మాట్లాడాల్సిన సమయంలో కూడా మౌనంగా ఉండకండి. కేవలం అవసరం మేరకే నోరు తిప్పడం మంచిది. మౌనంగా ఉండే వారిలో స్వీయ కంట్రోల్ అధికంగా ఉంటుంది. సెల్ఫ్ కంట్రోల్ అధికంగా ఉండే వ్యక్తులు తప్పులు తక్కువగా చేస్తారు. కాబట్టి మీరు రోజులో కనీసం రెండు గంటలు లేదా వారంలో ఒకరోజు మౌనవ్రతం చేసేందుకు ప్రయత్నించండి. ఆరోగ్యంలో వచ్చే మార్పులను మీరే గమనించండి.