SRK Quits Smoking: స్మోకింగ్ మానేశానని ప్రకటించిన షారుఖ్ ఖాన్.. మీరు కూడా ధూమపానానికి ఎందుకు దూరం కావాలంటే..
Shah Rukh Khan Quits Smoking: తాను స్మోకింగ్ చేయడం మానేశానని స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తెలిపారు. ఎందుకో కారణాన్ని కూడా వెల్లడించారు. అలాగే, స్మోకింగ్‍నూ అందరూ మానేయాలనేందుకు ఆరు ముఖ్యమైన కారణాలు ఉన్నాయి.
పొగ తాగడం (స్మోకింగ్) మానేయాలని కొందరు తరచూ అనుకుంటారు. అయితే, ఒత్తిడిగా అనిపించో, మనసు లాగేయడం వల్లనో వద్దు అనుకుంటూనే స్మోకింగ్ కొనసాగిస్తూ ఉంటారు. అయితే, మీరు స్మోకింగ్ మానేయాలని అనుకుంటుంటే బాలీవుడ్ బాద్‍షా, స్టార్ హీరో షారుఖ్ ఖాన్‍ను స్ఫూర్తిగా తీసుకోవచ్చు. ఒకానొక సమయంలో రోజుకు 100 సిగరెట్లు తాగానని చెప్పిన షారుఖ్.. తాజాగా స్మోకింగ్ మానేస్తున్నట్టు ప్రకటించారు.
తాను స్మోకింగ్ మానేస్తున్నానని షారుఖ్ ఖాన్ చెప్పేశారు. తన 59వ పుట్టిన రోజు సందర్బంగా గత శనివారం ఈ విషయాన్ని వెల్లడించారు. అభిమానులను కలిసిన సమయంలో స్మోకింగ్ మానేస్తున్నానని అన్నారు. కొంతకాలం కిందటే పొగతాగడం మానేసినా ఇంకా సులభంగా ఊపిరి పీల్చుకోలేకున్నానని అన్నారు. స్మోకింగ్ ఎంత తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుందో దీని ద్వారా అర్థమవుతోంది. మీరు కూడా స్మోకింగ్ ఎందుకు మానేయాలో కారణాలను ఇక్కడ చూడండి.
క్యాన్సర్ ప్రమాదం
సిగరెట్లు, బీడీలు లాంటి పొగాకు ఉత్పత్తులు వాడడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుంది. ఊపిరితుత్తుల క్యాన్సర్, గుండె రోగాలు రావొచ్చు. మరిన్ని దీర్ఘకాలిక వ్యాధులకు పొగతాగడం కారణం అవుతుంది. అందుకే స్మోకింగ్ పూర్తిగా మానేయాలి.
చిరాకు పుట్టించే వాసన
ఎక్కువగా స్మోకింగ్ చేసే వారి చుట్టూ ఎప్పుడూ పొగాకు వాసన వస్తూ ఉంటుంది. దీంతో వారి చుట్టూ ఉండే వారికి కూడా నెగెటివ్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. ఈ వాసనతో వారు చిరాకు పడతారు. ముఖ్యంగా ధూమపానం అలవాటు లేని వారికి ఈ వాసన మరింత అసహ్యంగా అనిపిస్తుంది. మీరు పొగతాగడం వల్ల ఎదుటి వారి ఆరోగ్యానికి కూడా హాని కలుగుతుంది. దీంతో మీకోసం, మీ చుట్టూ ఉండే వారి కోసం కూడా పొగతాగడం ఆపేయాలి.
చర్మం కోసం..
పొగతాగే సమయాల్లో రక్తనాళాలు సన్నగా అయిపోయి చర్మానికి రక్తం, ఆక్సిజన్ సరిగా అందదు. దీంతో చర్మ సమస్యలు వస్తాయి. మీ పెదాలు నల్లగా మారే అవకాశాలు ఉంటాయి. ముఖంలో మెరుపుపోతుంది. చర్మంపై ముడతలకు కూడా కారణం అవుతుంది. ఒకవేళ మీరు స్మోకింగ్ మానేస్తే చర్మం మళ్లీ పూర్వపు స్థితి రావొచ్చు. రక్తప్రసరణ, ఆక్సిజన్ సరఫరా బాగుంటుంది. మళ్లీ చర్మానికి సహజమైన మెరుపు వస్తుంది. అందుకే చర్మం ఆరోగ్యం కూడా స్కిన్ కేర్ ప్రొడక్టులు వాడే కంటే ముందు.. ధూమపానం మానేయాలి.
ఆర్థికంగానూ భారమే..
సిగరెట్లు లాంటి పొగాకు ఉత్పత్తులను ప్రతీ రోజు వాడడం వల్ల ఆర్థికంగానూ నష్టమే చేకూరుతుంది. సిగరెట్లు సాధారంగా ఎక్కువ ధరే ఉంటాయి. వీటిని తాగడం వల్ల డబ్బు వృథా అవుతుంది. అలాగే, ఆరోగ్య సమస్యలు కూడా ఎదురవుతాయి. వైద్యానికి ఖర్చు చేయాల్సి ఉంటుంది. వీటన్నింటి వల్ల ఆర్థికంగా నష్టాలు ఎదురవుతాయి. అందుకే స్మోకింగ్ మానేస్తే డబ్బుపరంగానూ బాగుంటుంది.
చూపు, వినికిడికి రిస్క్
ధూమపానం వల్ల కళ్లు, వినికిడి కూడా దెబ్బ తినే అవకాశం మెండుగా ఉంది. కొన్ని తీవ్రమైన సందర్భాల్లో కంటిచూపు పూర్తిగా కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. వయసురీత్యా వచ్చే సమస్యలు.. పొగతాగడం వల్ల తక్కువ ఏజ్‍లోనే మొదలవుతాయి. స్మోకింగ్ వల్ల చెవి లోపలికి భాగానికి రక్తప్రసరణ సరిగా లేక వినికిడి దెబ్బ తినొచ్చు. అందుకే ముఖ్యమైన భాగాలను కాపాడుకునేందుకు స్మోకింగ్ మానేయండి.
సంతానోత్పతికి కష్టమే
ధూమపానం వల్ల సంతానోత్పత్తికి కూడా ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంటుంది. స్మోకింగ్ చేసే మగవారి వీర్యంలోకి నికోటిన్ చేరి, శుక్రకణాలు దెబ్బ తినే రిస్క్ ఉంటుంది. దీనివల్ల సంతానం కలగడంలో ఇబ్బందులు ఎదురవ్వొచ్చు. పొగతాగే మహిళల్లో గర్భధారణ ఆలస్యంగా ఉంటోందని కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. గర్భం దాల్చిన తర్వాత గర్భస్రావం లాంటి ప్రమాదాలు కూడా ఉంటాయి. అందుకే స్మోకింగ్ ఎప్పటి పరిస్థితుల్లో మానేయాలి.