Protein Deficiency: ఈ లక్షణాలు మీలో ఉన్నాయంటే.. మీకు ప్రొటీన్ల లోపం ఉన్నట్టే వెంటనే జాగ్రత్త పడండి!
Protein Deficiency: మానవ శరీరానికి అవసరమైన పోషకాలలో ప్రోటీన్ ఒకటి. ఇది కండరాలు, కణజాలాలు, ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ప్రొటీన్ లోపాన్ని నిర్లక్ష్యం చేస్తే చాలా రకాల సమస్యలను తెచ్చిపెడుతుంది. ఈ లక్షణాలు మీలో ఉన్నాయంటే.. మీకు ప్రొటీన్ల లోపం ఉన్నట్టే! జాగ్రత్తలు తీసుకోక తప్పదని తెలుసుకోండి.
మన శరీరంలో దాదాపు పదివేలకు పైగా రకరకాల ప్రొటీన్లు ఉంటాయి. తల వెంట్రుకల నుంచి ఎముకల వరకు శరీరంలోని ప్రతి భాగంలో ప్రోటీన్ ఉంటుంది. ఇవి కణాల పెరుగుదల, మరమ్మత్తు, అభివృద్ధికి సహాయపడతాయి. ప్రోటీన్లు అమైనో ఆమ్లాలు అని పిలువబడే అణువుల కలయికతో తయారవుతాయి. శరీరం సరిగ్గా పనిచేయడానికి 20 వేర్వేరు అమైనో ఆమ్లాలు తప్పక అవసరం. వీటిలో శరీరం సొంతంగా 11 ఆమ్లాలను ఉత్పత్తి చేసుకుంటుంది. మిగిలిన 9 అమైనో ఆమ్లాలను మనం తినే ఆహారం ద్వారా అందాల్సి ఉంటుంది. లేదంటే ప్రొటీన్ల లోపం తలెత్తి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
ప్రోటీన్ లోపం శరీరంపై అనేక విధాలుగా ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. ఈ సమస్యను సకాలంలో గుర్తించి పరిష్కరించకపోతే ఎముకలు బలహీనపడి దీర్ఘకాలికంగా చాలా సమస్యలు మొదలవుతాయి. శరీరంలో ప్రోటీన్ లోపాన్ని సూచించే ప్రధాన లక్షణాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.
కండరాలు బలహీనమైతాయి:
ప్రొటీన్ లోపం వల్ల శరీరంలో కండరాలు బలహీనపడతాయి. శరీరం అవసరమైన ప్రొటీన్ అందుకోలేకపోతే, కండరాలు చిన్నవైపోతాయి, శక్తి తగ్గుతుంది. దీర్ఘకాలికంగా కీళ్లు, కండరాల్లో నొప్పి, మంట వంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయి.
జుట్టు రాలిపోతుంది:
ప్రోటీన్ లోపం జుట్టు రాలడానికి దారితీస్తుంది. కెరాటిన్ అనే ప్రోటీన్ జుట్టు సంరక్షణకు సహాయపడుతుంది. అయితే ఇది లోపించినప్పుడు అధికంగా జుట్టు రాలడం, చుండ్రు మొదలైన వాటికి దారితీస్తుంది. దీర్ఘకాలికంగా బట్టతల వంటి ఇతర తీవ్రమైన సమస్యలకు కూడా సూచిక కావచ్చు.
చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది:
ప్రొటీన్ లోపం చర్మాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.చర్మం పొడిబారడం, పొట్టు రాలడం వంటివి ప్రోటీన్ లోపం లక్షణాలు. దద్దుర్లు రావడం, గాయాలు తగ్గకపోవడం కూడా ఆలోచించాల్సిన విషయాలే.
తరచూ ఆకలి వేస్తుంది:
తరచుగా ఆకలి వేయడం, ఊరికే అలసటగా అనిపించడం కూడా ప్రోటీన్ లోపం లక్షణాలు. ఇలా అనిపించడం వల్ల ఎక్కువ ఆహారం తీసుకని ఊబకాయం బారిన పడే అవకాశాలున్నాయి. ఈ సమస్యలు తరచూ కలుగుతుంటే నిర్లక్ష్యం చేయకండి. ప్రొటీన్ టెస్ట్ చేయించుకోండి.
అధిక అలసట కలుగుతుంది:
శరీరంలో ప్రోటీన్ లోపం ఉంటే వ్యక్తి త్వరగా అలసిపోయి బలహీనంగా కనిపిస్తాడు. కండరాలు శక్తిని కోల్పోతాయి. సాధారణ కార్యకలాపాలు చేయడం కష్టమవుతుంది. ఈ పరిస్థితి జీవన నాణ్యతను ప్రభావితం చేస్తుంది. నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేయించుకోండి.
రోగనిరోధక శక్తి తగ్గుతుంది:
ప్రోటీన్ లోపం శరీరంలో రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది. ఫలితంగా కాలక్రమేణా, వ్యాధితో పోరాడే శరీర సామర్థ్యం క్షీణించిపోతుంది. శరీరం వ్యాధులకు గురవుతుంది.
మానసిక పరిస్థితులపై కూడా ప్రభావం:
ప్రోటీన్ లోపం తరచుగా మానసిక స్థితి మార్పులకు దారితీస్తుంది. ఇది ఆలోచనా సామర్థ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. శ్రద్, ఏకాగ్రత లోపానికి దారితీస్తుంది.కనుక ముందుగానే జాగ్రత్త పడండి. ప్రొటీన్ లోపం వల్ల మెమరీ, మూడ్‌లో మార్పులు కూడా కనిపించవచ్చు. ఎందుకంటే ఇవి నరాల వ్యవస్థకు అవసరమైన పోషకాలను అందిస్తాయి. వీటి లోపం వల్ల మూడ్ స్వింగ్స్, మతిమరుపు వంటి సమస్యలు కూడా తలెత్తవచ్చు.
కణాల మరమ్మతు లోపిస్తుంది:
ప్రొటీన్ కణాల మరమ్మతు కోసం చాలా అవసరం అవుతుంది. ప్రొటీన్ లోపం వల్ల కణాల పనితీరు దెబ్బతిని శరీరానికి అయిన గాయాలు, పగుళ్లు వంటివి త్వరగా తగ్గవు.