Water Temperature: వేసవిలో వేడి నీరు తాగాలా, చల్లటి నీరు తాగాలా? ఏవి ఎప్పుడు తాగితే మంచిదో తెలుసుకోండి!-should you drink hot water or cold water in summer find out how water temperature affects health ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Water Temperature: వేసవిలో వేడి నీరు తాగాలా, చల్లటి నీరు తాగాలా? ఏవి ఎప్పుడు తాగితే మంచిదో తెలుసుకోండి!

Water Temperature: వేసవిలో వేడి నీరు తాగాలా, చల్లటి నీరు తాగాలా? ఏవి ఎప్పుడు తాగితే మంచిదో తెలుసుకోండి!

Ramya Sri Marka HT Telugu

Water Temperature: ఆరోగ్యంగా ఉండటానికి నీరు తాగడం చాలా ముఖ్యం. కానీ ఈ వేసవిలో చల్లని నీరు తాగాలా లేక వేడి నీరా? ఏ నీటిని ఎప్పుడు తాగితే మంచిది? నీటి ఉష్ణోగ్రత ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? వివరంగా తెలుసుకుందాం రండి..

వేసవిలో వేడి నీరు ఎప్పుడు తాగాలి చల్లటి నీరు ఎప్పుడు తాగాలి? (shutterstock)

ఆరోగ్యంగా ఉండాలంటే నీరు చాలా అవసరం. శరీరానికి తగినంత నీరు అందకపోతే ఎన్నో రకాల ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడతారు. మరీ ముఖ్యంగా వేసవిలో సూర్యుడి తాపం పెరిగేకొద్దీ శరీరానికి నీటి అవసరం కూడా పెరుగుతుంది. అందుకని ఎండాకాలం పోయే వరకూ ఎంత ఎక్కువ నీరు తాగిచే అంత మంచిది. అయితే అవి వేడి నీరు అయి ఉండాలా లేక చల్లటి నీరా? వేసవిలో నీటి ఉష్ణోగ్రత ఎలా ఉండాలి? అది మన శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? ఇలాంటి సందేహాలు చాలా మందికి కలుగుతుంటాయి. మీ మనసులో కూడా ఇవే ప్రశ్నలు మెదులుతుంటే ఇక్కడ మీకు సమాధానం దొరుకుతుంది.

గోరు వెచ్చటి నీరు మంచివే కానీ..

సాధారణంగా గోరు వెచ్చటి నీరు ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలు తగ్గుతాయి. శరీరంలోని, రక్తనాళాల్లోని విష పదార్థాలన్నింటినీ బయటికి పంపించగల శక్తి వేడి నీటికి ఉంటుంది. అంతే కాదు వేడి నీటి తాగడం వల్ల చర్మానికి చాలా మేలు కలుగుతుంది. బరువు తగ్గాలనుకునే వారి విషయంలో అయితే వేడి నీరు అమృతం లాంటివని చెప్పచ్చు. ఇన్ని ప్రయోజనాలున్నప్పటికీ ఎండలు మండుతున్న సమయంలో వేడి నీటిని తాగగలమా? తాగితే దాహం తీరుతుందా? ఛాన్సే లేదు కదా.

ఆరోగ్యం మీద శ్రద్ధ వహించేవారు, సోషల్ మీడియాలో కొందరు అన్ని కాలాల్లోనూ వేడి నీటిని మాత్రమే తాగాలంటారు. చల్లటి నీరు తాగకూడదని సలహా ఇస్తారు. కానీ ఇది పూర్తిగా వాస్తవం కాదని తెలుసుకోండి. ఎందుకంటే.. నీటి విషయంలో ప్రతి ఉష్ణోగ్రతకీ ఒక ప్రాధాన్యత ఉంటుంది. అన్ని ఉష్ణోగ్రతల నీటికి ప్రయోజనాలు ఉంటాయి. ఇది చాలా మందికి తెలియని విషయం. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే.. ఏ సమయంలో ఏ ఉష్ణోగ్రత కలిగిన నీరు తాగిచే శరీరానికి ప్రయోజనం కలుగుతుందా అని! ఈ వేసవిలో ఏ సమయంలో ఏ ఉష్ణోగ్రత నీరు త్రాగాలో తెలుసుకుందాం రండి..

వేసవిలో ఏ సమయంలో ఏ ఉష్ణోగ్రత గల నీరు తాగాలి?

చల్లని నీరు ఎప్పుడు త్రాగాలి?

  • వేసవిలో చల్లని నీరు త్రాగకూడదని చాలా మంది చెబుతారు. కానీ వ్యాయామం తర్వాత చల్లని నీరు త్రాగడం వల్ల కండరాలు చక్కటి ఉపశమనం పొందుతాయి. నొప్పిని తగ్గించడానికి ఈ నీరు సహాయపడుతుంది.
  • ఎండలో తిరిగి వచ్చిన తర్వాత కూడా చల్లటి నీరు తాగచ్చు. కాకపోతే బయటి నుంచి వచ్చిన వెంటనే తాగకూడదు. అలాగే బాగా చల్లటి నీరు తాగకూడదని గుర్తుంచుకోండి. కాసేపు రిలాక్స్ అయిన తర్వాత సాధారణ ఉష్ణోగ్రత కలిగిన నీటిని తాగండి. అలాగే ఒకేసారి ఎక్కువ నీటిని తాగకండి. క్రమంగా కొంచెం కొంచెం నీరు తాగుతూ ఉండండి.
  • చల్లని నీటి వల్ల రక్తనాళాలు కుంచించుకుపోతాయి, జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. కాబట్టి భోజనం తర్వాత చల్లని నీరు త్రాగకూడదు.

గది ఉష్ణోగ్రత నీరు

ఎల్లప్పుడూ గది ఉష్ణోగ్రతలో ఉన్న నీటిని తాగడం మంచిది. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడానికి, జీర్ణక్రియకు సహాయపడుతుంది. అలాగే ఇది శరీర వ్యవస్థను సరిగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. వీటిని ఎప్పుడైనా, ఎక్కడైనా తాగచ్చు.

వెచ్చని నీరు ఎప్పుడు త్రాగాలి?

వెచ్చని నీరు జీర్ణక్రియకు చాలా మంచిది. దీన్ని త్రాగడం వల్ల శరీరంలోని విషపదార్థాలు బయటకు వెళ్ళడానికి సహాయపడుతుంది. జీవక్రియ కూడా బలపడుతుంది. కాబట్టి వేసవిలో ప్రతి రోజూ ఉదయం, అలాగే భోజనం తర్వాత ఎల్లప్పుడూ వెచ్చని నీరు త్రాగాలి. నీరు బాగా వేడిగా ఉండకుండా గోరు వెచ్చగా ఉండేలా చూసుకోండి.

Ramya Sri Marka

eMail
రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం