Calm Home Tips: ఈ ఏడు నియమాలు పాటించండి.. ఇల్లు స్వర్గసీమ అయిపోతుంది..
Calm Home Tips: ఇల్లు ప్రశాంతంగా ఉండాలి. రాగానే సేదదీరాలి అనిపించాలి. ఇంటికి రాగానే ఒత్తిడంతా తగ్గిపోవాలి. ఇవన్నీ అవ్వాలంటే కొన్ని నియమాలు పాటించాలి. అవేంటో చూడండి.
ఇంటిని ప్రశాంతంగా మార్చే నియమాలు (pexels)
బయటకెళ్లామంటే మనకు ఎన్నో ఒత్తిడులు, సవాళ్లు, పని భారాలు.. అన్నింటినీ ముగించుకుని ఇంటికి వచ్చామంటే కాస్త హాయిగా అనిపిస్తుంది. అయితే ముందు ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటేనే మనకూ హాయిగా ఉంటుంది. అదే ఇల్లంతా చెల్లా చెదురైన సామాన్లతో, పరిశుభ్రత లేకుండా దుర్వాసన వస్తూ ఉందనుకోండి. వాటన్నింటి వల్లా మనకు చికాకు మరింత ఎక్కువై పోతుంది. అందుకనే ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉండాలంటే కొన్నింటిని తప్పకుండా పాటించాలంటున్నారు మానసిక నిపుణులు. అవేంటంటే..
ఈ 7 నియమాలు పాటించండి:
- హాలంటే సోఫా సెట్‌లు, టీవీలు, టీపాయ్‌లు, కుర్చీలు అన్నీ కచ్చితంగా ఉండాలన్న నిబంధన ఏమీ లేదు. మీ అవసరాన్ని బట్టి మాత్రమే సామాన్లను ఉంచుకోండి. అదనంగా ఒక్కటి కూడా వద్దు. వీటినే విజువల్ నాయిస్ అంటుంటారు. చూడటం వల్ల విసుగును కలిగిస్తాయన్నమాట. అవసరం లేదు అనుకున్న వేటినైనా సరే తీసేయండి.
- ఇంట్లో ఒక దగ్గర పెద్ద డొనేషన్ బాక్స్(అట్టపెట్టె)ని పెట్టుకోండి. ఏది ఎక్కడ అవసరం లేని వస్తువు కనిపించినా తీసుకెళ్లి అందులో వేసేయండి. వీలు కుదిరినప్పుడు వాటిని అవసరం అయిన వారికి ఇచ్చేయండి.
- ఇంట్లో ఓ మూలన మీకు నచ్చిన పుస్తకాలతో, పచ్చని మొక్కలతో, చక్కని కార్నర్ స్పేస్‌ని ఏర్పాటు చేసుకోండి. అక్కడ కూర్చుని ఏవో ఒకటి చదువుకోవడం వల్ల మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది.
- ఇంటిని తక్కువ సామాన్లతో, ఎక్కువ విశాలంగా ఉంచుకోండి. గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా చూసుకోండి. పగటి పూట సహజమైన కాంతి ఇల్లంతా పరుచుకునేలా జాగ్రత్తలు తీసుకోండి. కర్టెన్లు వేసి చీకటి చేయకండి.
- బూజులు, చెత్త లాంటివి ఇల్లంతా పరుచుకుని ఉంటే ఎందుకో అంత ప్రశాంతంగా ఉండదు. తిన్న గిన్నెలు, పండ్ల తొక్కల్లాంటి వాటిని ఎక్కడివి అక్కడ వదిలేయకండి. వీటన్నింటినీ ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోండి. దీని వల్ల ఇల్లు శుభ్రంగా ఉంటుంది. ఈగలు, దోమల్లాంటివి ఎక్కువగా ఇంట్లోకి ఆకర్షితం కావు. చదివేసిన పేపర్లు, పుస్తకాలను ఎప్పటికప్పుడు తీసివేయండి.
- షాపింగ్‌కి వెళ్లినప్పుడు ఏది నచ్చితే అది ఊరికే కొనేయకండి. ఆ వస్తువు అవసరం తగినంత ఉందనుకుంటేనే తీసుకోండి. అనవసరమైన వస్తువుల్ని తెచ్చి పెట్టుకోవడం వల్లా ఇల్లు క్లంజీగా తయారవుతుంది. ఆన్‌లైన్ షాపింగ్ చేసేట్టయితే మీరనుకున్న వస్తువును కార్ట్ లో పెట్టుకుని ఒకరోజు ఆగండి. ఆ తర్వాత కూడా అవసరమే అనిపిస్తే అప్పుడు ఆర్డర్ పెట్టండి. అంతేగానీ, చూసిందళ్లా కొనేయడం మానేయాలి.
- ఆయిల్ డిఫ్యూజర్లలో సహజమైన ఆయిల్స్‌ని వాడటం, వీలైన చోటల్లా పచ్చని మొక్కల్ని పెంచుకోవడం లాంటి వాటి వల్ల ఇల్లు మనకు ఎంతో హాయిగా అనిపిస్తుంది. ఇవన్నీ బయటి విషయాలు. మరి లోపలి నుంచి మనం ఆనందంగా ఉండాలంటే ఎవరినీ గాయపరచకూడదు. ఎవరితోనూ వాదులాటకు దిగకూడదు. మనం లోపలి నుంచి మనస్ఫూర్తిగా ఆనందంగా ఉండేందుకు ప్రయత్నించాలి. అప్పుడే గృహమే కదా స్వర్గ సీమ అనిపిస్తుంది.