Chandrababu buy sarees: సీఎం తన సతీమణికి కొన్న చీరల ధర ఎంతుంటుందో తెలుసా? వాటి ప్రత్యేకతలివే..
Chandrababu buy sarees: చంద్రబాబు ఆయన సతీమణి నారా భువనేశ్వరి కోసం ప్రత్యేకంగా ఏరి కోరి ఖరీదు చేసిన చీరల ప్రత్యేకతలేంటో తెల్సుకోండి.
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన చీరల ఎగ్జిబిషన్‌లో తన సతీమణి కోసం రెండు చీరలు ఖరీదు చేశారు. ఒకటి ఉప్పాడ చీర, మరోటి ధర్మవరం చీరలు. మెరూన్ రంగు ధర్మవరం చీర, ఆకుపచ్చ చీర ఉప్పాడ చీర తన సతీమణి నారా భువనేశ్వరి కోసం ఆయన కొన్నారు. చంద్రబాబు ఏరికోరి సెలెక్ట్ చేసిన చీరలేవో, ఆ చీరల ప్రత్యేకతలేంటో చూసేయండి.
ధర్మవరం చీరలు:
ఆంధ్రప్రదేశ్‌లోని ధర్మవరం పట్టణం ఈ ధర్మవరం చీరలకు ప్రసిద్ధి. పెళ్లి చీరంటే ధర్మవరం చీరే కట్టాలనే మాటా వినే ఉంటారు. ఈ పనితనంలో ఉండే గొప్పతనమే దానికి కారణం. జరీ, పట్టు కలిపి నేసే ఈ ఒక్క చీర తయారీకి కనీసం వారం సమయం అయినా పడుతుంది. ఇవి చూడ్డానికి కాస్త కంచిపట్టు చీరలకు దగ్గరి పోలికలతో ఉంటాయి. కానీ రంగుల్లో, మెరుపులో తేడా స్పష్టంగా ఉంటుంది. వీటి ధర వేలల్లో మొదలై లక్షల దాకా ఉంటుంది. అల్లిక, నాణ్యత బట్టి వీటి ధరలు మారతాయి.
ధర్మవరం చీరల్లో.. చీర అంతా గోల్డ్ బ్రొకేడ్ డిజైన్లు, మోటిఫ్లు ఉంటాయి. ఏనుగులు, నెమళ్లు, కమలాల లాంటి ఆకారాలు చీర అంతటా అల్లి ఉంటాయి. సాంప్రదాయ ధర్మవరం చీరలు ఎక్కువగా పసుపు, ఎరుపు రంగుల్లో తయారు చేసేవాళ్లు. కానీ మారుతున్న ట్రెండ్‌కు తగ్గట్లుగా అనేక రంగుల్లో వీటిని అందుబాటులోకి తెస్తున్నారు. కొత్తరకం చీరల్లో స్టోన్లు, కుందన్లు, సీక్వెన్లు కలగలిపిన డిజైన్లూ ఉంటున్నాయి. పెళ్లికి మీరు ఏ చీర ఎంచుకోవాలనే సందేహంలో ఉంటే ధర్మవరం చీరకే మొదటి ప్రాధాన్యత ఇవ్వండి.
ఉప్పాడ చీరలు:
చంద్రబాబు భువనేశ్వరి కోసం తీసుకున్న మరో చీర ఆకుపచ్చ రంగు ఉప్పాడ చీర. అన్నీ చూసి చూసి ఆ చీర సెలెక్ట్ చేశారాయన. ఈ చీరలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఉప్పాడ అనే తీర ప్రాంత గ్రామం నుంచి తయారయ్యేవే ఉప్పాడ చీరలు. వీటిని జాందాని అల్లిక విధానంతో తయారు చేస్తారు. ఇది చాలా ఏళ్లనాటి అల్లిక పద్దతి. ఈ చీర అంతటా జరీ పనితనం ఉంటుంది. ముట్టుకుంటే చాలా మృదువుగా ఉంటాయీ చీరలు. చాలా సింపుల్ గా ఉండే ఈ చీరలను చిన్న వేడుకల నుంచి పెళ్లి కూతుర్ల దాకా ఎంచుకుంటున్నారు. డిజైన్ బట్టి వీటి తయారీకి నెలల సమయం కూడా పట్టొచ్చు.
మిగతా రకాల పట్టు చీరలతో పోలిస్తే ఉప్పాడ చీరల ధర కాస్త తక్కువే అని చెప్పొచ్చు. చాలా సింపుల్ గా ఉండే ఉప్పాడ చీరలు ఐదు వేల నుంచి అయిదంకెల ధర దాకా అయినా ఉండొచ్చు. వీటిలో ఉండే అనేక రంగుల వల్ల ఈ చీరలు బాగా ప్రాచుర్యం పొందాయి. సాంప్రదాయ రంగుల నుంచి ట్రెండీ పేస్టల్ రంగుల దాకా ప్రతి రంగులోనూ ఉప్పాడ చీర దొరికేస్తుంది. అతి తక్కువ బరువులో ఉండే సౌకర్యవంతమైన చీర కావాలనుకుంటే ఉప్పాడ మంచి ఎంపిక. ఈ చీరకట్టుతో వచ్చే హుందాతనం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.