మనసుకు దగ్గరైన, ప్రియమైన వ్యక్తి మరణించినప్పుడు ఒక్కసారిగా అగాధంలోకి పడిపోతున్నట్టు అనిపిస్తుంది. ఆ సమయంలో కలిగి భావోద్వేగాలను అందరూ తట్టుకోలేరు. కొంతమంది విపరీతమైన బాధతో గుండె రెండు ముక్కలైనట్టు ఫీలవుతారు. ఇలాంటి వారే బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ బారిన పడే అవకాశం ఉంది.
'బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్' అనేది కేవలం మానసిక సమస్య మాత్రమే కాదు. ఇది గుండె సమస్యకు కారణం అవుతుంది. దీనిని వైద్యపరంగా టకోట్సుబో కార్డియోమయోపతి అని పిలుస్తారు.
జర్నల్ ఆఫ్ అమెరికన్ హార్ట్ హెల్త్ లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం మహిళల కన్నా పురుషులే బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ వల్ల బాధ పడతారు. వారు ఈ సమస్య తీవ్రమై మరణించే అవకాశం కూడా ఉంది. కాబట్టి మగవారు మానసికంగా గట్టిగా ఉండాల్సిన అవసరం ఉంది.
బ్రోకెన్ హార్ట్ అనేది మనిషి మానసిక స్థితిని తీవ్రంగా ప్రభావితం చేసే సమస్య. ఈ బ్రోకెన్ హార్ట్ పై జరిగిన ఈ అధ్యయనాన్ని నిశితంగా పరిశీలిద్దాం. ఈ పరిస్థితి మహిళల కంటే పురుషులకు ఎలా ప్రాణాంతకం అవుతుందో తెలుసుకుందాం. 2016 మరియు 2020 మధ్య టాకోట్సుబో కార్డియోమయోపతి ఉన్న 2,00,000 మంది పెద్దల ఆసుపత్రి రికార్డులను పరిశోధకులు పరిశీలించారు.
అయితే బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ బారిన మహిళలు కూడా ఎక్కువగానే పడుతున్నారు. కానీ ఇది పురుషులకే ప్రాణాంతకంగా మారుతోంది. వాస్తవానికి, పురుషులు ఈ బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ తో చనిపోయే అవకాశం రెండు రెట్లు ఎక్కువ. పురుషుల్లో మరణాల రేటు 11.2 శాతం కాగా, మహిళల్లో ఇది సగం అంటే తక్కువగా 5.6 శాతంగా ఉంది.
బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ బారిన పడిన మగవారు హఠాత్తుగా గుండె ఆగిపోవడం, సక్రమంగా లేని హృదయ స్పందన వంటి తీవ్రమైన సమస్యలతో బాధపడుతున్నారు.
అధిక భావోద్వేగ ఒత్తిడి అనేది గుండెను ఆగిపోయేలా చేస్తోంది. ప్రియమైన వ్యక్తి మరణం లేదా వారితో విడిపోవడం అనేవి బలమైన భావోద్వేగ ట్రిగ్గర్లుగా మారుతున్నాయి.
అనారోగ్యం, గాయం లేదా శస్త్రచికిత్స వంటి శారీరక ఒత్తిడి… పురుషులలో ఎక్కువగా కనిపిస్తుంది. పురుషులలో మరణాల రేటు ఎందుకు ఎక్కువగా ఉందో వివరించడానికి కూడా ఇది సహాయపడుతుంది.
మీ భావోద్వేగ శ్రేయస్సును జాగ్రత్తగా చూసుకోవడంతో పాటూ మీ మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ద్వారా గుండెను కాపాడుకోవాలి.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)
టాపిక్