Women Safety: అమ్మాయిలను ఆపత్కాలంలో ఆదుకునే యాప్స్, వీటిలో ఒక్కటైనా ఫోన్లో ఉండాల్సిందే
Women Safety: ఆపత్కాలం నుంచి మహిళల్ని బయటపడేయడానికి కొన్ని యాప్స్ ఉన్నాయి. వాటిని ఫోన్లో ఇన్‌స్టాల్ చేసి పెట్టుకుంటే ఏ సమయంలోనైనా పనికి రావచ్చు. అలాంటి యాప్స్, ఎమర్జెన్సీ నంబర్లు కూడా చూసేయండి.
మన చుట్టూ జరుగుతున్న సంఘటనలు మన మనసులో నింపుకున్న ధైర్యాన్ని పోగొడతాయి. చీకటిలో ఒంటరిగా నడిచే ధైర్యమున్నా మన నీడని చూసి మనమే భయపడేలా చేస్తాయి. మనుషులు మన పక్కనుంటే తోడుగా ఉన్నారని ధైర్య పడాలో లేదా ఒంటరిగా ఉంటేనే రక్షణ అని ఆలోచించాలో అర్థం కాని సందిగ్ధంలో పడేస్తాయి. మనుషులకు మనుషులతోనే ముప్పు. ఈ ముప్పు గురించి భయపడి బయటికి వెళ్లకుండా మన ఎదుగుదలకి అడ్డుకట్ట వేసుకోలేం. ఆపద వస్తే ఎదుర్కునేలా సిద్ధమవ్వాలి. లేదంటో మార్కెట్, వాకింగ్, ఆఫీస్ వెళ్లాలన్నా జంకాల్సిందే.
ఆపద వచ్చేదీ మనిషితోనే.. మనల్ని రక్షించగలిగేదీ మనుషులే. అలా మీకు రక్షణగా ఉండే కొంతమందికి మీరు ఆపదలో ఉన్నారని తెలియజేయడం చాలా ముఖ్యం. అలా సమయానికి మీ సమాచారం చేరవేసి, మీకు తోడుగా ఉండే యాప్స్ కొన్ని ప్రతి అమ్మాయి ఫోన్లో తప్పకుండా ఉండాలి.
యాప్స్‌తో పాటే తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న టీ సేఫ్ సర్వీసుల గురించి కూడా తెల్సుకోండి. పైన వీడియోలో దీనివల్ల ఎంత ఉపయోగముందో తెలుస్తుంది. వీటితో పాటే మీరు ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు తప్పకుండా ఉండాల్సిన యాప్స్ చూసేయండి. టీ సేఫ్ మొబైల్ యాప్ కూడా అందుబాటులో ఉంది.
సేఫ్టీ యాప్స్:
1. మై సేఫ్టీపిన్ (My SafetiPin):
ఈ యాప్లో మీ స్నేహితులను లేదా కుటుంబ సభ్యులను గార్డియన్లుగా చేర్చుకోవచ్చు. మీరెక్కడున్నారో వాళ్లకు సులభంగా తెలుస్తుంది. అలాగే మీరు ప్రయాణిస్తున్న మార్గానికి సేఫ్టీ స్కోర్ ఇచ్చి అదెంత భద్రత ఉన్న స్థలమో మీకు ముందుగానే చెప్పేస్తుంది. అలాగే మీకు దగ్గర్లో సురక్షితమైన ప్రాంతం ఏముందో చెబుతుంది.
2. బీ సేఫ్(b Safe)
కొన్నిసార్లు మనం ఒకరితో మాట్లాడుతున్నట్లు నటించి కూడా ఆపద నుంచి బయటపడొచ్చు. అలానీ ఎవరికో కాల్ చేసి వాళ్ల నుంచి మీకు ఫోన్ రావాలంటే సమయం పట్టొచ్చు. ఈ యాప్‌లో ఉన్న ఫేక్ కాల్ ఆప్షన్ లో మీకెన్ని సెకన్లలో ఫోన్ రావాలో చెబితే ఫేక్ రింగ్ వస్తుంది. దాంతో మీకెవరో ఫోన్ చేశారని ఎదుటివ్యక్తికి అర్థం అవుతుంది. దీంతోపాటే ఈ యాప్లో ఎమర్జెన్సీ సమయాల్లో సమాచారం అందించేలా ఎస్‌ఓఎస్ బటన్, గార్డియన్స్ ఆప్షన్లున్నాయి. లైవ్‌గా మిమ్మల్ని ట్రాక్ చేసే సదుపాయమూ ఉంది.
3. రక్ష(Raksha) విమెన్ సేఫ్టీ యాప్
ఈ యాప్‌లో మహిళలను అపాయం నుంచి కాపాడే అనేక వీడియోలు, నైపుణ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటుంది. అపాయంలో ఉన్నప్పుడు ఈ యాప్ ఓపెన్ చేయలేకపోతే వాల్యూమ్ బటన్ నొక్కితే ఎమర్జెన్సీ కాంటాక్స్‌కి అలర్ట్ మెసేజ్ వెళ్తుంది. దీంట్లోనూ పోలీసులను కాంటాక్ట్ అయ్యేలా, ఎమర్జెన్సీ కాంటాక్స్ కు అలర్ట్ మెసేజ్ వెళ్లేలాగా సదుపాయం ఉంది.
వీటితో పాటే ఎమర్జెన్సీ సమయాల్లో ఉమెన్ హెల్ప్‌లైన్ నంబర్ 181, పోలీస్ నంబర్ 100 లకు కాల్ చేయొచ్చు. మీరుంటున్న ప్రాంతం బట్టి ఆయా ప్రభుత్వాలు కల్పిస్తున్న మహిళా భద్రతకు సంబంధించిన ప్రత్యేక సదుపాయాల గురించి తప్పక తెల్సుకోండి. ఆ సేవల నంబర్లుంటే మీ ఫోన్లో తప్పక సేవ్ చేసుకోండి.
టాపిక్